ఏడాదికే మూత
పోలవరం, న్యూస్‌లైన్ : రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలశీతలీకరణ కేంద్రాలు పలు కారణాలతో మూతపడుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారడమే కాకుండా లక్షల నిధులు వెచ్చించి నెలకొల్పిన మెషినరీ, భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. పోలవరం మండలం కార్మల్‌పురం వద్ద ఏర్పాటు చేసిన గోదావరి మిల్క్‌గ్రిడ్ పాలశీతలీకరణ కేంద్రానికి నిర్వహణ లోపం శాపంగా మారింది. దీంతో ఏడాదికే మూతపడింది. ఐకేపీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని 2011 నవంబర్ 22న ప్రారంభించారు. రూ.40 లక్షల వ్యయంతో భవనాన్ని, మెషనరీని నెలకొల్పారు. మండలంలో 18 పాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పాలమిత్రలను నియమించారు. పాల సేకరణ కేంద్రాలకు ఒక ఇన్వర్టర్, ఒక వెయింగ్ మెషిన్, లాక్టో మీటర్, వెన్నశాతం కొలిచే పరికరం అందజేశారు.
ప్రారంభ దశలో పాలమిత్రలు రోజూ 600 లీటర్ల నుంచి 800 లీటర్ల వరకు పాలు సేకరించి కేంద్రానికి అందజేసేవారు. అప్పట్లో పాలు పోసిన రైతులకు పది రోజులకు ఒకసారి సొమ్ము అందజేసేవారు. కొన్నాళ్లు 20 రోజులకు, తరువాత నెల రోజులకు రైతులకు సొమ్ములు చెల్లించేవారు. తదనంతరం సొమ్ము చెల్లింపులు మరీ ఆలస్యం అవుతుండడంతో రైతులు పాలు పోయడం మానివేశారు. దీంతో పాల సేకరణ 200 లీటర్లకు పడిపోయింది. క్రమేణా పాల సేకరణ తగ్గిపోవడంతో మొత్తానికి ఈ ఏడాది జనవరి 2న ఈ కేంద్రాన్ని మూసివేశారు.
పారంభ దశలో కేంద్రం నిర్వహణకు రూ.5 లక్షలను బ్యాంకులో జమ చేశారు. ఈ నిధులన్నీ కూడా ఖర్చయిపోయాయి. వాస్తవానికి ఈ నిధులను నిర్వహణ కోసం అవసరమైనప్పుడు సొమ్మును బ్యాంకు నుంచి డ్రా చేసి తిరిగి ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఇటువంటి నిబంధనలు ఐకేపీ అధికారులు పాటించకుండా రూ.5 లక్షలు ఖర్చుచేసేశారు. నిర్వహణకు డబ్బులు లేవంటూ పాలశీతలీకరణ కేంద్రాన్ని మూసివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాల మిత్రలకు ఇచ్చిన ఇన్వర్టర్లు, ఇతర సామగ్రి ఏమయ్యాయో తెలియడం లేదు. ప్రైవేట్ కేంద్రాలకు పాలు పోస్తున్నా సొమ్ముకు గ్యారెంటీ ఉండటం లేదని, ఇప్పటికైనా గోదావరి మిల్క్గ్రిడ్ను తిరిగి ప్రారంభించి సక్రమంగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.