ఇరు రాష్ట్రాల విద్యుత్ వివాదాలు పరిష్కరిస్తాం: పీయూష్
దేశవ్యాప్తంగా అన్ని గృహాలకు విద్యుత్ అందించాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ను అమలు చేస్తామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 500 మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ మొత్తం రెండుమూడు నెలలో ఆంధ్రప్రదేశ్కు అందజేస్తామని చెప్పారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.
ఆ భేటీ ముగిసిన అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలు నెలకొన్నాయని పీయూష్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే ఆ వివాదాలు ఏపీ పునర్విభజన చట్టం ఆధారంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టేనట్లు వివరించారు. అందుకోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్లు బిగిస్తామని పీయూష్ గోయల్ విశదీకరించారు.