central electricity minister
-
ప్రైవేటు చేతుల్లోకి విద్యుత్ పంపిణీ రంగం!
సాక్షి, హైదరాబాద్: ‘టెలికం రంగం తరహాలో విద్యుత్ పంపిణీ రంగాన్ని డీ లైసెన్స్డ్ చేస్తున్నాం. ప్రస్తుతమున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అలాగే ఉంటాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ (వైర్లు) నిర్వహణ డిస్కంల పరిధిలోనే ఉంటుంది. డిస్కంలకు పోటీగా ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకోవచ్చు. వీళ్లు ఎవరి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసి ఎవరికైనా అమ్ముకోవచ్చు. డిస్కంల వైర్లను వాడుకుని తమ వినియోగదారులకు విద్యుత్ అమ్ముకుంటారు. దీంతో విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంల గుత్తాధిపత్యం కనుమరుగవుతుంది..’అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు–2020పై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులు, విద్యుత్ సంస్థల సీఎండీలతో మాట్లాడారు. ‘ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడి వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు అమ్మితే వినియోగదారులు వారి వద్ద విద్యుత్ కొంటారు. పోటీతో వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుంది..’అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ‘ఇకపై డిస్కంలు రెండు రకాల వ్యాపారాలు చేయాలి. వినియోగదారులకు విద్యుత్‌ను అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు ఆపరేటర్లతో వైర్ల వ్యాపారం చేయాలి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే వినియోగదారులపై డిస్కంలు విధించే వీలింగ్ చార్జీలు.. తమ సొంత వినియోగదారులతో సమానంగా ఉండాలి. వివక్షకు ఆస్కారం ఉండదు. ఫలాన వారికి వైర్లు ఇవ్వబోమని డిస్కంలు చెప్పడానికి వీల్లేదు..’అని ఆర్కే తెలిపారు. క్రాస్ సబ్సిడీ కోసం సెంట్రల్ ఫండ్.. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై అధిక విద్యుత్ చార్జీలు విధించి, వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్‌ను డిస్కంలు పంపిణీ చేస్తున్నాయి. దీనిని క్రాస్ సబ్సిడీ అంటారు. విద్యుత్ టారీఫ్‌లో క్రాస్ సబ్సిడీని కొనసాగించడానికి ‘యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్’పేరుతో ప్రత్యేక ఫండ్ పెట్టనున్నామని ఆర్కే సింగ్ తెలిపారు. అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమా చేసి సబ్సిడీ వినియోగదారులకు ఇస్తామన్నారు. ఈ ఫండ్ కేంద్రం పరిధిలో ఉంటుందని వెల్లడించారు. అదనపు చార్జీలు వచ్చే ప్రాంతంలోని ఆపరేటర్లకు లాభాలు, సబ్సిడీ వినియోగదారులున్న ప్రాంతాల్లోని ఆపరేటర్లకు నష్టాలు రావచ్చు. లాభాల్లో ఉన్న ఆపరేటర్ నుంచి అదనపు చార్జీలను ఈ ఫండ్‌లో జమ చేసి నష్టాల్లో ఉండే ఆపరేటర్లకు బదిలీ చేస్తామని ఆయన వివరించారు. లాభాలు వచ్చే ప్రాంతాలను ఆపరేటర్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదని, జిల్లాల వారీగా వారికి కేటాయింపులు చేస్తామని ఆయన తెలిపినట్టు సమాచారం. పీపీఏలన్నీ పంచుకోవాలి.. ‘ప్రస్తుతం డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పీపీఏ) లను తమ వద్దే పెట్టుకోవాలంటే అన్నింటిని పెట్టుకోవాలి. లేకుంటే ప్రైవేటు ఆపరేటర్లతో అన్నింటిని పంచుకోవాలి. అధిక విద్యుత్ ధరలు కలిగిన పీపీఏలను ప్రైవేటు ఆపరేటర్లకు వదులుకుని తక్కువ ధరలు కలిగిన వాటిని తమ వద్దే పెట్టుకుంటామంటే కుదరదు.. డిస్కంలు పీపీఏలను పంచుకోవడానికి ముందుకురాకుంటే ప్రైవేటు ఆపరేటర్లు కొత్త పీపీఏలు చేసుకుంటారు..’అని ఆర్కే సింగ్ వెల్లడించారు. ప్రైవేటు గుత్తాధిపత్యానికి నో చాన్స్.. భవిష్యత్తులో ప్రైవేటు ఆపరేటర్లందరినీ ఓ ప్రైవేటు కంపెనీ కొనేసి ప్రైవేటు గుత్తాధిపత్యానికి తెరతీయడానికి అవకాశం ఇవ్వకుండా విద్యుత్ బిల్లులో ఏమైనా రక్షణ కల్పిస్తారా? అని రాష్ట్రాల అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎవరు తక్కువ ధరకు విద్యుత్ అమ్మితే వినియోగదారులు వారి వద్ద కొంటారని, ప్రైవేటు గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. వినియోగదారులు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీకి మారితే వారికి అదే మీటర్ కొనసాగిస్తారా? విద్యుత్ చౌర్యానికి ఎవరు బాధ్యులు? కేసులెవరు పెట్టాలి? మీటర్ రీడింగ్ ఎవరు తీస్తారు? మీటర్లను ఎవరు నిర్వహిస్తారు? అన్న అంశాలపై పరిశీలన చేస్తామని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్) ప్రాంతీయ బెంచ్‌ను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు కోరాయి. మరి ఉద్యోగుల పరిస్థితేంటి?: ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ విద్యుత్ సవరణ బిల్లు–2020ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ డిస్కంలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారని, ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతిస్తే వారి గతేంటని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుతం మీటర్ రీడింగ్ నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం వరకు అన్ని పనులు ప్రైవేటు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేస్తున్నారని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. ప్రైవేటు ఆపరేటర్లతో విద్యుత్ ఉద్యోగులపై ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రైవేటు ఆపరేటర్లతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ప్రస్తుత ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అక్కడికి వెళ్తారని ఆయన చెప్పినట్టు సమాచారం. తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఆచరణలో తెలంగాణకు సాధ్యం కాదని, ఈ విషయంలో జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని ప్రభాకర్‌రావు కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ను కోరారు. ఈ విషయంపై పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
వ్యక్తిగతంగా సమర్థించను
భద్రాద్రి ‘సబ్ క్రిటికల్’ ప్లాంట్‌పై కేంద్ర విద్యుత్ మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భద్రాద్రి సబ్ క్రిటికల్ విద్యుత్ ప్రాజెక్టుపై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయుష్ గోయల్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘‘సబ్ క్రిటికల్ పాలసీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎవరికీ మినహాయింపులు ఇచ్చింది లేదు. ఏదైనా ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక కారణాలు, ప్రయోజనాలతో మినహాయింపు కోరితే అనుమతించే అంశాన్ని పరిశీలిస్తాం. వ్యక్తిగతంగా సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను సమర్థించను’’ అని గోయల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనలో విద్యుత్ రంగంలో సాధించిన పురోగతిని వివరించడానికి శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల విలేకరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సబ్ క్రిటికల్ బాయిలర్ పరిజ్ఞానంతో తెలంగాణ జెన్కో ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 (4గీ270) మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనుండటం తెలిసిందే. అయితే సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతించరాదని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి ప్రాజెక్టుకు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? అని ప్రశ్నించగా గోయల్ పైవిధంగా స్పందించారు. ఏ రాష్ట్రంలోనైనా విద్యుత్ డిమాండ్, అవసరం ఉండి బొగ్గు లభ్యత, చవకగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటే కచ్చితంగా ఆ రాష్ట్రంలో కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి మద్దతు తెలుపుతామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోబోమని, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) అనుమతితో ఏ రాష్ట్రమైనా కొత్త ప్లాంట్‌ను నిర్మించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని గోయల్ పేర్కొన్నారు. లంచాలిస్తేనే కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారని, ఐదేళ్లలోగా అవినీతిని నిర్మూలించేందుకు త్వరలో కొత్త విధానాన్ని తెస్తామన్నారు. కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తోందంటే సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు అధిక కాలుష్యాన్ని వెదజల్లుతాయి. ఎక్కువ బొగ్గును కాల్చి తక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ తో పోల్చితే అధునాతన సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల వల్ల తక్కువ కాలుష్యం తోపాటు ఎక్కువ విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఈ నేపథ్యంలో 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి కొత్త సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లకు అనుమతి ఇవ్వకూడదని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. అయితే, తక్కువ సమయంలో భద్రాద్రి ప్లాంట్‌ను నిర్మించి రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చేందుకు ఇండియా బుల్స్ అనే కంపెనీ కోసం బీహెచ్ఈఎల్ సిద్ధం చేసిన సబ్ క్రిటికల్ బాయిలర్లను వినియోగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇండియా బుల్స్‌కు బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేయడం తో ఆ కంపెనీ కోసం సిద్ధం చేసిన సబ్ క్రిటికల్ బాయిలర్లను ‘భద్రాద్రి’ కోసం వినియోగిస్తున్నారు. -
ఇరు రాష్ట్రాల విద్యుత్ వివాదాలు పరిష్కరిస్తాం: పీయూష్
దేశవ్యాప్తంగా అన్ని గృహాలకు విద్యుత్ అందించాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 500 మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ మొత్తం రెండుమూడు నెలలో ఆంధ్రప్రదేశ్‌కు అందజేస్తామని చెప్పారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఆ భేటీ ముగిసిన అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలు నెలకొన్నాయని పీయూష్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే ఆ వివాదాలు ఏపీ పునర్విభజన చట్టం ఆధారంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టేనట్లు వివరించారు. అందుకోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్లు బిగిస్తామని పీయూష్ గోయల్ విశదీకరించారు. -
ఆంధ్రప్రదేశ్ లో 24 గంటలు విద్యుత్ సరఫరా: సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్‌కు 500 మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేందుకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంసిద్ధత వ్యక్తం చేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి గోయల్‌తో సుదీర్ఘ భేటీ అనంతరం సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడారు. ఎంపీటీసీ లైన్ల ద్వారా ఈ విద్యుత్ సర్దుబాటు చేస్తారని ఆయన వివరించారు. దాంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందుతుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు. సౌర, పవన విద్యుత్‌పై కూడా ఆ సమావేశంలో కేంద్ర మంత్రి, చంద్రబాబుల మధ్య చర్చ జరిగినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో బొగ్గు సరఫరాపై కూడా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని సుజనా చౌదరి వెల్లడించారు.