హలో.. నేను నరేంద్రనాథ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫలానా పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. ఓటేసి గెలిపించండి అంటూ రాజకీయ నాయకులు మెసేజ్‌ల ద్వారా వేడుకోవడం పరిపాటి. కానీ నరేంద్రనాథ్ చేస్తున్న వెరైటీ ప్రయత్నం చర్చనీయాంశమైంది. నమస్తే... నా పేరు చాగన్ల నరేంద్రనాథ్.. ఎంపీ అభ్యర్థిని. మీరు నన్ను ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటారు. మీ నిర్ణయాన్ని .... నంబరుకు ఎస్ఎంఎస్ చేయండి.. అంటూ మెదక్ జిల్లావాసుల సెల్ఫోన్లో మెసేజ్ హల్చల్ చేస్తోంది. కానీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ‘సదరు నేత ఏ పార్టీలో చేరాలో జనం చెప్పినంత మాత్రాన వెంటనే చేర్చుకుని టికెట్ ఇవ్వాలా’ అంటూ ఎకసక్కాలాడుతున్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రం చేసిన చాగన్ల నరేంద్రనాథ్ 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాజకీయ అనుభవం లేకుండానే రాజకీయరంగ ప్రవేశం చేసిన నరేంద్రనాథ్‌ను ఓటమి తర్వాత పార్టీలో పట్టించుకునే వారే కరువ య్యారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ నేతలెవరూ తనను దగ్గరికి రానివ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వాపోయాడు కూడా. సొంత ట్రస్టు పేరిట సేవా కార్యక్రమాలు చేపడుతూ జనంలో తిరుగుతున్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కదనే ఆందోళనలో నరేంద్రనాథ్ వున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో మరోమారు మెదక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే పట్టుదలతో వున్నారు. గతంలో టీడీపీ, టీఆర్ఎస్ నుంచి తనకు ఆహ్వానం ఉందని నరేంద్రనాథ్ చెప్పినా, కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వచ్చారు. తాజాగా బీజేపీలో చేరుతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు.
అగ్రనేతల సమక్షంలో త్వరలో నరేంద్రనాథ్ బీజేపీలో చేరతారని, మెదక్ ఎంపీ అభ్యర్థిగా అతడినే నిర్ణయించామంటూ కమలం పార్టీ నేతలు అప్పుడే విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈలోగా నరేంద్రనాథ్ మనసులో ఏ అనుమానం తలెత్తిందో తెలియదు కానీ, ఆయన తరఫున జనం సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు అందడం మొదలైంది. తాను ఏ పార్టీలో చేరాలో చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలను ఆప్షన్లుగా పేర్కొంటూ ఎస్ఎంఎస్ ఇవ్వాల్సిందిగా నరేంద్రనాథ్ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదేం ప్రయత్నం?
సాధారణంగా ప్రతీ పార్టీకి ఓ సిద్ధాంతం అంటూ ఉంటుంది. సదరు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తారు. కానీ పదవి దక్కాలంటే ఏ పార్టీలో చేరితో బాగుంటుందో చెప్పాలని ప్రజలనే అడగటం ఏంటని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక వేళ జనం ఫలానా పార్టీలో చేరమని సూచిస్తే సదరు పార్టీ స్పందించాలనే రూలేమైనా ఉందా. ఇన్నాళ్లూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి జెండాలు మోసిన వారికి అవకాశం ఇవ్వకుండా జనం చెప్పారని పదవుల కోసం వచ్చే వారికి టికెట్లు ఇస్తారా అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. తాను ఏ పార్టీలో చేరాలో సర్వే చేయించుకుంటున్న నాయకుడు ఈవీఎంలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘నోటా’(పైవేవీ కావు) అనే ఆప్షన్ కూడా ఇచ్చి వుంటే బాగుండేదని ప్రత్యర్థులు హాస్యోక్తులు విసురుతున్నారు.
‘ఓటమి పాలైనా నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం ఖాయం. కాకపోతే ఏ పార్టీ నుంచి నరేంద్రనాథ్ పోటీ చేయాలని జనం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం’ అంటూ ఆయన వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.