జీఎస్టీతో మనకొచ్చే లాభమేమిటంటే?
చరిత్రాత్మక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం సాకారం అయ్యేదిశగా మరో ముందడుగు పడింది. జీఎస్టీ బిల్లును కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అత్యంత కీలకమైన ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు సావధానంగా చర్చలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా జీఎస్టీ బిల్లును భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకేవిధంగా పన్నుశాతం ఉంటుంది. దేశమంతా ఒకే మార్కెట్‌గా పరిగణించబడుతుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతోపాట దేశంలోని 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
జీఎస్టీ అమల్లోకి వస్తే తయారీ రంగానికి (మాన్యుఫాక్చరింగ్‌కు) ఊతం లభించనుంది. దేశీయ ఉత్పత్తులు మరింత తక్కువ ధరకు లభించే అవకాశముంది. అదేసమయంలో సేవలు మాత్రం మరింత ప్రియంకానున్నాయి.
జీఎస్టీ వల్ల వీటి ధరలు తగ్గే అవకాశం
- ఆటో మోబైలింగ్ రంగానికి చెందిన కార్లు, బైకులు, ఎస్‌యూవీ లగ్జరీ వాహనాలు
- కారు బ్యాటరీలు
- ఇళ్లకు వేసే రంగులు, సిమెంట్
- కూలర్లు, ఫ్యాన్లు, బల్బులు, వాటర్ హీటర్లు తదితర ఎలక్రానిక్ వస్తువులు
వీటి ధరలు పెరిగే అవకాశం
- సిగరెట్లు ధరలు మరింత ప్రియం అవుతాయి. ప్రస్తుతమున్న పన్నుల కన్నా పొగాకుకు జీఎస్టీ రేటు అధికంగా ఉండటమే ఇందుకు కారణం
- సర్వీసు ట్యాక్స్ పెరిగిపోవడంతో మొబైల్ ఫోన్లు మరింత ప్రియం అవుతాయి
- వస్త్రాలు, బ్రాండెడ్ నగల ధరలు పెరిగే చాన్స్
లాభమా? నష్టమా?
జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల భారం తగ్గి వ స్తువు ధర తగ్గుతుంది. సేల్స్ ట్యాక్స్ ఉండకపోవడంతో ప్రతి రాష్ట్రంలో పన్ను చెల్లించక్కర్లేదు. ఇకపై పన్నుపై పన్ను ఉండదు. పన్నులు తగ్గి కంపెనీల ఏర్పాటు పెరగవచ్చు. ద్రవ్యోల్బణం దిగొస్తుందని, పన్ను ఎగవేతలు తగ్గుతాయని నిపుణులంటున్నారు. రవాణా వ్యయాలు, పేపర్ పని తగ్గి వ్యాపార వాణిజ్యాలు సమర్థంగా జరుగుతాయి. జీడీపీ 2% పెరుగుతుందని అంచనా.