వ్యక్తిగతంగా సమర్థించను | Defended as an individual | Sakshi
Sakshi News home page

వ్యక్తిగతంగా సమర్థించను

Published Sat, May 21 2016 5:33 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

వ్యక్తిగతంగా సమర్థించను - Sakshi

వ్యక్తిగతంగా సమర్థించను

భద్రాద్రి ‘సబ్ క్రిటికల్’ ప్లాంట్‌పై కేంద్ర విద్యుత్ మంత్రి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భద్రాద్రి సబ్ క్రిటికల్ విద్యుత్ ప్రాజెక్టుపై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయుష్ గోయల్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘‘సబ్ క్రిటికల్ పాలసీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎవరికీ మినహాయింపులు ఇచ్చింది లేదు. ఏదైనా ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక కారణాలు, ప్రయోజనాలతో మినహాయింపు కోరితే అనుమతించే అంశాన్ని పరిశీలిస్తాం. వ్యక్తిగతంగా సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను సమర్థించను’’ అని గోయల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనలో విద్యుత్ రంగంలో సాధించిన పురోగతిని వివరించడానికి శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల విలేకరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

సబ్ క్రిటికల్ బాయిలర్ పరిజ్ఞానంతో తెలంగాణ జెన్‌కో ఖమ్మం జిల్లా మణుగూరులో  1,080 (4గీ270) మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనుండటం తెలిసిందే. అయితే సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతించరాదని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి ప్రాజెక్టుకు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? అని ప్రశ్నించగా గోయల్ పైవిధంగా స్పందించారు. ఏ రాష్ట్రంలోనైనా విద్యుత్ డిమాండ్, అవసరం ఉండి బొగ్గు లభ్యత, చవకగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటే కచ్చితంగా ఆ రాష్ట్రంలో కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి మద్దతు తెలుపుతామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోబోమని, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) అనుమతితో ఏ రాష్ట్రమైనా కొత్త ప్లాంట్‌ను నిర్మించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని గోయల్ పేర్కొన్నారు. లంచాలిస్తేనే కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారని, ఐదేళ్లలోగా అవినీతిని నిర్మూలించేందుకు త్వరలో కొత్త విధానాన్ని తెస్తామన్నారు.

 కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తోందంటే
 సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు అధిక కాలుష్యాన్ని వెదజల్లుతాయి. ఎక్కువ బొగ్గును కాల్చి తక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ తో పోల్చితే అధునాతన సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల వల్ల తక్కువ కాలుష్యం తోపాటు ఎక్కువ విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఈ నేపథ్యంలో 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి కొత్త సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లకు అనుమతి ఇవ్వకూడదని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. అయితే, తక్కువ సమయంలో భద్రాద్రి ప్లాంట్‌ను నిర్మించి రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చేందుకు ఇండియా బుల్స్ అనే కంపెనీ కోసం బీహెచ్‌ఈఎల్ సిద్ధం చేసిన సబ్ క్రిటికల్ బాయిలర్లను వినియోగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇండియా బుల్స్‌కు బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేయడం తో ఆ కంపెనీ కోసం సిద్ధం చేసిన సబ్ క్రిటికల్ బాయిలర్లను ‘భద్రాద్రి’ కోసం వినియోగిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement