chaman resign
-
కులకలం
చమన్ రాజీనామా మళ్లీ వాయిదా - 26న పదవి వదులుకుంటానని ప్రకటన - నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వద్దన్న టీడీపీ! - దూదేకుల ఓటర్లకు జడిసి నిర్ణయం - అధికార పార్టీ తీరు వివాదాస్పదం - త్రిశంకు స్వర్గంలో పూల నాగరాజు సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెరపడిందనుకున్న జెడ్పీ చైర్మన్ చమన్ రాజీనామా వ్యవహారం మరో చర్చకు దారితీస్తోంది. ఈనెల 26న రాజీనామా చేస్తానని చెప్పిన చమన్ తిరిగి మొండికేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తాము సూచించే వరకు రాజీనామా చేయొద్దని టీడీపీ అధిష్టానం ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. బుధవారం చమన్ రాజీనామా చేస్తారని టీడీపీ నేతలతో పాటు మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూసింది. మొదట సాయంత్రం 4 గంటలకు, ఆపై 6 గంటలకు రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరకు రాజీనామా చేయడం లేదని టీడీపీ వర్గాలు తేల్చేశాయి. దీనికి వారు చెబుతున్న కారణాలు చూస్తే రాజకీయ అవసరాల కోసం రాజీనామా తేదీని వాయిదా వేస్తున్నారని సుస్పష్టమైంది. నంద్యాల ఉప ఎన్నికల వరకు బ్రేక్? నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం, దూదేకుల ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇటీవల ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలతో సీఎం, టీడీపీ నేతలు నంద్యాలలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారని, రాష్ట్రంలో జిల్లా పరిషత్‌లలో ఉన్న ఒక్కడినీ రాజీనామా చేయమంటే ఎలా అని ముస్లింలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల వరకు రాజీనామా వ్యవహారాన్ని వాయిదా వేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ సామాజికవర్గ నేతలతో మాత్రం చమన్‌ను కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే ఉప ఎన్నికలు ముగిసే వరకు రాజీనామా చేమొద్దని టీడీపీ అధిష్టానం చమన్‌కు సూచించినట్లు తెలిసింది. అంటే నంద్యాల ఉప ఎన్నికల్లో కేవలం ముస్లిం, దూదేకుల వర్గాలకు సంబంధించిన ఓట్ల కోసమే చమన్ రాజీనామా తేదీని తాత్కాలికంగా వాయిదా వేశారని, అతన్ని సుదీర్ఘంగా కొనసాగించే ఉద్దేశం లేదనేది స్పష్టమవుతోంది. పూలనాగరాజులో ఆందోళన జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోవాలన్న పూల నాగరాజుకు ఆటంకాలు ఎదరవుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో చెరీ రెండున్నరేళ్లనే ఒప్పందం మేరకు ఎన్నికల ఖర్చు కూడా ఇద్దరూ భరించినట్లు తెలుస్తోంది. ఒప్పందం మేరకు జనవరి 5న చమన్ రాజీనామా చేయాలని.. అయితే ఇప్పటి వరకూ కొనసాగడం ఏంటని నాగరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఆర్నెల్లు అదనంగా కొనసాగారని, తక్కిన రెండేళ్లు కూడా తనకు ఇవ్వకుండా మళ్లీ అధిష్టానం చమన్‌ను కొనసాగించడం ఏమిటని తన అనుచరులతో వాపోయినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల వరకు చమన్‌ను కొనసాగించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలే నిజమైతే.. ఇక తనకు జెడ్పీ పీఠం అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెడ్పీ పీఠం వ్యవహారంలో తలెత్తిన వివాదం టీడీపీలో ప్రకంపనలు సృష్టించేలా ఉంది. జెడ్పీ పీఠం నుంచి దిగేందుకు చమన్ మొదట్నుంచీ విముఖంగానే ఉన్నారు. అనివార్య పరిస్థితుల్లో రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా తర్వాత టీడీపీ నుంచి వీడేందుకు చమన్ సిద్ధంగా ఉన్నారని, చమన్‌తో సన్నిహితంగా ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో పూలనాగరాజు కూడా పార్టీ పెద్దలు తనకు సహకరించడం లేదనే యోచనలో ఉన్నారు. పార్టీని వీడుతానని చమన్ లీకులు పంపి, పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, చమన్ రాజీనామా చేయకుండా నంద్యాల ఉప ఎన్నికల వరకు కొనసాగితే తానే పార్టీ వీడుతానని తన సన్నిహితులతో చెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద చమన్ రాజీనామా చేస్తారా? లేదా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
వీడలేక.. దారిలేక!
నేడు చమన్ రాజీనామా – జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న రామగిరి జెడ్పీటీసీ – కలెక్టర్ ఆమోదం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ – ఆపై కొత్త చైర్మన్‌గా పూల నాగరాజుకు అవకాశం – అప్పటి వరకు వైస్ చైర్మన్ సుభాషిణమ్మకు చైర్మన్ బాధ్యతలు దూదేకుల చమన్ సాహెబ్. మూడేళ్ల నుంచి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన నేడు రాజీనామా చేయనున్నారు. ఈ పీఠంపై గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు ఆశీనులు కానున్నారు. చమన్ రాజీనామా, తదుపురి జెడ్పీ చైర్మన్ ఎంపిక వ్యవహారంపై ఆర్నెల్లుగా సాగుతున్న చర్చకు నేటితో తెరపడనుంది. చమన్ రాజీనామా చేసినప్పటికీ రాజ్యంగం ప్రకారం తిరిగి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. సాక్షిప్రతినిధి, అనంతపురం: మూడేళ్ల క్రితం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలను టీడీపీ దక్కించుకుంది. దీంతో జిల్లా పరిషత్ పీఠం టీడీపీ వశమైంది. ఎన్నికల కంటే ముందుగానే చమన్, పూల నాగరాజుకు రెండున్నరేళ్ల చొప్పున ఆ పదవిలో కొనసాగేందుకు ఒప్పందం జరిగింది. ఆ మేరకు ఈ ఏడాది జనవరి 5న చమన్ రాజీనామా చేయాలి. అయితే మూన్నెల్ల పాటు కొనసాగేందుకు పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత కూడా రాజీనామా చేయలేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంచాయితీ చేరింది. సీఎం జోక్యంతో చమన్ ఈనెల 15న రాజీనామా చేసేందుకు అంగీకరించారు. ఆ తేదీన కూడా రాజీనామా చేయకపోవడంతో తిరిగి చమన్ రాజీనామా వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో చమన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 26న రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో నేడు చమన్ పదవి నుంచి తప్పుకోనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్ ఆమోదం తర్వాతే కొత్త చైర్మన్ ఎంపిక జెడ్పీ చైర్మన్‌గా చమన్ తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను కలెక్టర్‌కు అందిస్తారు. రాజీనామా స్వచ్ఛందంగా చేశారా? భయభ్రాంతులకు లోనై చేశారా? అనే కోణంలో కలెక్టర్ విచారించి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారు. ఆమోదం తర్వాత ఆ ప్రతులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తారు. అప్పటి వరకూ సెక్షన్ 193(పీఆర్) ప్రకారం వైస్ చైర్మన్ బెళుగుప్ప జెడ్పీటీసీ సభ్యురాలు సుభాషిణమ్మ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆపై వ్యవహారాన్ని అధ్యయనం చేసి జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఎన్నికల తేదీ ప్రకటిస్తూ షెడ్యూలు వెలువడుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి కలెక్టర్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఎన్నికను చేపడతారు. జెడ్పీటీసీలను సమావేశపరిచి చైర్మన్‌గా నచ్చిన వారికి మద్దతు ఇవ్వండని ప్రకటించి, మెజార్టీ జెడ్పీటీసీ సభ్యులు ఎవరివైపు మొగ్గు చూపుతారో వారిని చైర్మన్‌గా ఎంపిక చేస్తారు. కేవలం జెడ్పీటీసీ సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఎక్స్అఫీషియో, కోఆప్షన్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఎంపిక అనంతరం జెడ్పీ చైర్మన్ ప్రమాణస్వీకారం చేస్తారు. అయిష్టంగానే చమన్ రాజీనామా చమన్ పరిటాల రవీంద్ర అనుచరుడు. ఆ వర్గంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. అతనిపై పలు కేసులు ఉండటంతో పోలీసులు జిల్లా బహిష్కరణ చేశారు. 2004–2009 కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొన్నారు. చంద్రబాబు కూడా చమన్‌తో కలిసి యాత్ర సాగించారు. పోలీసులు జోక్యం చేసుకుని చమన్‌ను జిల్లా సరిహద్దు వరకూ తీసుకెళ్లి.. వెళ్లిపోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. జెడ్పీ పీఠం టీడీపీ దక్కించుకోవడంతో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా జిల్లా పరిషత్‌లను నిర్వీర్యం చేసింది. దీంతో చమన్ కూడా జిల్లా పరిషత్‌ను వదిలేశారు. రెండున్నరేళ్ల తర్వాత రాజీనామా చేయాల్సి ఉన్నా, పదవిలో కొనసాగేందుకే మొగ్గు చూపాడు. నాగరాజుతో చర్చలు జరిపారు. ఇవేవీ సఫలం కాలేదు. పరిటాల వర్గీయుడుగా ముద్ర ఉండటం, జిల్లాలో ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలంతా పరిటాల వ్యతిరేక వర్గీయులుగా జట్టుకట్టడంతో ఎలాగైనా సునీత బలాన్ని తగ్గించాలనే కృతనిశ్చయంతో చమన్ రాజీనామా చేయాల్సిందేనని అధిష్టానం వద్ద ఒత్తిడి తెచ్చారు. దీంతో చంద్రబాబు రాజీనామాకు ఆదేశించారు. కానీ చమన్ మాత్రం మూడేళ్లు పదవిలో కొనసాగినప్పటికీ అయిష్టంగానే రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆమోదం తర్వాతే కొత్త చైర్మన్ ఎంపిక జెడ్పీ చైర్మన్ రాజీనామా చేస్తే, ఆ రాజీనామాకు దారితీసిన పరిస్థితులను పరిశీలించి కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. ఆపై ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అప్పటి వరకూ వైస్ చైర్మన్.. చైర్మన్ బాధ్యతలు పర్యవేక్షిస్తారు. - సూర్యనారాయణ, డిప్యూటీ సీఈఓ, జిల్లా పరిషత్