Central Vigilance
-
అవినీతిపరులను వదిలిపెట్టొద్దు
న్యూఢిల్లీ: అవినీతిని అరికట్టే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అవినీతి వ్యతిరేక సంస్థలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నీతిమాలిన వ్యవహారాలను నియంత్రించేటప్పుడు స్వార్థపరులు దర్యాప్తు సంస్థలకు మకిలి అంటించే ప్రయత్నం చేస్తుంటారని, సవాళ్లు ఎదురైనా ఆత్మరక్షణలో పడిపోవద్దని చెప్పారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహనా వారోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అవినీతిపరులు ఎంత గొప్పవారైనా సరే వదిలిపెట్టొద్దని సీవీసీతోపాటు ఇతర సంస్థలకు, అధికారులకు సూచించారు. అక్రమార్కులు రాజకీయంగా, సామాజికంగా రక్షణ పొందకుండా చూడాల్సిన బాధ్యత సీవీసీలాంటి సంస్థలపై ఉందన్నారు. ప్రతి అవినీతిపరుడిని జవాబుదారీగా మార్చడం సమాజం విధి అని చెప్పారు. అలాంటి వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యమని తెలిపారు. తప్పుడు పనులకు పాల్పడినవారు ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రముఖులుగా చెలామణి అవుతూ యథేచ్ఛగా తిరుగుతున్నారని, జనం సైతం వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారని, మన సమాజానికి ఇలాంటి పరిణామం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఆ జాడ్యాలను వదిలిస్తున్నాం.. సీవీసీ లాంటి సంస్థలు దేశ సంక్షేమానికి పాటుపడుతున్నాయని, నిజాయితీగా పని చేస్తున్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ చెప్పారు. మనం రాజకీయ అజెండాతో పనిచేయడం లేదని, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే మన బాధ్యత అని ఉద్బోధించారు. అవినీతి వ్యతిరేక సంస్థలు తమ ఆడిటింగ్, ఇన్స్పెక్షన్లను టెక్నాలజీ సాయంతో ఆధునీకరించుకోవాలని సూచించారు. అవినీతిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించడం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వ శాఖలు, విభాగాలన్నీ అవినీతిపై యుద్ధం చేయాలన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతిని సహించలేని పరిపాలనా వ్యవస్థ కావాలన్నారు. ప్రభుత్వ అధినేతగా కొనసాగుతున్న తనపైనా ఎన్నోసార్లు బురద చల్లారని, దూషించారని తెలిపారు. నిజాయతీ, నిర్భీతిగా పనిచేస్తే ప్రజలు మన వెంటే మద్దతుగా నిలుస్తారని వివరించారు. బ్రిటిషర్ల పాలనలో ఆరంభమైన అవినీతి, దోపిడీ, వనరులపై గుత్తాధిపత్యం వంటి జాడ్యాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగాయని, గత ఎనిమిదేళ్లుగా సంస్కరణల ద్వారా వాటిని వదిలిస్తున్నామని, పాలనలో పారదర్శకతను ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఫిర్యాదుల స్థితిగతులపై పోర్టల్ సీవీసీ ఆధ్వర్యంలో నూతన ‘కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్’ పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు. అవినీతిపై తాము ఇచ్చిన ఫిర్యాదుల స్థితిగతులను ఈ పోర్టల్ ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ‘ఎథిక్స్, గుడ్ ప్రాక్టీసెస్: కంపైలేషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆన్ ప్రివెంటివ్ విజిలెన్స్’ అనే అంశంపై పుస్తకాలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ‘అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతి రహిత భారతం’ అనే అంశంపై సీవీసీ దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులకు అవార్డులు అందజేశారు. -
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 టు రిపీల్ త్రీ ఫామ్ లాస్’’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. చదవండి: ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ స్థలంపై పిటిషన్ కొట్టివేత ఉభయసభల్లో చేపట్టనున్న బిల్లుల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్లాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు కూడా ఉండటం గమనార్హం. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పెంచేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌లు తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా తాత్కాలికంగా దఖలుపడిన అధికారాలను చట్టరూపంలో శాశ్వతం చేయనుంది. చదవండి: సాగు చట్టాల నివేదిక విడుదల చేయండి నాలుగునెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎస్టీ, ఎస్సీ కులాల జాబితాలో మార్పుచేర్పులు చేసే చట్టాన్ని కూడా కేంద్రం ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. త్రిపుర ఎస్సీ, ఎస్టీ జాబితా సవరణ బిల్లు కూడా పార్లమెంటు ముందుకు రానుంది. హైకోర్టు– సుప్రీంకోర్టు జడ్జీల (సర్వీసు నిబంధనలు, వేతనాలు) సవరణ బిల్లు–2021ను కూడా కేంద్రం రాబోయే సమావేశాల్లో ఉభయసభల ముందుంచనుంది. మనుషుల అక్రమ రవాణా (నిరోధం, రక్షణ, పునరావాసం) బిల్లు–2021 కూడా ఈ 26 బిల్లుల జాబితాలో ఉంది. నవంబరు 29న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు డిసెంబరు 23వ తేదీదాకా జరిగే విషయం తెలిసిందే. -
బుక్కిందంతా కక్కాల్సిందే
సాక్షి, మిర్యాలగూడ : సంచలనం కలిగించిన తవుడు జీఎస్టీ బుక్కిన కేసును సెంట్రల్ జీఎస్టీ విజిలెన్స్ అండ్ ఇంటలిజెన్స్ అధికారులు పకడ్బందీగా విచారిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన తవుడు రవాణా జీఎస్టీలో ఎంత బుక్కారో అంతకు మూడింతలు కక్కించే విధంగా విచారిస్తున్నారు. మిర్యాలగూడలో ఉన్న 15 మంది తవుడు కమీషన్ ఏజెంట్లను ఐదు రోజుల పాటు విచారించిన అనంతరం వైజాగ్‌లోని సెం ట్రల్ కార్యాలయానికి రికార్డులు తరలించారు. కాగా రికార్డుల ఆధారంతో పాటు కమీషన్ ఏజెంట్లు చెప్పిన విషయాల ఆధారంగా రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. మిర్యాలగూడలో 80 పార్బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా సగానిపైగా మిల్లులకు నోటీసులు జారీ చేశారు. తవుడు జీఎస్టీ కేసును మిల్లర్లకు ఇచ్చిన నోటీసుల ఆధారంగా విచారించనున్నారు. వైజాగ్ కార్యాలయంలో విచారణ తవుడు జీఎస్టీ ఎగ్గొట్టిన కేసులో నోటీసులు అందుకున్న రైస్ మిల్లర్లను వైజాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి విచారణకు హాజరుకావాలని నోటీసులలో ఇంటలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చిన మిల్లర్ల పూర్తి సమాచారం విజిలెన్స్ అండ్ ఇంటలిజెన్స్ అధికారుల వద్ద ఉన్నందున వారు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగానే వైజాగ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. నోటీసులు ఇచ్చిన మిల్లర్లందరినీ అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయిలో విచారించనున్నారు. మూడింతలు కక్కాల్సిందే తవుడు జీఎస్టీలో మోసానికి పాల్పడిన మిల్లర్లు, కమీషన్ ఏజెంట్ల నుంచి జీఎస్టీ ఉన్నతాధికారులు మూడింతలు కక్కించనున్నారు. బ్యాం కు ఖాతాలతో పాటు మెయిల్ సమాచారం, బిల్లులు, రికార్డులు పూర్తి స్థాయిలో వైజాగ్ కార్యాలయానికి తరలించారు. కాగా మిర్యాలగూడ జీఎస్టీ కార్యాలయంలో ఒక్కొక్క కమీషన్ ఏజెంటు వారీగా విచారించిన అధికా రులు వైజాగ్ కార్యాలయంలో మిల్లర్లను ఒక్కొక్కరిగా విచారించనున్నారు. మిల్లర్ల తర్జనబర్జన తవుడు జీఎస్టీ బుక్కిన కేసులో సెంట్రల్ జీఎస్టీ ఉన్నతాధికారులు విచారిస్తున్నందున మిర్యాలగూడలోని మిల్లర్లు తర్జనభర్జన పడుతున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ చుట్టూ చెక్కర్లు కొట్టిన మిల్లర్లు బుధవారం అత్యవసరంగా మిర్యాలగూడలోని రైస్ మిల్లర్ల భవనంలో సమావేశం నిర్వహించుకున్నారు. సమావేశంలో తవుడు జీఎస్టీ బుక్కిన కేసులో నోటీసులు అందుకున్న విషయంపై చర్చిం చారు. అదే విధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెలలో నిర్వహించాల్సి ఉండగా తవుడు జీఎస్టీ విచారణ జరుగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
మార్పుల్లేని లోక్‌పాల్ బడ్జెట్
న్యూఢిల్లీ: అవినీతి కట్టడికి ఏర్పాటు చేయనున్న లోక్‌పాల్ కోసం కేటాయించిన రూ.4.29 కోట్ల బడ్జెట్లో ఎలాంటి మార్పులు లేవు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు కేటాయించిన బడ్జెట్లో మాత్రం 1.5 కోట్ల స్వల్ప వృద్ధి కనిపించింది. గురువారం పార్లమెంట్లో జైట్లీ సమర్పించిన 2018–19 బడ్జెట్ లెక్కల ప్రకారం, అవినీతి నిరోధానికి ఏర్పాటు చేయబోయే లోక్పాల్కోసం 4.29 కోట్లు కేటాయించారు. -
ప్రజల భాగస్వామ్యంతో అవినీతికి అడ్డుకట్ట
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి హైదరాబాద్: అన్ని రంగాల్లో తిష్ట వేసిన అవినీతి మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరముందని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరి అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన విజిలెన్స్ స్టడీ సర్కిల్ (హైదరాబాద్) 14వ వార్షికోత్స వంలో ఆయన మాట్లాడారు. అవినీతికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు, ఉద్యోగుల నుంచి పొందే వ్యవస్థలను తయారు చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు రంగానికి కూడా అవినీతి అనేది పెద్ద సమస్యగా మారిందని, వారిని కూడా స్టడీ సర్కిల్లో భాగస్వామ్యం చేయాలని అభిప్రాయపడ్డారు. త్వరలో కొత్త విజిలెన్స్ మాన్యువల్స్ 2005 నాటి విజిలెన్స్ మాన్యువల్స్ అమలులో ఉన్నాయని,, కాలానికి అనుగుణంగా వాటిని మార్చా ల్సిన అవసరం ఉందని సీవీసీ చౌదరి అన్నారు. కొత్తగా రూపొందించిన మాన్యువల్స్ నెల రోజుల్లో అందుబాటులో కి వస్తాయని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక వెబ్సైట్ ప్రారంభించి అందులో ఒక ప్రతిజ్ఞ పెట్టిందని, ఇప్పటి వరకు 16 లక్షల మంది ఇందులోకి వచ్చారని చెప్పారు. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ అకాడమితో కలసి పోస్టల్ శిక్షణను ప్రారంభిస్తున్నామని చెప్పారు. తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ కేఆర్ నందన్ మాట్లాడుతూ అవినీతితోపాటు సంస్థలో జరిగే అధికారుల నిర్లక్ష్యం, నిర్ణయం తీసుకోవడం జాప్యం, పరిపాలన వైఫల్యాలను గుర్తించే బాధ్యత విజిలెన్స్‌కు ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ప్రతిభ కనబరచిన అధికారులను మెమొంటో, నగదు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ సుబ్రమణియన్, అధ్యక్షుడు టీవీ రెడ్డి, సలహాదారులు ముజిబ్ పాష షేక్ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమే!
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి తిరుచానూరు : నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమేనని, మరికొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరి అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఆయన కుటుంబ సమేతంగా తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ మాధవకుమార్లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశంలో అవినీతి, అరాచకం, ఉగ్రవాదం అంతమొందుతుందన్నారు. -
జన్‌ధన్ ఖాతాల పై దృష్టి సారించాం
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి పామర్రు: కమీషన్లు ఇచ్చి అక్రమంగా జన్‌ధన్ ఖాతాల్లో నగదు వేసుకున్న వారి వివరాలను ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖల ద్వారా పరిశీలిస్తున్నట్లు సెంట్రల్ విజిలెన్స కమిషనర్ కొసరాజు వీరయ్య చౌదరి తెలిపారు. ఏపీలోని కృష్ణాజిల్లా పామర్రులో ఆయన శనివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పది నోట్లలో ఒక నకిలీ నోటు చెలామణి అవుతోందన్నారు. అలాగే పెద్ద నోట్లతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీని వల్ల రైతులతో పాటు లీగల్‌గా సంపాదించుకున్న వారు కొంత ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని చెప్పారు. కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కొసరాజు స్వప్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మా అనుమతి లేకుండా నియమించొద్దు
సీవీసీ, వీసీలపై కేంద్రానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ), విజిలెన్స్ కమిషనర్(వీసీ)లను నియమించే ముందు తమ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఎంపిక ప్రక్రియ గురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. ‘‘ఎవరిని నియమించారన్నది మాకు అవసరం లేదు. కానీ తగిన పద్ధతిలో ఆ నియామకం జరిగిందా లేదా అన్నది చూడడమే మా కర్తవ్యం. ఇకపై మా అనుమతి లేకుండా ఆయన(అటార్నీ జనరల్) ఈ నియామకాల విషయంలో చర్యలు తీసుకోరని మేం విశ్వసిస్తున్నాం. మీరు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లడానికి ముందు మా దగ్గరకు రండి(అనుమతి కోసం)’’ అని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ.. సీవీసీ, వీసీల ఎంపిక ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతిచ్చింది.