18శాతం పన్ను ప్రామాణికంగా ఉండాలి: చిదంబరం
న్యూఢిల్లీ : జీఎస్టీ బిల్లును తాము ఎన్నడూ వ్యతిరేకించలేదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి చిదంబరం తెలిపారు. బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వంలో జీఎస్టీ బిల్లును బీజేపీ వ్యతిరేకించిందన్నారు. సభలో ఏకాభిప్రాయంతోనే బిల్లు ఆమోదం పొందాలన్నారు. తమ అంగీకారం లేకుండా బిల్లును ఆమోదించుకోవాలని ఎన్డీయే సర్కార్ ప్రయత్నించి విఫలమైందన్నారు. మూడు, నాలుగు నెలల్లో ప్రభుత్వ వైఖరిలో మార్పు రావటం హర్షణీయమన్నారు. జీఎస్టీ బిల్లులో సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు.
ఎట్టకేలకు జీఎస్టీ సవరణల బిల్లును స్వాగతిస్తున్నామని చిదంబరం తెలిపారు. బిల్లులో ఎలాంటి లోపాలు లేవని, ప్రభుత్వం అనడం సరికాదన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా చర్చల ద్వారా బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. బిల్లులో మరో మూడు సవరణలు చేయాల్సి ఉందని, 18 శాతం పన్ను ప్రామాణికంగా ఉండాలన్నారు. పన్నురేటులో కేబినెట్ తలదూర్చకూడదని చిదంబరం వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఆమోదిస్తేనే పన్ను రేట్లు మారాలన్నారు. జీఎస్టీ పరోక్ష పన్నుల రేట్లు తక్కువగా ఉండాలన్నారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందాలని, కేంద్ర రాష్ట్రాల రెవెన్యూలో లోటు రాకూడదని చిదంబరం పేర్కొన్నారు.