ఎట్టకేలకు రూ.1,500 కోట్లు!
* రాష్ట్రానికి కేంద్ర నిధులు
* మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనందున
* మరో రూ.1,500 కోట్లకు మాత్రం బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయినందున తాను ఇచ్చే గ్రాంట్లలో సగం నిధులు విడుదల చేయడానికి కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు లేని కారణంగా 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ఆపేసింది. దాదాపు రూ.3 వేల కోట్లు రాష్ట్రానికి రాకుండా ఆగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే తప్ప.. నిధులు విడుదల చేసేది లేదంటూ కేంద్రం తేల్చిచెప్పింది.
ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు మాత్రం పూర్తి చేయగలిగిన రాష్ట్ర ప్రభుత్వం.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించామని, నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే పంచాయతీ ఎన్నికలతోపాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహిస్తేనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం తొలుత పేర్కొంది. కానీ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఆగిపోవడం వల్ల పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు పదేపదే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కొంత మెత్తపడింది. సగం నిధులు విడుదల చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
రూ.1500 కోట్ల నిధులు ఈనెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనందున మరో రూ.1,500 కోట్లు మాత్రం విడుదలయ్యే పరిస్థితి లేదు. విడుదలయ్యే రూ.1,500 కోట్ల నిధుల్లో 70 శాతం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు, 20% నిధులు జిల్లా పరిషత్‌లకు, 10% నిధులు మండల పరిషత్‌లకు వెళ్లనున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం నిధులను పంచాయతీలకు జనాభా ఆధారంగా పంపిణీ చేస్తుందా..? నిధుల విడుదలపై మౌఖిక ఆదేశాలతో ఆంక్షలు విధిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కేంద్రం నిధులు విడుదల చేసినప్పుడు రాష్ట్ర ఖజానాలో వేసుకున్న సర్కారు వాటి విడుదలలో విపరీతమైన జాప్యం చేసింది.
తలసరి గ్రాంటు పెంపు?
గ్రామ పంచాయతీలకు ఇచ్చే తలసరి గ్రాంటును రూ.4 నుంచి రూ.8కి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. సర్పంచుల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న సర్కారు తలసరి గ్రాంటు పెంచడానికి అంగీకరించినట్లు తెలిసింది.