రాజ్యసభలో జీఎస్టీ బిల్లు | GST Bill introduced in Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో జీఎస్టీ బిల్లు

Published Wed, Aug 12 2015 1:11 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

రాజ్యసభలో జీఎస్టీ బిల్లు - Sakshi

రాజ్యసభలో జీఎస్టీ బిల్లు

ప్రవేశపెట్టిన జైట్లీ - చర్చను అడ్డుకున్న కాంగ్రెస్
* బీఏసీలో చర్చించకుండా సభలో చర్చకు వీల్లేదని కాంగ్రెస్ ఆందోళన
* గతంలోనే బీఏసీలో చర్చించి సమయం కేటాయించారన్న ఆర్థికమంత్రి
* ఆ సమయం గడిచిపోయిందన్న కాంగ్రెస్.. వెల్‌లో సభ్యుల నినాదాలు
* గందరగోళంలో బిల్లును చేపట్టలేనన్న ఉపసభాపతి.. సభ వాయిదా


న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజులే మిగిలివున్న పరిస్థితుల్లో.. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే.. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పలు విధానపర అభ్యంతరాలు లేవనెత్తుతూ చర్చను అడ్డుకుంది. సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిలుచోగానే.. అప్పటివరకూ మౌనంగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా వెల్‌లోకి దూసుకెళ్లారు.

దీనిపై జైట్లీ మండిపడుతూ.. దేశ అభివృద్ధిని అడ్డుకోవటం కోసమే కాంగ్రెస్ ఏదో ఒక వంకతో అవరోధాలు కల్పిస్తోందని, ముఖ్యమైన జీఎస్టీ  చట్టాన్ని నిలువరించటం కోసమే లలిత్ మోదీ - సుష్మ వివాదాన్ని వాడుకుంటోందని విమర్శించారు. బిల్లుపై సభా కార్యక్రమాల సలహా సంఘం(బీఏసీ)లో చర్చించలేదని, ఆ బిల్లుపై సభలో చర్చ కోసం సమయం కేటాయించలేదని.. కాబట్టి దానిపై సభలో చర్చ చేపట్టరాదని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ అన్నారు. సభ్యుల అంగీకారం లేకుండా సభా కార్యక్రమాల్లో ఆ బిల్లును చేర్చడాన్ని తప్పుబట్టారు.

జైట్లీ బదులిస్తూ.. ‘బిల్లు ఇదివరకు సభ ముందుకొచ్చినపుడు.. దానిపై చర్చ కోసం బీఏసీ 4 గంటలు కేటాయించింది. ఆ తర్వాత బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కొందరు సభ్యులు కోరారు. ఆ కమిటీ ఆ బిల్లును, సవరించిన బిల్లుతో సహా సభకు తిప్పిపంపించింది. దాన్ని ఇప్పుడు పరిశీలనకు తీసుకోవాలి’అని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తోందని.. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రతి సమావేశాన్నీ స్తంభింపచేస్తోందని పేర్కొన్నారు. జైట్లీ వివరణతో ఆనంద్ శర్మ విభేదించారు. ‘ఈ రోజు ఉదయం బులెటిన్‌ను పరిశీలించాం. ఎటువంటి సమయం కేటాయించలేదు.

ఆ బిల్లును చేపట్టజాలరు. దీనిపై రూలింగ్ ఇవ్వాలి. బిల్లుపై బీఏసీలో చర్చించలేదు. అంతకుముందు కేటాయించిన 4 గంటల సమయం ముగిసిపోయింది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఆవేశంగా నినాదాలు చేస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో.. జీఎస్టీ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున.. గందరగోళ పరిస్థితుల్లో దానిని చర్చకు చేపట్టలేనని ఉప సభాపతి పి.జె.కురియన్ పేర్కొన్నారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓట్ల విభజన చేపట్టాల్సి ఉంటుంది.  
 
వినియోగాధికార బిల్లులకు ఆమోదం...
అంతకుముందు.. లోక్‌సభ ఆమోదం పొందిన ఆర్థిక శాఖ, రైల్వే శాఖ వినియోగాధికార బిల్లులను సభ చర్చ లేకుండా ఆమోదించింది. తర్వాత కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య.. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాలకు చెందిన పలువురు సభ్యులు తమ తమ రాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలను ప్రస్తావించారు. జార్ఖండ్‌లో సోమవారం ఒక ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట మృతుల అంశాన్ని లేవనెత్తిన జేఎంఎం సభ్యుడు సంజయ్‌కుమార్.. మృతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచాలని కోరారు.
 
ఓటమిని జీర్ణించుకోలేకే సోనియా, రాహుల్‌ల అవరోధాలు: జైట్లీ
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని.. దేశ ప్రగతిని అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారని అరుణ్‌జైట్లీ ధ్వజమెత్తారు. రాజ్యసభ వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుసరించిన విధానాల వల్లే దేశ ఆర్థిక ప్రగతి మందగించిందని.. ఆ పార్టీ చేసిన పొరపాట్లను రాజకీయంగా, రాజ్యాంగపరంగానూ సరిదిద్దాల్సి ఉందని పేర్కొన్నారు.

జీఎస్టీ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున.. దానిని ఆమోదించాలంటూ మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్‌కు గణనీయంగా 68 మంది సభ్యుల బలం ఉంది. అధికార బీజేపీకి 48 మంది సభ్యులు ఉండగా.. మొత్తం 120 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 165 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఇంకా 45 మంది సభ్యుల మద్దతును కూడగట్టాల్సి ఉంటుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇక రెండు రోజులే మిగిలివున్న నేపథ్యంలో.. జీఎస్టీ బిల్లును వివిధ పార్టీల మద్దతుతో ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జైట్లీ పేర్కొన్నారు.
 
రాజ్యసభ సభ్యులను తక్కువగా చూస్తున్నారు...
రాజ్యసభలో ఎస్‌పీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ ప్రొటోకాల్ అంశాన్ని లేవనెత్తారు. లోక్‌సభ సభ్యులకన్నా రాజ్యసభ సభ్యులను తక్కువగా పరిగణిస్తున్నారని.. జిల్లాల్లో విజిలెన్స్ కమిటీలకు రాజ్యసభ సభ్యులు ఎవరినీ ప్రభుత్వం చైర్మన్‌గా నియమించలేదని చెప్పారు. రాజ్యసభ సభ్యుల విదేశీ పర్యటనల విషయంలోనూ లోక్‌సభే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘ప్రొటోకాల్ ప్రకారం రాజ్యసభ చైర్మన్.. లోక్‌సభ స్పీకర్ కన్నా ఉన్నతం. ప్రధానమంత్రి కన్నా ఉన్నత హోదా. ఈ సభ సభ్యులను అవమానిస్తారా?  దీనిపై స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి’అని కోరారు.

దీనిపై కురియన్ ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. జిల్లాల విజిలెన్స్ కమిటీ నియామకాల విషయంలో తాము కొత్తగా చేసిన ఏర్పాటు కాదని.. గత ప్రభుత్వ విధానాలే అనుసరించటం జరిగిందని.. సభ్యుల మనోభావాలను గౌరవిస్తున్నామని మంత్రి నక్వీ బదులిచ్చారు. కె.సి.త్యాగి(జేడీయూ),  మధుసూదన్ మిస్త్రీ(కాంగ్రెస్) కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటులో రాయితీ ఆహారం వంటి విషయాల్లో రాజకీయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎంపీలను ఉగ్రవాదులుగా కూడా అభివర్ణిస్తున్నారని అగర్వాల్ ప్రస్తావిస్తాంచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement