రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
► రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ
► రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని సూచన
► ఈ సమావేశాల్లోనే జీఎస్టీ ఆమోదం పొందాలన్న జైట్లీ
న్యూఢిల్లీ: రైతు రుణమాఫీకి రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని తేల్చిచెప్పారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రానికి నిధులిచ్చి మరో రాష్ట్రానికి మొండిచేయి చూపే విధానాన్ని ఆవలంబించబోమని పేర్కొన్నారు. ‘పలు రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నాయి. అందుకు ఆయా రాష్ట్రాలే నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయంపై కేంద్రం ఓ విధానంతో ముందుకెళ్తోంది.
రైతు రుణాల వడ్డీలో కొంత భరిస్తున్నాం. దీన్ని కొనసాగిస్తాం’ అని జైట్లీ వెల్లడించారు. రుణమాఫీ చేయాల్సిందేనని సంకల్పిస్తే దానికి ఆయా రాష్ట్రాలే నిధులు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. అక్కడి రైతులకు యోగి సర్కారు రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే.. 2006లో యూపీఏ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిందని ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా రుణమాఫీ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
లేదంటే పరోక్షపన్ను కోల్పోతాం!
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని జైట్లీ రాజ్యసభలో చెప్పారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 15 తర్వాత కేంద్రం, రాష్ట్రాలు పరోక్షపన్నును నష్టపోతాయని ఆయన తెలిపారు. జీఎస్టీకి అనుబంధంగా ఉన్న నాలుగు బిల్లులను తర్వలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
యూఎస్ ‘అక్రమ’ జాబితా తిరస్కరణ
అమెరికాలో 271 మంది అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ ఆ దేశం ఇచ్చిన జాబితాను భారత్ తిరస్కరించింది. సరైన ధ్రువీకరణ జరిగేంతవరకు అమెరికా నుంచి భారతీయులను తరలించేది లేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నలకు సుష్మ సమాధానం ఇచ్చారు. ‘మేం ఆ జాబితాను అంగీకరించటం లేదు. అందుకే మరిన్ని వివరాలడిగాం. వాటిని ధ్రువీకరించుకున్నాకే వారిని తరలించేందుకు అత్యవసర సర్టిఫికెట్ జారీచేస్తాం’ అని సుష్మ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ పునియా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.