చమన్ రాజీనామా మళ్లీ వాయిదా
- 26న పదవి వదులుకుంటానని ప్రకటన
- నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వద్దన్న టీడీపీ!
- దూదేకుల ఓటర్లకు జడిసి నిర్ణయం
- అధికార పార్టీ తీరు వివాదాస్పదం
- త్రిశంకు స్వర్గంలో పూల నాగరాజు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెరపడిందనుకున్న జెడ్పీ చైర్మన్ చమన్ రాజీనామా వ్యవహారం మరో చర్చకు దారితీస్తోంది. ఈనెల 26న రాజీనామా చేస్తానని చెప్పిన చమన్ తిరిగి మొండికేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో తాము సూచించే వరకు రాజీనామా చేయొద్దని టీడీపీ అధిష్టానం ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. బుధవారం చమన్ రాజీనామా చేస్తారని టీడీపీ నేతలతో పాటు మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూసింది. మొదట సాయంత్రం 4 గంటలకు, ఆపై 6 గంటలకు రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరకు రాజీనామా చేయడం లేదని టీడీపీ వర్గాలు తేల్చేశాయి. దీనికి వారు చెబుతున్న కారణాలు చూస్తే రాజకీయ అవసరాల కోసం రాజీనామా తేదీని వాయిదా వేస్తున్నారని సుస్పష్టమైంది.
నంద్యాల ఉప ఎన్నికల వరకు బ్రేక్?
నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం, దూదేకుల ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇటీవల ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలతో సీఎం, టీడీపీ నేతలు నంద్యాలలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారని, రాష్ట్రంలో జిల్లా పరిషత్‌లలో ఉన్న ఒక్కడినీ రాజీనామా చేయమంటే ఎలా అని ముస్లింలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల వరకు రాజీనామా వ్యవహారాన్ని వాయిదా వేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ సామాజికవర్గ నేతలతో మాత్రం చమన్‌ను కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే ఉప ఎన్నికలు ముగిసే వరకు రాజీనామా చేమొద్దని టీడీపీ అధిష్టానం చమన్‌కు సూచించినట్లు తెలిసింది. అంటే నంద్యాల ఉప ఎన్నికల్లో కేవలం ముస్లిం, దూదేకుల వర్గాలకు సంబంధించిన ఓట్ల కోసమే చమన్ రాజీనామా తేదీని తాత్కాలికంగా వాయిదా వేశారని, అతన్ని సుదీర్ఘంగా కొనసాగించే ఉద్దేశం లేదనేది స్పష్టమవుతోంది.
పూలనాగరాజులో ఆందోళన
జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోవాలన్న పూల నాగరాజుకు ఆటంకాలు ఎదరవుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో చెరీ రెండున్నరేళ్లనే ఒప్పందం మేరకు ఎన్నికల ఖర్చు కూడా ఇద్దరూ భరించినట్లు తెలుస్తోంది. ఒప్పందం మేరకు జనవరి 5న చమన్ రాజీనామా చేయాలని.. అయితే ఇప్పటి వరకూ కొనసాగడం ఏంటని నాగరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఆర్నెల్లు అదనంగా కొనసాగారని, తక్కిన రెండేళ్లు కూడా తనకు ఇవ్వకుండా మళ్లీ అధిష్టానం చమన్‌ను కొనసాగించడం ఏమిటని తన అనుచరులతో వాపోయినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల వరకు చమన్‌ను కొనసాగించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలే నిజమైతే.. ఇక తనకు జెడ్పీ పీఠం అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెడ్పీ పీఠం వ్యవహారంలో తలెత్తిన వివాదం టీడీపీలో ప్రకంపనలు సృష్టించేలా ఉంది. జెడ్పీ పీఠం నుంచి దిగేందుకు చమన్ మొదట్నుంచీ విముఖంగానే ఉన్నారు.
అనివార్య పరిస్థితుల్లో రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా తర్వాత టీడీపీ నుంచి వీడేందుకు చమన్ సిద్ధంగా ఉన్నారని, చమన్‌తో సన్నిహితంగా ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో పూలనాగరాజు కూడా పార్టీ పెద్దలు తనకు సహకరించడం లేదనే యోచనలో ఉన్నారు. పార్టీని వీడుతానని చమన్ లీకులు పంపి, పార్టీ అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, చమన్ రాజీనామా చేయకుండా నంద్యాల ఉప ఎన్నికల వరకు కొనసాగితే తానే పార్టీ వీడుతానని తన సన్నిహితులతో చెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద చమన్ రాజీనామా చేస్తారా? లేదా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
కులకలం
Published Wed, Jul 26 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
Advertisement
Advertisement