ఛాంపియన్‌గా నిలిచిన కరీంనగర్ క్లస్టర్
చలకుర్తి(పెద్దవూర): మండలంలోని చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జేఎన్వీ రీజినల్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో కరీంనగర్ క్లస్టర్ ఛాంపియన్‌గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ జి.బ్రహ్మపుత్రారెడ్డి తెలిపారు. గురువారం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జేఎన్వీలకు చెందిన ఎనిమిది క్లస్టర్ల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అండర్–14, అండర్–17, అండర్–19 బాల బాలికల విభాగాల్లో మొత్తం ఆరు కేటగిరీలకు గాను ఐదింటిని కరీంనగర్ క్లస్టర్ గెల్చుకోగా, అండర్–19 విభాగంలో బెంగళూరు రూరల్ క్లస్టర్ గెలిచినట్లు తెలిపారు. బెస్ట్ ప్లేయర్స్ అవార్డులను అండర్–14 బాలుర, బాలికల విభాగంలో కరీంనగర్ క్లస్టర్‌కు చెందిన వేదానంద, మేఘనలు, అండర్–17 విభాగంలో కరీంనగర్ క్లస్టర్‌కు చెందిన ఎం. సుమంత్, హర్షితలు, అండర్–19 బాలుర విభాగంలో బెంగళూరు రూరల్ క్లస్టర్‌కు చెందిన కిరణ్, బాలికల విభాగంలో కరీంనగర్ క్లస్టర్‌కు చెందిన సాయిదీపికలు గెల్చుకున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మందిని జాతీయ స్థాయి పోటీల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు సెప్టెంబర్ 5వ తేదీ వరకు చలకుర్తిలోనే శిక్షణ నివ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూరై్తన తర్వాత సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గుజరాత్‌లోని కేడాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.