వ్యవశా స్త్రవేత్తలు
ప్రాణాంతక సెరెబ్రల్ మలేరియా ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. కళ్ల ముందరే పసిమొగ్గలు నేలరాలడం వారిని కలచివేసింది. ప్రకృతిలో ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందన్నది వారి విశ్వాసం. వ్యవసాయ పనులు చేస్తూనే ఖాళీ సమయాల్లో అడవుల్లో చెట్లూపుట్టల వెంట తిరిగారు. దోమల సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని కనుకొన్నారు. ‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’ నేతృత్వంలో ఇచ్చే రాష్ట్రపతి అవార్డును 2013లో వారికి దక్కించుకొని ఎందరికో స్ఫూర్తిని ఇచ్చారు.
ప్రాణాంతక వ్యాధులను తక్కువ ఖర్చుతో నయం చేసే మందులను కొనుక్కోవడం కోసం అన్వేషణ సాగిస్తున్నారు చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామీణ శాస్త్రవేత్తలు. వీరికి ప్రయోగశాల కూడా అందుబాటులో లేదు. ఆ మాటకొస్తే ఈ బృందంలో ఇద్దరు మినహా మిగతావాళ్లవి వానకారు చదువులే. కారాకొల్లుకు చెందిన చంద్రశేఖర్ ఎం.ఏ(ఫిలాసఫీ) మధ్యలోనే ఆపేశాడు. ్ఞఇంటర్మీడియెట్లో బైపీసీ విద్యార్థి అయిన చంద్రశేఖర్‌కు సైన్సులో కాస్తోకూస్తో పరిజ్ఞానం ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి వైద్యం అందించిన మనదేశం ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం విదేశాల వైపు చూస్తోండటం చంద్రశేఖర్‌ను ఆలోచింపజేసింది.
సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడే ఉంటుందని పెద్దలు చెప్పిన మాటను తుచ తప్పకుండా పాటిస్తే సంచలనం సృష్టించవచ్చన్న భావనతో డిగ్రీ చదివిన చిరంజీవులు, నాలుగైదు తరగతులు చదివిన భాస్కర్, బత్తెయ్యనాయుడు, శివ, వెంకటేశ్వర్లు, మురళీ, శ్రీధర్‌లతో కలిసి ‘జగదీష్ చంద్రబోస్’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి 20 ఏళ్ల క్రితమే పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి చేసిన తొలి ప్రయోగం విఫలమైన సందర్భంలోనే కారాకొల్లును సెరెబ్రల్ మలేరియా చుట్టుముట్టింది.
అడవిబాటలో...
దోమ కాటుకు ప్రాణాంతక సెరెబ్రల్ మలేరియా సోకి పసిమొగ్గలు కళ్ల ముందే నేలరాలుతోండటంతో ఆ బృందం మళ్లీ అడవిమార్గం పట్టింది. దోమలు, క్రిములు వాలని మొక్క, చెట్టు దొరికితే సమస్యకు పరిష్కారం లభించినట్లేనన్నది వారి భావన. అదే లక్ష్యంతో చెట్లెంటా పుట్లెంటా తిరిగారు. చివరకు తెల్లజుమికి మొక్కపై దోమలు, క్రిములు వాలకపోవడాన్ని గుర్తించారు. వాలిన దోమలు, క్రిములు కూడా చనిపోవడాన్ని పసిగట్టారు. తెల్లజుమికి మొక్క ఆకులపై, కాయలపై జిగురులాంటి పదార్థం ఉండటం వల్ల దోములు, క్రిములు వాలడం లేదని భావించారు. తెల్లజుమికి ఆకులు, కాయల రసాన్ని దోమల లార్వాలపై ప్రయోగించారు. దెబ్బకు దోమల లార్వాలు చనిపోయాయి. ఆ రసాన్ని ఊర్లో మురుగుకాలువలు, నీళ్లు నిలిచే ప్రాంతాలపై చల్లారు. దెబ్బకు దోమలన్నీ చనిపోయాయి. ఊళ్లో వాళ్లందరికీ ఆ రసాన్ని ఇచ్చారు. పడుకునే ముందు చేతులకు కాళ్లకు పూసుకుంటే దోమలు కుట్టవని చెప్పారు. ఆ ఊరి ప్రజలు అలానే చేశారు. దోమకాటుకు పరిష్కారం దొరకడంతో సెరెబ్రల్ మలేరియా నుంచి కారాకొల్లుకు విముక్తి కలిగింది.
ఇదే సమయంలో తాము కనుగొన్న మందుకు శాస్త్రీయత ఉందని నిరూపించాలని బృందం భావించింది. ఎస్వీ యూనివర్శిటీలో ఎంటమాలజీ ప్రొఫెసర్ హరినాథబాబును సంప్రదించారు. బృందం అందించిన శాంపుల్స్‌పై పరిశోధనలు చేసిన హరినాథబాబు, తెల్లజుమికి రసంలో క్రిమిసంహారక లక్షణాలున్నట్లు తేల్చారు. న్యుమటోడ్స్ (చెట్ల ఆకులపై రసం పీల్చే పురుగులు) నిర్మూలించడానికి ప్యురాడాన్ ఉపయోగిస్తున్నారు. ప్యూరాడాన్ కన్నా తెల్లజుమికితో తయారుచేసిన మందే న్యుమటోడ్స్పై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు ప్రొఫెసర్ హరినాథబాబు తేల్చారు.
అడవే ప్రయోగశాల...
తెలుగుగంగ ఆయకట్టు ప్రాంతమైన కారాకొల్లులో చిత్తడి నేలలు అధికం. చిత్తడి నేలల్లో నడవడం వల్ల ఆ గ్రామ ప్రజలను బురదపుండ్లు పట్టి పీడిస్తుండడంతో గాయాన్ని మాన్పే మందు కోసం అన్వేషణ సాగించారు. వెంట్రుకలను నల్లగా మార్చడానికి చేసిన ప్రయోగంలో గతంలో ఉపయోగించిన బురుగుడు ఆకు రసాన్ని ఓ ఎద్దు గాయంపై ప్రయోగించారు. త్వరగా మానిపోయింది. ఆ తర్వాత కోడికి తగిలిన గాయంపై ప్రయోగించారు. అదీ మానిపోయింది. మనుషుల గాయాలకూ, చర్మవ్యాధులకు ఇదే మందును పూశారు. 15 నిముషాల్లో ప్రభావం చూపాయి. బురుగుడు ఆకు రసం తయారుచేసిన మందుపై పరిశోధనలు చేసిన కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్ రఘునాథరాజు ఆ మందు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుందని తేల్చారు. తక్కువ ధరకు మందును అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ‘ఎంజెల్-హెచ్’ అనే పేరుతో మార్కెట్ చేసేందుకు పూనుకున్నారు.
‘‘మేం తయారు చేసిన మందులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. క్యాన్సర్ వ్యాధికి మందును కనుగొనడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’’ అంటున్నారు బృందంలో సభ్యుడైన చంద్రశేఖర్.
‘జగదీశ్ చంద్రబోస్’ సంఘం సభ్యులు చేస్తున్న కృషిని గమనించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఏఫ్) రాష్ట్ర కో-ఆర్డినేటర్ గణేశం వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. బృందం ఆవిష్కరణలను ఎన్ఐఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి ఆవిష్కరణలకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ప్రజలకు మేలు చేసే మరిన్ని మందులను ఈ గ్రామీణ శాస్త్రవేత్తల బృందం కనుగొనాలని ఆశిద్దాం.
ఎన్ఐఎఫ్ను సంప్రదించండి...
దేశంలో ప్రతిభకు కొదువ లేదు. పల్లెల్లో అద్భుతాలు సృష్టించే యువకులు ఎందరో ఉన్నారు. ఎవరు ఏ ఆవిష్కరణలు చేసినా నన్ను(ఫోన్ నెంబరు 09866001678) సంప్రదించండి. రాష్ట్రంలో ఇప్పటికే 112 ఆవిష్కరణలను ఎన్ఐఎఫ్ దృష్టికి తీసుకెళ్లాం. 22 మందులకు పేటెంట్లు తెప్పించాం. 12 మందికి రాష్ట్రపతి అవార్డులు వచ్చేలా చేశాం. కారాకొల్లుకు చెందిన చంద్రశేఖర్ బృందం అద్భుతాలు సాధిస్తోంది.
- గణేశం, రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఎన్ఐఎఫ్.