ఆంధ్రప్రదేశ్ లో 24 గంటలు విద్యుత్ సరఫరా: సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్కు 500 మెగావాట్ల విద్యుత్ను ఇచ్చేందుకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంసిద్ధత వ్యక్తం చేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి గోయల్తో సుదీర్ఘ భేటీ అనంతరం సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడారు.
ఎంపీటీసీ లైన్ల ద్వారా ఈ విద్యుత్ సర్దుబాటు చేస్తారని ఆయన వివరించారు. దాంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందుతుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు. సౌర, పవన విద్యుత్పై కూడా ఆ సమావేశంలో కేంద్ర మంత్రి, చంద్రబాబుల మధ్య చర్చ జరిగినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో బొగ్గు సరఫరాపై కూడా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని సుజనా చౌదరి వెల్లడించారు.