Chaduvukovali
-
‘చదువుకోవాలి’కి అన్యాయం జరిగింది
హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ‘చదువుకోవాలి’ చిత్రానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సినీవారం కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను రూపొందించిన ఎం. వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దేశరాజు లలిత, కో డైరెక్టర్ సాయిశ్వేతను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున సత్కరించి, అభినందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘చదువుకోవాలి’ వంటి సందేశాత్మక చిత్రం వల్ల సమాజంలో మంచి మార్పులు వస్తాయి. పాత్రికేయునిగా అపార అనుభవం ఉన్న ఎం. వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతగా సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమా తీసి ఐదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట విద్యార్థుల కోసం ఇంకా ప్రదర్శించబడుతోంది. విద్యపై చెతన్యంతో తీసిన సినిమా కావడమే ఇందుకు కారణం. ఐదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన మా చిత్రానికి ఏపీ నంది అవార్డుల్లో అన్యాయం చేశారు’’ అన్నారు దర్శక నిర్మాత ఎం.వెంకటేశ్వరరావు. -
‘చదువుకోవాలి’ దర్శకుడికి సీఎం అభినందన
హైదరాబాద్: కెనడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో విద్యార్థి విభాగ పోటీల్లో ఎక్స్‌లెన్సీ అవార్డు పొందిన ‘చదువుకోవాలి’ చిత్ర దర్శకుడు వెంకటేశ్వరరావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. గురువారం రాత్రి ఈ సినిమా ఆడియో సీడీలను సీఎం ఆవిష్కరించారు. చదువు ప్రాముఖ్యతపై సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన తెలంగాణ దర్శకునికి అంతర్జాతీయ అవార్డు దక్కడం అభినందనీయమని కేసీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఐఎఫ్ఎస్ అధికారి నర్సింగరావు, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, డిగ్రీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ హరినాథశర్మ తదితరులు పాల్గొన్నారు. విద్య ప్రాధాన్యాన్ని తెలిపే ఈ చిత్రానికి గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయని చిత్ర దర్శకుడు వెంకటేశ్వరరావు తెలిపారు. వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి కూడా అభినందించారు. -
బాలల చిత్రోత్సవాల్లో చదువుకోవాలి
విద్య విలువను తెలియజేస్తూ స్వీయదర్శకత్వంలో మద్దాళి వెంకటేశ్వరరావు రూపొందించిన చిత్రం ‘చదువుకోవాలి’. సీత, బేబి ఆని, కోట శంకరరావు ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం పలు ప్రశంసలను దక్కించుకుంది. అలాగే, పలు అవార్డులను కూడా చేజిక్కించుకుంది. తాజాగా, ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితం కాబోతోంది. దర్శక, నిర్మాత చెబుతూ-‘‘చదువుపై వచ్చిన మంచి చిత్రంగా ఇప్పటికే విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి మంచి అభినందనలు అందుతున్నాయి. ఇప్పుడు బాలల చిత్రోత్సవాలకు ఈ చిత్రం ఎంపిక కావడం ఆనందంగా ఉంది. విద్యపై చైతన్యం రగిలించే కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని బాలలందరూ చూసి, స్ఫూర్తి పొందాలన్నది నా ఆకాంక్ష’’ అన్నారు. -
చదువుకోవాలికి అభినందనలు
‘‘ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డ్స్ కమిటీ ఒక చిత్రం కాకుండా ఆరేడు చిత్రాలను పంపే అవకాశం ఇస్తే బాగుంటుంది. అప్పుడే ‘చదువుకోవాలి’లాంటి మంచి చిత్రాలకు న్యాయం జరుగుతుంది’’ అన్నారు గౌతంఘోష్. ప్రముఖ నటి సీత, ‘రాజన్న’ ఫేం బేబి ఆని, కోట శంకర్రావు తదితరులు ముఖ్య తారలుగా స్వీయదర్శకత్వంలో మద్దాళి వెంకటేశ్వరరావు రూపొందించిన చిత్రం ‘చదువుకోవాలి’. భారతదేశం తరఫున ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీలో ఈ చిత్రం కూడా నిలిచింది. అయితే, ‘ది గుడ్ రోడ్’ అనే గుజరాతీ చిత్రానికి ఈ అవకాశం దక్కింది. బరిలో నిలిచిన చిత్రాలన్నిటినీ కమిటీ వీక్షించింది. చెన్నయ్‌లో జరిగిన శత వసంతాల సినిమా వేడుకల్లో పాల్గొన్న ఆస్కార్ నామినేషన్ కమిటీ చైర్మన్ గౌతంఘోష్ ప్రత్యేకంగా మద్దాళి వెంకటేశ్వరరావును అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత మాట్లాడుతూ - ‘‘గౌతంఘోష్గారితో పాటు ప్రముఖ దర్శకులు భారతీరాజా కూడా ఈ చిత్రాన్ని అభినందించారు. విద్యపై మంచి చిత్రం అందించారని వారు అన్నారు. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ నామినేషన్ కమిటీ నమోదు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తితో మరిన్ని ఉత్తమ చిత్రాలు అందించడానికి కృషి చేస్తాను’’ అన్నారు. -
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీలో చదువుకోవాలి
విద్యపై సమాజంలో చైతన్యం తెచ్చే కథాంశంతో స్వీయదర్శకత్వంలో మద్దాళి వెంకటే శ్వరరావు నిర్మించిన చిత్రం ‘చదువుకోవాలి’. ఈ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు లభించాయి. ఇంకా పలు ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలకు కూడా పంపించనున్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంట్రీ పోటీలో ఈ చిత్రం నిలవడం విశేషం. దేశ వ్యాప్తంగా వచ్చిన సుమారు ఇరవై చిత్రాలను పరిశీలించి, అర్హత ఉన్నవాటిని ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి పంపిస్తారు. ఈ నెల 17న ఈ చిత్రాల ప్రదర్శన ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు చిత్రరంగ ప్రముఖులు వివిధ భాషల నుంచి వచ్చిన చిత్రాలను వీక్షించి, నామినేషన్‌కి పంపిస్తారు. వీటిలో ‘చదువుకోవాలి’ ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణం అని దర్శక, నిర్మాత చెబుతూ -‘‘ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ బరిలో మా చిత్రం నిలవడం ఆనందంగా ఉంది. ఎంట్రీ వరకూ వెళ్లడమే గొప్ప విషయం. ఇంకా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల పోటీ కోసం ఈ చిత్రం వెళ్లనుంది’’ అని చెప్పారు.