chain snach
-
యువదొంగకి దేహశుద్ధి
సాక్షి, కాజీపేట: ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు అభరణాలను దొంగిలించడానికి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన గురువారం రాత్రి బాపూజీనగర్‌లో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం కొంపెల్లి శేషమ్మ(62) భర్త చనిపోవడంతో రైల్వే ఫించన్‌పై ఆధారపడి జీవిస్తుంది. కొడుకు వేరే ఇంటిలో ఉంటుండడంతో తాను కట్టుకున్న ఇంట్లోనే శాంతమ్మ ఒంటరిగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఓ యువకుడు వృద్ధురాలి మెడలో ఉన్న నగలపై కన్నెసి గురువారం రాత్రి ఇంటి వెనుక తలుపు లేపుకుని లోపలి చోరబడి దాడి చేశాడు. శేషమ్మ మెడలో ఉన్న బంగారు అభరణాలను తెంచుకోవడానికి ప్రయత్నించగా ప్రతిఘటిస్తునే కేకలు వేయడంతో స్థానికులు అటుగా రావడంతో బయపడి బయటకు పరుగెత్తాడు. స్థానికులు ఏం జరిగిందని అడిగి తెల్సుకుంటుండగా నేరం తనపైకి రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ యువకుడు వృద్ధురాలి కొడుకు ఇంటికి వెళ్లి మీ అమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పి వారితో కలిసి ఏం తెలియనట్లుగానే మళ్లీ ఘటన స్థలికి వచ్చాడు. సదరు యువకుడిని గుర్తించిన వృద్ధురాలు స్థానికులకు చూపించింది. దీంతో వారు ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. అప్పటికే కాలనీవాసులు 100 డయల్‌కు ఫోన్ చేయడంతో బ్లూకోర్ట్స్ టీం పోలీసులు వచ్చి యువకుడిని పోలీసుస్టేషన్‌కు తరలించి వాస్తవ పరిస్థితిపై విచారణ జరుపుతున్నారు. ఈ పేనుగులాటలో వృద్ధురాలి మెడ నుంచి ఎటువంటి బంగారు నగలు పోలేదని పోలీసులు తెలిపారు. -
రిటైర్డ్ ఎస్ఐ భార్య మెడలో చైన్‌స్నాచింగ్
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓం టర్నింగ్ వద్ద చైన్ స్నాచింగ్ ఘటన బుధవారం చోటుచేసుకుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ రిటైర్డ్ ఎస్ఐ భార్య మెడలోని బంగారు గొలుసును దొంగలు లాక్కొని పారిపోయారు. స్థానిక పోలీసు స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శాకాంబరీ దేవీ ఉత్సవాలు జరుగుతుండటంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇదే అదనుగా భావించి దొంగలు వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసు సిబ్బంది ఉత్సవాల బందోబస్తులో ఉండగానే దొంగల చేతివాటం బయటపడింది. ఈ ఘటనతో మరోసారి సీసీటీవీ డొల్లతనం బయటపడింది. చైన్‌స్నాచర్ల భయంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. -
బ్యూటీషియన్‌ను మాటల్లో దించి గొలుసు చోరీ
రాజేంద్రనగర్ : బ్యూటీపార్లర్‌కు వచ్చిన ఓ మహిళ.. నిర్వాహకురాలిని మాటల్లోకి దింపి ఆరు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సెక్రటేరియట్ కాలనీలో పద్మావతి అనే మహిళ సరిత బ్యూటీ పార్లర్‌ను నిర్వహిస్తుంది. సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ(30) బ్యూటీపార్లర్‌లోకి వచ్చింది. ఈ సమయంలో పద్మావతి ఒంటరిగా ఉంది. తనకు మేకప్ చేయాలని కోరడంతో పద్మావతి ఆ మహిళకు మేకప్ చేయడం ప్రారంభించింది. ఇదే సమయంలో ఊరు, ఇతర కుటుంబ విషయాలు అడిగి బ్యుటీషియన్ పద్మావతిని మాటల్లోకి దింపింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి పద్మావతి మెడలో ఉన్న ఆరు తులాల బంగారు గొలుసు కనిపించకపొవడంతో లబోదిబోమంటూ స్థానికుల సాయంతో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మహిళ మాటల్లోనే మత్తు ఉందని ఆమె తనతో ఏం చేసిందో గొలుసు ఎలా తీసుకుందో తెలియడం లేదని పద్మావతి బోరుమంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కరడుగట్టిన చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్ : కరడుగట్టిన చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రెండేళ్ల నుంచి ఈ గ్యాంగ్ సభ్యులు నేరాలకి పాల్పడుతున్నారని చెప్పారు. పట్టుబడిన ఐదుగురు నిందితులు నుంచి 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో వీరిపై 180 కేసులు ఉన్నాయని తెలిపారు. జైలుకి వెళ్లి వచ్చిన తరువాత తిరిగి 32 చైన్ స్నాచింగ్‌లు చేశారని అన్నారు. చైన్ స్నాచింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కత్తులతో బెదిరించి పరారవుతున్నారని వివరించారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులు సలీం, సయ్యద్ నజిమ్, సల్లాఉద్దీన్, సయ్యద్ జహంగీర్, అముల్ కోలేకర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. -
చాదర్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్
గాయపడిన మహిళ.. తప్పిన ప్రమాదం హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్‌పేటలోని ‘బి’ క్వార్టర్‌కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం రాత్రి నాంపల్లిలోని ఓ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో నల్లగొండ ఫ్లై ఓవర్ మీదుగా వస్తున్నారు. వారి వెనుకగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చి వర్ధనమ్మ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడు, 12 గ్రాముల గొలుసు తెంపుకొని పారిపోయారు. ఈక్రమంలో వాహనంపై ఉన్న వర్ధనమ్మ కిందపడిపోగా ఆమె భుజానికి, తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను భర్త శ్రీనివాస్ మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా చైన్ స్నాచింగ్ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయని వాటి ఆధారంగా నిందితులను పట్టుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ డా.రవీందర్ పేర్కొన్నారు.