ప్రజల భాగస్వామ్యంతో అవినీతికి అడ్డుకట్ట
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి
హైదరాబాద్: అన్ని రంగాల్లో తిష్ట వేసిన అవినీతి మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరముందని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరి అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన విజిలెన్స్ స్టడీ సర్కిల్ (హైదరాబాద్) 14వ వార్షికోత్స వంలో ఆయన మాట్లాడారు. అవినీతికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు, ఉద్యోగుల నుంచి పొందే వ్యవస్థలను తయారు చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు రంగానికి కూడా అవినీతి అనేది పెద్ద సమస్యగా మారిందని, వారిని కూడా స్టడీ సర్కిల్‌లో భాగస్వామ్యం చేయాలని అభిప్రాయపడ్డారు.
త్వరలో కొత్త విజిలెన్స్ మాన్యువల్స్
2005 నాటి విజిలెన్స్ మాన్యువల్స్ అమలులో ఉన్నాయని,, కాలానికి అనుగుణంగా వాటిని మార్చా ల్సిన అవసరం ఉందని సీవీసీ చౌదరి అన్నారు. కొత్తగా రూపొందించిన మాన్యువల్స్ నెల రోజుల్లో అందుబాటులో కి వస్తాయని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక వెబ్‌సైట్ ప్రారంభించి అందులో ఒక ప్రతిజ్ఞ పెట్టిందని, ఇప్పటి వరకు 16 లక్షల మంది ఇందులోకి వచ్చారని చెప్పారు. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ అకాడమితో కలసి పోస్టల్ శిక్షణను ప్రారంభిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ కేఆర్ నందన్ మాట్లాడుతూ అవినీతితోపాటు సంస్థలో జరిగే అధికారుల నిర్లక్ష్యం, నిర్ణయం తీసుకోవడం జాప్యం, పరిపాలన వైఫల్యాలను గుర్తించే బాధ్యత విజిలెన్స్‌కు ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ప్రతిభ కనబరచిన అధికారులను మెమొంటో, నగదు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ సుబ్రమణియన్, అధ్యక్షుడు టీవీ రెడ్డి, సలహాదారులు ముజిబ్ పాష షేక్ తదితరులు పాల్గొన్నారు.