CH. Ayyanna patrudu
-
'రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే'
ఏలూరు : సెక్షన్ - 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌పైనే ఉందని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రి అయ్యన్నపాత్రుడుతోపాటు జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... గవర్నర్ పాత్ర సమంజసంగా లేదన్నారు. గవర్నర్ పక్షపాతం లేకుండా సమస్యను పరిష్కరించాలని... అలాగే రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఉంటామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. దౌర్జన్యం చేస్తే మర్యాదగా ఉండదని... మీకు దిక్కున్నది మీరు చేసుకోండని టీఆర్ఎస్ సర్కార్‌ను అయ్యన్న హెచ్చరించారు. మీ పోలీసులు మీకుంటే మా పోలీసులు మాకుంటారు... అలాగే మీ సీబీఐ మీకుంటే మా సీబీఐ మాకుంటుందన్నారు. నిట్ విషయంలో గందరగోళమే లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే నిట్ ఏర్పాటవుతుందని తెలిపారు. అయితే టీడీపీ నేతల మధ్య విభేదాలు లేవని... బేధాభిప్రాయాలు మాత్రమేనని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. -
త్వరలో పంచాయతీ రాజ్ శాఖలో బదిలీలు
తుని : ఆంధ్రప్రదేశ్ పంచయతీ రాజ్ శాఖలో పనుల వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అందులోభాగంగా ఆ శాఖలో బదిలీలకు త్వరలో శ్రీకారం చుడతామని చెప్పారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్ వాడి భవనాల నిర్మాణం, వ్యవసాయ క్షేత్రాల్లో గోడౌన్ల నిర్మాణం లాంటి వివిధ కార్యక్రమాలు చేపట్టున్నట్లు ఆయన వివరించారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తామని అయ్యన్న పాత్రుడు చెప్పారు. -
త్వరలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు పేరిట చేపట్టనున్న 'ఎన్టీఆర్ సుజల పథకం' అమలుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ... అక్టోబర్ 2 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ పథకం కింద రూ.2 లకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్నారు. తొలి విడతగా 450 గ్రామాల్లో అమలు చేస్తామన్నారు. వాటర్ ప్లాంట్ల నిర్వహాణను జిల్లాలోని పరిశ్రమకు అప్పగిస్తామని చెప్పారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖలో 2600 పోస్టుల భర్తీ చేసేందుకు ఇప్పటికే ఏపీపీఎస్సీకి లేఖ రాసినట్లు అయ్యన్నపాత్రుడు వివరించారు.