‘గురు ఉత్సవ్’.. మోడీ ఎజెండా!?
మోడీ ‘టీచర్స్ డే’ ప్రసంగంపై వివాదం
- అన్ని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని తప్పనిసరి చేయడంపై విమర్శలు
- రహస్య ఎజెండా ఉందంటూ ఆరోపణలు
- ప్రధాని హిందీ ప్రసంగం దక్షిణాది విద్యార్థులకు అర్థంకాదని వ్యాఖ్యలు
సాక్షి నేషనల్ డెస్క్:సాధారణంగా ప్రతీసారి సాదాసీదాగా గడిచే ఉపాధ్యాయ దినోత్సవం ఈ సంవత్సరం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుణ్యమా అని ఒక్కసారిగా ముఖ్యమైన వార్తాంశంగా మారింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 5న పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోడీ ఇవ్వనున్న ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న నిర్ణయం విపక్షాల విమర్శలు, స్వపక్షాల సమర్థనల మధ్య పతాక శీర్షికల్లోకి చేరింది. ఆ రోజు ఢిల్లీలోని మానెక్షా ఆడిటోరియంలో విద్యార్ధులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగం, అనంతరం ఎంపిక చేసిన 1,000 మంది పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం, ఆ తరువాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వడం కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి 4.45 వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని, అందుకనుగుణంగా పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యార్థులు కచ్చితంగా హాజరయ్యేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఇందులో బలవంతమేమీ లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెబుతున్నప్పటికీ.. ఢిల్లీలోని విద్యా శాఖాధికారులకు అందిన ఆదేశాల్లో ఉన్న ‘ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే తీవ్రంగా పరిగణిస్తాం’ అన్న హెచ్చరిక ద్వారా ఈ కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతుంది. మోడీ కార్యక్రమాన్ని విద్యార్ధులంతా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీబీఎస్సీ కూడా తన వెబ్సైట్లో అన్ని పాఠశాలలను కోరింది. దీంతో పాటు సర్క్యులర్ కూడా జారీ చేసింది.
‘గుజరాత్ మోడల్’: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఆ రాష్ట్రంలోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేవారు. వారితో కలివిడిగా గడిపేవారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. అదే కార్యక్రమాన్ని ప్రధానిగా దేశమంతటా నిర్వహించాలని మోడీ నిర్ణయించారు. నిజానికి ఉపాధ్యాయ దినోత్సవం పేరును అధికారికంగా ‘గురు ఉత్సవ్’గా మార్చాలనుకున్నా వ్యతిరేకత రావడంతో విరమించుకుంది. ‘టీచర్చ్ డే= గురుఉత్సవ్’ అనేది ఎస్సే కాంపిటీషన్ టాపిక్ మాత్రమేనని స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు.
గురుపూజోత్సవం: ఉపాధ్యాయ దినోత్సవం అనేదిఉపాధ్యాయులను గౌరవించుకునే, పూజిం చుకునే సందర్భం. ప్రధాని ప్రసంగించాలనుకుంటే ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించా లి.. కానీ, విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెట్టాలన్న వాదన వినిపిస్తోంది. ‘పాఠశాలల పనివేళలు మధ్యాహ్నం 3 లోపు ముగుస్తాయి. మోడీ కార్యక్రమాన్ని సాయంత్రం 5 వరకు జరపడం వల్ల విద్యార్థులు అవస్థలు పడతారు’ అని ఒక టీచర్ అన్నారు. మాజీ రాష్ట్రపతి, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5ను టీచర్స్ డే గా జరుపుకుంటున్నారు.
‘చాచా మోడీ’గా మారాలనా?
మోడీ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. చాచా నెహ్రూ తరహాలో ‘చాచా మోడీ’గా మారాలనుకుం టున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. సోషల్ మీడియాలో హిందీని విరివి గా ఉపయోగించాలనటం, పాఠశాలల్లో సంస్కృత వారోత్సవాలు జరపాలన్న ఆదేశాల వెనకున్న అజెండానే దీని వెనక కూడా ఉందంటున్నాయి. ద్రవిడ సంస్కృతిని నాశనం చేయాలన్న కుట్రతోనే ఇవన్నీ చేస్తున్నారంటూ డీఎంకే అధినేత కరుణానిధి ఆరోపిస్తున్నారు. సంస్కృతాన్ని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే కుట్రలో భాగంగానే ప్రభుత్వం టీచర్స్ డేను గురు ఉత్సవ్‌గా పేరు మార్చాలనుకుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు.
మా పిల్లలకు హిందీ అర్థం కాదు
మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే విషయంలో రాష్ట్రాలు పలు విధాలుగా స్పందిస్తున్నాయి. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అనుకూలంగా స్పందిస్తూ.. ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అంత ఆసక్తిగా లేవు. ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లపై పాఠశాలలకు ఆదేశాలిచ్చేందుకు సుముఖంగా లేవు. ‘మోడీ హిందీలో ప్రసంగిస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోని పిల్లలు హిందీని అర్థం చేసుకోలేరు.
ఇక ఆ ప్రసంగానికి అర్థమేముంది?’ అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించా రు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పాఠశాల ల్లో కూడా ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలను అధికారులు చేపట్టారు. రాష్ట్రంలోని విద్యార్థులంతా మోడీ కార్యక్రమం వీక్షించేలా ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించిం ది. నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ పరిధిలోని స్కూళ్లలో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లను పూర్తిచేశారు.