2016 నాటికి అందరికీ విద్యుత్ | Power supply for all till 2016 | Sakshi
Sakshi News home page

2016 నాటికి అందరికీ విద్యుత్

Published Wed, Sep 17 2014 1:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

2016 నాటికి అందరికీ విద్యుత్ - Sakshi

2016 నాటికి అందరికీ విద్యుత్

  • ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 2 నుంచి పథకం అమలు
  •   తొలుత 9 మునిసిపాలిటీలు, 39 మండలాల్లో.. దశలవారీగా విస్తరణ
  •   నిరంతర విద్యుత్ సరఫరాకు రూ. 54,332 కోట్లు అవసరమని అంచనా 
  •   ఇందులో కేంద్రం నుంచి సాయంగా ఐదేళ్లలో రూ. 15,718 కోట్ల నిధులు
  •   రాష్ట్రంలో కొత్తగా 6,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టులు ఖరారు
  •   విశాఖపట్నం వద్ద ఎన్‌టీపీసీ థర్మల్ యూనిట్.. సీమలో సోలార్ పవర్
  •   విద్యుత్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరు ఒప్పందాలు ఖరారు
  •  
     సాక్షి, హైదరాబాద్: ఆంధ్రపదేశ్‌లో నిరంతర విద్యుత్ అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. హైదరాబాద్ లేక్‌వ్యూ అతిథి గృహంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు రెండు ప్రభుత్వాల మధ్య మొత్తం ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్‌గోయల్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుల సమక్షంలో.. నిరంతర విద్యుత్ ఒప్పంద పత్రాలను కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతిఅరోరా, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌లు ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. దీంతో అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ పథకం దశల వారీగా అందుబాటులోకి వస్తుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఇది వర్తిస్తుంది. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పరస్పర సహకారంతో 6,500 మెగావాట్లు ఉత్పత్తి చేయాలని ఇరు ప్రభుత్వాలు సంకల్పించాయి. విశాఖపట్నం పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది. రాయలసీమలో 2,500 ఆల్ట్రా మెగా సోలార్ పార్క్‌ను నిర్మిస్తారు. 
     
    కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ కేంద్రాలను, కడపలో మరో 500 మెగావాట్ల సామర్థ్యంతో ఇంకో సౌరవిద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తారు. నిరంతర విద్యుత్‌కు మొత్తం రూ. 54,332 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో రూ. 15,718 కోట్లు ఐదేళ్ళలో కేంద్ర సాయంగా అందుతుంది. తొలుత రెండు కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలు, 39 మండలాలకు పథకాన్ని అమలు చేస్తారు. దశల వారీగా దీన్ని విస్తరిస్తూ, 2016 నాటికి అందరికీ అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. కార్యక్రమంలో కేంద్ర ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ జ్యోతి అరోరా, ఎన్‌టీపీసీ చైర్మన్ అరూప్‌రాయ్, కేంద్ర సోలార్ ఎనర్జీ ఎండీ రాజేంద్రకుమార్ నిమ్జే, కేంద్ర సంప్రదాయ ఇంధన వనరుల శాఖ జాయింట్ డెరైక్టర్ తరుణ్‌కపూర్, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఇంధన పొదుపు సర్వీస్ ఎండీ సరుబ్‌కుమార్, సభ్యుడు ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
     ఇవీ ఒప్పందాలు...
     
     విశాఖపట్నం పూడిమడక వద్ద 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ఆల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తారు. ఎన్‌టీపీసీ దీనికి రూ. 20 వేల కోట్లు వెచ్చిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా 1,200 ఎకరాల స్థలాన్ని అందించింది. ఈ ప్రాజెక్టు 2019-20 నాటికి పూర్తవుతుంది. 30 వేల మిలియన్ యూనిట్ల ఉత్పత్తితో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు విద్యుత్‌ను 85 శాతం రాష్ట్ర అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. 
     
     కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఉపయుక్తంగా ఉండే 2,500 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం, నెడ్‌క్యాప్, ఎన్‌టీపీసీలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తాయి. దీనికోసం అనంతపురం జిల్లా కుంట మండలంలో 5,500 ఎకరాలను గుర్తించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఏపీ డిస్కమ్ కొనుగోలు చేస్తుంది. 
     
     రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో సోలార్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం 5,000 హెక్టార్ల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించింది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వాలి. ఏపీ జెన్కో, డిస్కమ్‌లు వీటిల్లో ఏర్పాటు చేసే ప్రాజెక్టులను ఎంపిక చేస్తాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పార్కుగా ప్రభుత్వం పేర్కొంది. 
     
     కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో నిర్మించే సోలార్ పార్కుల మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం, లేదా మెగావాట్‌కు రూ. 20 లక్షలు వెచ్చిస్తుంది. వీటితో రోడ్లు, నీటి సౌకర్యం అభివృద్ధి చేస్తారు. సెసీ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. కేంద్ర గ్రాంట్ కాకుండా, ట్రాన్సిమిషన్ అవసరాల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఒప్పందంలో పొందుపరిచారు. 
     
     ఇంధన పొదుపుపై కేంద్ర, రాష్ట్ర సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో కొన్ని చర్యలు తీసుకుంటాయి. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని 4 ప్రభుత్వ రంగ విభాగాలు, ఎన్‌టీపీసీ, వపర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర సంస్థలు విద్యుత్ పొదుపుపై దృష్టి పెడతాయి. 
     
     ఇదేవిధంగా కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఇంధన నష్టాలను నివారించేందుకు సంయుక్త భాగస్వామ్యంతో కొన్ని చర్యలు తీసుకుంటాయి. దీనిలో భాగంగా వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్పులను అమరుస్తారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement