చదువుకోవాలికి అభినందనలు
‘‘ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డ్స్ కమిటీ ఒక చిత్రం కాకుండా ఆరేడు చిత్రాలను పంపే అవకాశం ఇస్తే బాగుంటుంది. అప్పుడే ‘చదువుకోవాలి’లాంటి మంచి చిత్రాలకు న్యాయం జరుగుతుంది’’ అన్నారు గౌతంఘోష్. ప్రముఖ నటి సీత, ‘రాజన్న’ ఫేం బేబి ఆని, కోట శంకర్రావు తదితరులు ముఖ్య తారలుగా స్వీయదర్శకత్వంలో మద్దాళి వెంకటేశ్వరరావు రూపొందించిన చిత్రం ‘చదువుకోవాలి’.
భారతదేశం తరఫున ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీలో ఈ చిత్రం కూడా నిలిచింది. అయితే, ‘ది గుడ్ రోడ్’ అనే గుజరాతీ చిత్రానికి ఈ అవకాశం దక్కింది. బరిలో నిలిచిన చిత్రాలన్నిటినీ కమిటీ వీక్షించింది. చెన్నయ్‌లో జరిగిన శత వసంతాల సినిమా వేడుకల్లో పాల్గొన్న ఆస్కార్ నామినేషన్ కమిటీ చైర్మన్ గౌతంఘోష్ ప్రత్యేకంగా మద్దాళి వెంకటేశ్వరరావును అభినందించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత మాట్లాడుతూ - ‘‘గౌతంఘోష్‌గారితో పాటు ప్రముఖ దర్శకులు భారతీరాజా కూడా ఈ చిత్రాన్ని అభినందించారు. విద్యపై మంచి చిత్రం అందించారని వారు అన్నారు. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ నామినేషన్ కమిటీ నమోదు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తితో మరిన్ని ఉత్తమ చిత్రాలు అందించడానికి కృషి చేస్తాను’’ అన్నారు.