CGRF
-
సదా ఈ–సేవలో.. విద్యుత్ ఫిర్యాదులూ ఆన్లైన్లోనే!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్లులు, మరమ్మతులు, ఇతర అంశాల్లో సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణ కోసం ‘కన్జ్యూమర్స్ గ్రివెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్ఎఫ్)’వెబ్‌పోర్టల్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ టి.శ్రీరంగారావు సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై ఎక్కడి నుంచైనా మొబైల్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామని శ్రీరంగారావు చెప్పారు. అయితే వినియోగదారులు తొలుత తమ సమస్యలపై స్థానిక కస్టమర్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)లో ఫిర్యాదు చేసి రశీదు తీసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్య పరిష్కారం కాకుంటే.. సీజీఆర్‌ఎఫ్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వాటిని పరిష్కరించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీజీఆర్‌ఎఫ్‌లో సైతం పరిష్కారం కాని అంశాలపై విద్యుత్ అంబుడ్స్‌మెన్‌కుగానీ, ఈఆర్సీకి గానీ ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. సమస్య ఏదైనా సరే.. మీటర్లు మొరాయించడం/కాలిపోవడం/సరిగ్గా పనిచేయకపోవడం, కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ/అదనపు లోడ్ అనుమతిలో జాప్యం, సర్వీస్ కనెక్షన్ యజమాని పేరు మార్పు, కేటగిరీ మార్పు, తప్పుడు మీటర్ రీడింగ్, అడ్డగోలుగా బిల్లులు, అసలు బిల్లులు జారీ కాకపోవడం, బిల్లుల చెల్లింపు తర్వాత కనెక్షన్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, తీగలు తెగిపడిపోవడం, వోల్టేజీలో హెచ్చుతగ్గులు వంటి అంశాలపై పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని శ్రీరంగారావు తెలిపారు. ఫిర్యాదులు, వాటిపై సీజీఆర్ఎఫ్ చైర్మన్, సభ్యులు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమస్త సమాచారం పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. వినియోగదారులు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) వెబ్సైట్లో ఉండే సీజీఆర్ఎఫ్ లింక్‌ను క్లిక్ చేస్తే ఫిర్యాదుల పోర్టల్ ఓపెన్ అవుతుందని తెలిపారు. లేకుంటే.. ఉత్తర తెలంగాణ జిల్లాల వినియోగదారులు 210.212.223.83:9070/CGRF/CgrfWebsite.jsp పోర్టల్‌లో.. దక్షిణ తెలంగాణ జిల్లాలవారు 117.239.151.73:9999/CGRF/ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా డిస్కంలు ఫిర్యాదులను పరిష్కరించడంలో విఫలమైతే.. వాటిపై జరిమానాలు విధించే అధికారం తమకు ఉందని తెలిపారు. సీజీఆర్ఎఫ్ ఫిర్యాదుల స్వీకరణకు త్వరలో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. -
వినియోగదారుల ముంగిట్లోకి... సీజీఆర్ఎఫ్
సాక్షి, హన్మకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతీ డిస్కంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేసింది. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో వరంగల్ (హన్మకొండ), నిర్మల్ కేంద్రంగా రెండు ఏర్పాటయ్యాయి. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(కన్జ్యూమర్ గ్రీవెన్స్‌స్ రిడ్రసల్ ఫోరం – సీజీఆర్ఎఫ్)కు విస్త్రృత ప్రచారం తీసుకురావడంలో సీజీఆర్ఎఫ్–1 చైర్మన్‌గా కందుల కృష్ణయ్య విశేష కృషి చేశారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒక వేదిక ఉందని తెలియని పరిస్థితుల్లో దీనిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్‌గా కార్యాలయంలోనే ఉంటూ కేసులను పరిష్కరించే అవకాశమున్నా వినియోగదారుల ముంగిట్లోకి లోకల్ కోర్టుల పేరుతో సీజీఆర్‌ఎఫ్‌ను తీసుకెళ్లారు. ఈ మేరకు మూడేళ్లుగా చైర్మన్‌గా పనిచేస్తున్న కృష్ణయ్య పదవీకాలం శనివారంతో ముగియనున్న సందర్భంగా ప్రత్యేక కథనం. మూడు పూర్వ జిల్లాలు సీజీఆర్ఎఫ్–1 (వరంగల్) పరిధిలో పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని ప్రతీ సెక్షన్ కార్యాలయంలో సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేందుకు చైర్మన్ కృష్ణయ్య కృషి చేశారు. మూడేళ్ల పదవీ కాలంలో మొత్తం 1,014 కేసులు సీజీఆర్ఎఫ్ దృష్టికి రాగా వాటిని పరిష్కరించడం విశేషంగా చెబుతారు. 96 శాతం వినియోగదారులకే అనుకూలం మొత్తం పరిష్కరించిన కేసుల్లో 808 కేసులను స్థానికంగా అప్పటికప్పుడు సెక్షన్ పరిధిలో నిర్వహించిన లోకల్ కోర్టుల్లో పరిష్కరించడం విశేషం. ఇక లోకల్ కోర్టులో పరిష్కారం కాని 146 కేసులను సీజీఆర్ఆఫ్ కోర్టులో పరిష్కరించారు. మూడేళ్లలో సగటున 96 శాతం కేసులు వినియోగదారులకు అనుకూలంగా తీర్పు వచ్చాయి. రూ.2,67,500 వినియోగదారులకు పరిహారం, జరిమానా రూపేణ.. సంస్థ నుంచి అందేలా చేశారు. 2016–2017లో 304 కేసులు నమోదు కాగా 260 లోకల్ కోర్టుల్లో, 44 కేసులు సీజీఆర్ఎఫ్ కార్యాలయంలోని కోర్టులో పరిష్కరించారు. ఇందులో 93 శాతం కేసులు వినియోగదారులకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. 2017–2018లో 382 కేసులు రాగా 326 కేసులు స్థానికంగా, 56 కేసులు సీజీఆర్ఎఫ్ కార్యాలయం కోర్టులో పరిష్కరించగా 98 శాతం కేసులు వినియోగదారుల పక్షాన తీర్పు వెలవడ్డాయి. ఇక 2018–2019లో 282 కేసులను స్థానికంగా, సీజీఆర్ఎఫ్ కార్యాలయం కోర్టులో 46 కేసులు పరిష్కరించారు. ఇందులో 97 శాతం కేసులు వినియోగదారుల పక్షాన తీర్పు వెలువడ్డాయి. ఫిర్యాదులు ఇలా... విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుడి సర్వీసు నెంబర్, పూర్తి చిరునామతో పోస్టు ద్వారా కానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుకు ఎలాంటి రుసుం కానీ న్యాయవాది కానీ అవసరం లేదు. విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చు అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, మీటర్ సమస్యలు, అధిక బిల్లులు, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణ, అదనపు లోడ్ ఇచ్చుటలో జాప్యం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, ఓవర్‌లోడ్, కాలిపోవడం తరలించడంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయడం, కేటగిరీ మార్పు వంటి ఇతర విద్యుత్ సంబంధ సమస్యలు సీజీఆర్ఎఫ్ ద్వారా వినియోగదారులు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుడి సర్వీసు నెంబర్, పూర్తి చిరునామతో పోస్టు ద్వారా కానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుకు ఎలాంటి రుసుం కానీ న్యాయవాది కానీ అవసరం లేదు. విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చు అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, మీటర్ సమస్యలు, అధిక బిల్లులు, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం, నిరాకరణ, అదనపు లోడ్ ఇచ్చుటలో జాప్యం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, ఓవర్‌లోడ్, కాలిపోవడం తరలించడంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయడం, కేటగిరీ మార్పు వంటి ఇతర విద్యుత్ సంబంధ సమస్యలు సీజీఆర్ఎఫ్ ద్వారా వినియోగదారులు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. సీజీఆర్ఎఫ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంబంధ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది చక్కటి వేదిక. న్యాయవాదుల అవసరం లేకుండా వినియోగదారులే నేరుగా ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. సీజీఆర్ఎఫ్పై వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు సెక్షన్ల వారీగా లోకల్ కోర్టులు నిర్వహించాం. వినియోగదారుల ముంగిట్లోకి సీజీఆర్‌ఎఫ్‌ను తీసుకువెళ్లామనే సంతృప్తి కలిగింది. – కందుల కృష్ణయ్య, సీజీఆర్ఎఫ్–1 చైర్మన్ -
ఖర్చు భారీ.. స్పందన సారీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఏర్పాటు చేసిన సీజీఆర్ఎఫ్ (కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రీడ్రసల్ ఫోరం)కు స్పందన కరువైంది. ప్రతినెలా నిర్వహిస్తున్న ఈ గ్రీవెన్స్ డేకు పదుల్లోపే ఫిర్యాదులు అందుతున్నాయి. బిల్లుల నమోదులో నిర్లక్ష్యం, కొత్త మీటర్లు, కనెక్షన్ ఇవ్వడంలో అలసత్వం, లో వోల్టేజీ తదితర సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన సీజీఆర్ఎఫ్ కమిటీ ఈనెల 15న ఏలూరులో గ్రీవెన్స్ నిర్వహించగా 11 ఫిర్యాదులే అందాయి. 16న రాజమండ్రిలో ఏర్పాటు చేయగా ఇద్దరే వచ్చారు. ఈ నెల 21న శ్రీకాకుళంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో నాలుగే ఫిర్యాదులందాయి. కాగా విజయనగరంలో ఈనెల 23న, విశాఖలో ఈనెల 28న గ్రీవెన్స్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకిలా? 2005లో ఏర్పాటైన సీజీఆర్‌ఎఫ్‌లో ఇద్దరు సీఈలు, ఓ ఎస్ఈ సభ్యులుగా ఉంటారు. రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. వాస్తవానికి సీజీఆర్ఎఫ్ నిర్వహణకు ఈపీడీసీఎల్ సంస్థ భారీగా ఖర్చు చేస్తోంది. పలు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. గ్రీవెన్స్‌లో అందిన దరఖాస్తుల పరిశీలన, సమస్య పరిష్కారానికి 45 రోజుల గడువిచ్చినా.. వారంలోపే పరిష్కారం లభిస్తోంది. అయితే త్రిసభ కమిటీ వద్దకు రాకుండా వినియోగదారుల్ని ఆ శాఖ సిబ్బందే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ స్థాయిలోనే సమస్య పరిష్కరించేస్తామని, పదో పరకో ఇచ్చేస్తే పని అయిపోతుందని చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పెండింగ్ పరిస్థితి ఏంటి? ఐదు జిల్లాల్లో 2014లో 444 ఫిర్యాదులు నమోదైతే అందులో త్రిసభ్య కమిటీ 440 దరఖాస్తులకు మోక్షం కల్పించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 126 ఫిర్యాదులొస్తే 54 పరిష్కారమయ్యాయి. 72 పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి కోర్టు లావేదేవీలు, హియిరింగ్ పూర్తిస్థాయిలో లేకపోవడం, సమయానికి సిబ్బంది వినియోగదారుల వద్దకు వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించకపోవడమే కారణమని తెలుస్తోంది. పాత కమిటీ గడువు ముగిసిపోవడం, మళ్లీ కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టడం, పెండింగ్ దరఖాస్తుల్ని పరిశీలించే క్రమంలో ఇబ్బందులొచ్చినట్టు తెలిసింది. గ్రీవెన్స్ నిర్వహించే నోడల్ అధికారి(డీఈ, టెక్నికల్)కి ఇతర బాధ్యతలు అప్పగించడం కూడా జాప్యానికి కారణమని తెలుస్తోంది. పోస్టుకార్డు రాసినా.. ఇదే విషయమై త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్.శ్రీనివాసరావు, ఎం.వై.కోటేశ్వరరావు, భాస్కరరావుల వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గ్రీవెన్స్‌కు హాజరుకాలేనివారు కనీసం తెల్లకాగితం, పోస్టుకార్డుపైన అయినా తమ సమస్య రాసి పంపినా స్పందిస్తామన్నారు. ఫిర్యాదుల రిజిస్ట్రేషన్, ఎస్సెమ్మెస్, ఎక్నాలెడ్జ్మెంట్ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. తాము బాధ్యతలు స్వీకరించాక ఇప్పటివరకు 76 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.