సీజీజీ పోస్టుపై ఏపీ కిరికిరి!
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డీజీ పోస్టుపై వివాదం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డెరైక్టర్ జనరల్ పోస్టు వివాదానికి కేంద్ర బిందువు అయింది. విభజన అనంతరం తెలంగాణకు చెందిన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు సీజీజీ డీజీగా కొనసాగుతున్నారు. ఇదే పోస్టులో ఐఏఎస్ అధికారి ఎంకే మీనాను నియమిస్తూ బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై సీజీజీలోని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. మీనా బాధ్యతలు చేపడితే అడ్డుకుంటామని ప్రకటించారు. ఈ వ్యవహారం గతంలో న్యాక్ డెరైక్టర్ నియామకం తరహాలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సీజీజీ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు.. బుధవారం నుంచి సెలవుపై విదేశాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సీజీజీ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రామకృష్ణారావు సెలవులో ఉన్నన్ని రోజులు సీజీజీ డీజీ బాధ్యతలను శివశంకర్ పర్యవేక్షిస్తారని ఆ ఉత్తర్వులో పేర్కొంది కూడా. కానీ ఇదే రోజున ఏపీ ప్రభుత్వం మీనాకు సీజీజీ డీజీగా బాధ్యతలు అప్పగించింది. తమ ప్రభుత్వం ఒక అధికారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. ఆ పోస్టులో మరొకరిని నియమించడం ఏమిటని ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నియమించిన ఎంకే మీనా బాధ్యతలు తీసుకోవడానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.