తెగబడిన టీడీపీ శ్రేణులు
నూజివీడు, న్యూస్‌లైన్ : వైఎస్సార్సీపీ అభ్యర్థి కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన నూజివీడులోని రామాయమ్మరావుపేటలో సోమవారం జరిగింది. అదే పేటకు చెందిన చల్లా పల్లవి వైఎస్సార్సీపీ తరఫున ఏడో వార్డు అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేశారు. ఆమెపై టీడీపీ తరఫున దేరంగుల పద్మావతి గెలుపొందారు. సోమవారం నిర్వహించిన కౌంటింగ్‌లో పల్లవి ఓటమి చెందగా, పద్మావతి విజయం సాధించారు. ఓటమి చెందిన పల్లవి కౌంటింగ్ కేంద్రం నుంచి 11 గంటల సమయంలో రామాయమ్మరావుపేటలోని తన ఇంటికి చేరుకున్నారు.
కొద్దిసేపటి తరువాత టీడీపీకి చెందిన పద్మావతి వర్గానికి చెందినవారు తమ వాహనాలతో పల్లవి ఇంటివైపుగా అరుపులు, కేకలు వేసుకుంటూ వెళ్తుండటంపై వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఒక్కసారిగా టీడీపీకి చెందినవారు కర్రలు, కత్తులతో వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో చల్లా పల్లవితో పాటు చల్లా కుమారి (40), చల్లా ఆంజనేయులు (30), చల్లా రంగబాబు (28), చల్లా వెంకటేశ్వరరావు (50)లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
పోలీసులకు ఫిర్యాదు...
తమపై దాడికి పాల్పడినవారిపై బాధితులు దేరంగుల పోతురాజు, దేరంగుల ఏసు, దేరంగుల దుర్గ, మక్కళ్ల సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిచేసినవారిలో దేరంగుల పోతురాజు, దేరంగుల మల్లిర్జునరావు, మక్కళ్ల సుబ్బారావు, మహేష్, దేరంగుల యస్సయ్య, దేరంగుల భలే రాజేష్, దేరంగుల దుర్గ, దేరంగుల భారతి, దేరంగుల ఉమా, తమ్మిశెట్టి భవాని, వెంకటేశ్వరి, మక్కళ్ల జయ, దేరంగుల పద్మ తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు.
బాధితులకు మేకా ప్రతాప్ పరామర్శ
టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను ఆ పార్టీ నాయకుడు, నూజివీడు అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు నూజివీడు ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకుని ఇంకా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి చెడు సంస్కృతి రావడం మంచిది కాదన్నారు. రాజకీయాలలో ఎంత ఒదిగి ఉంటే అంత మంచిదని హితవు పలికారు.