ఎకానమీ వృద్ధికి నీతి ఆయోగ్ ఫార్ములా
♦ పన్నులు, వ్యవసాయం, ఇంధన రంగాల్లో సంస్కరణలు
♦ నష్టాల్లో ఉన్న పీఎస్యూల మూసివేత
♦ మూడేళ్ల ముసాయిదా అజెండా
న్యూఢిల్లీ: వృద్ధికి, ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై నీతి ఆయోగ్ మూడేళ్ల ముసాయిదా కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది. పన్నులు, వ్యవసాయం, ఇంధన రంగాల్లో కీలక సంస్కరణలు చేపట్టాల్సి ఉందని సూచించింది. ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించని కార్యకలాపాల్లో ప్రభుత్వ తన పాత్ర పరిమితంగానే ఉండేలా చూసుకోవాలని సూచించింది. ముసాయిదా అజెండాను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా మంగళవారం ఆవిష్కరించారు.
2017–18 నుంచి 2019–20 మధ్య ప్రతిపాదిత మూడేళ్ల అజెండాలో పన్నుల ఎగవేతను అరికట్టడానికి, మరింత మందిని పన్నుల పరిధిలోకి తెచ్చేందుకు, ట్యాక్సేషన్ను సరళతరం చేసేందుకు చర్యలు అవసరమని నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే నష్టాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను(సీపీఎస్ఈ) మూసివేయాలని, 20 పీఎస్యూల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం చేపట్టాలని సిఫార్సు చేసింది. సామాన్యులకు అందుబాటు ధరల్లో గృహాలు లభించేలా స్థలాల రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, వలసవచ్చే వారికోసం డార్మిటరీ హౌసింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.