ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన సీనియర్ అధికారిపై చేయి చేసుకున్నారన్న కారణంగా ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంతో ఢిల్లీలోని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధిస్తుందన్న వదంతులు వ్యాపించాయి. కేజ్రివాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందేనంటూ బీజేపీ ఢిల్లీ శాఖ ఓ పక్క బలంగా డిమాండ్ చేస్తుండడం, ఢిల్లీలో ప్రభుత్వం కుప్పకూలి పోయిందంటూ ‘అసోసియేషన్స్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్స్’ ప్రకటన విడుదల చేయడం ఈ వదంతులకు మరింత బలం చేకూరుస్తోంది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంగానీ, బీజేపీ కేంద్ర నాయకులుగానీ ఇంతవరకు నోరు విప్పలేదు. చర్చల ద్వారానే ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. కేజ్రివాల్ అధికార నివాసంలో ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం ఆప్ ఎమ్మెల్యేలు అమానతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వల్‌లు తనపై చేయి చేసుకున్నారంటూ ఆ మరుసటి రోజు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అంషు ప్రకాష్ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను కలుసుకొని ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం, ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేయడం, జుడీషియల్ కస్టడీకి పంపించడం తదితర పరిణామాలు తెల్సినవే.
ఫిబ్రవరి 23వ తేదీన ఢిల్లీ పోలీసులు అనూహ్యంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అధికార నివాసంలో సోదాలు నిర్వహించి, సీసీటీవీ కెమేరాల ఫుటేజ్ పట్టుకెళ్లడం సంక్షోభం ముదురుతున్న సంకేతాలనిచ్చింది. ఇది రాష్ట్రపతి పాలన విధిస్తారన్న వదంతులకు దారితీసింది. ఓ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందంటూ సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అవసరమైతే కేంద్రమే రాష్ట్ర గవర్నర్ నుంచి అడిగిన నివేదిక తెప్పించుకోవచ్చు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాం ఉందా ? అని ఢిల్లీ బీజేపీ యూనిట్‌ను ప్రశ్నించగా, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం ఒక మార్గం మాత్రమేనని, తాము మాత్రం ఇప్పుడు రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయడం లేదని ఢిల్లీ బీజీపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ తెలిపారు. రాజీనామా చేయాల్సిందిగా మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కేజ్రివాల్ ఓ అరాచక వాదని, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభంలో పడిపోయిందని ఢిల్లీ పార్టీ వ్యవహారాలు చూస్తున్న బిజేపీ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు చేయి చేసుకున్నంత మాత్రాన ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వి«ధించాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని రాజ్యాంగ సంక్షోభంగా బీజేపీ పరిగణించడం, ఇలాంటి సందర్భాంల్లో కేంద్రం నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది కనుక రాష్ట్రపతి పాలన గురించి వినిపిస్తోంది.