
ఢిల్లీ నుంచి సీఎస్ మహంతికి పిలుపు
హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ మహంతికి హస్తిన నుంచి పిలుపు వచ్చింది. బుధవారం కేంద్ర హోంశాఖ సమావేశం నేపథ్యంలో విభజన తేదీ ఖరారుకే సీఎస్కు ఢిల్లీ నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించాలా ? లేక కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా అనే దానిపై కాంగ్రెస్ హై కమాండ్ ఎటు తేల్చుకోలేక పోతోంది.
కాగా మహంతి ఈనెల 28వ తేదీతో పదవీ విరమణ అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) గౌరవ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పదవీ విరమణకు ముందుగా సీసీజీ గౌరవ అధ్యక్షునిగా తనను నియమించుకుంటూ సీఎస్ హోదాలో మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా సీజీజీలోనే జరగనుంది.
రాష్ట్ర విభజన సమాచారాన్ని కేంద్రానికి చేరవేయడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంలో మహంతితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణారావు కీలక భూమిక పోషించారు. విభజన తర్వాత పంపిణీలోనూ ఇరువురు కీలక భూమిక నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.