చామంతులు.. ప్రగతి కాంతులు!
హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్(9705524169), శ్రీనివాస్‌లు మండల పరిధిలోని కొడిప్యాక శివారులో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. సాగుకు యోగ్యం కావనుకున్న నేలలో చామంతి సాగు చేపట్టారు. మొత్తం భూమిలో చామంతికి సంబంధించిన మ్యారీగోల్డ్తోపాటు వివిధ రంగుల చామంతి పూలను సాగు చేస్తూ హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడు నెలలకు కోతకు వచ్చే ఈ పంటను ప్రతినిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
తోట పనులను చూసుకునేందుకు నాయుడు అనే వ్యక్తిని నియమించారు. తరచూ వచ్చిపోతూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అతనికి వివరిస్తుంటారు. ఎకరా భూమిలో సుమారు 10నుంచి 12వేల మొక్కలు సాగు చేయవచ్చన్నారు. ఒక చామంతి మొక్కను సీజన్‌ను బట్టి రూ.4 నుంచి రూ.12కు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మూడు నెలల పాటు మొక్కను సంరక్షించేందుకు సుమారు రూ.40నుంచి రూ.50 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. మూడు నెలల తర్వాత ఒక మొక్క నుంచి కిలోన్నర నుంచి రెండు కిలోల దిగుబడి వస్తుందని తెలిపారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు పువ్వులు చేతికి వస్తాయని చెప్పారు.
కిలో పూలకు మార్కెట్లో స్థిరంగా రూ.40 నుంచి రూ.70 వరకు పలుకుతుందని తెలిపారు. దీపావళి, కార్తీకపౌర్ణిమ, బతుకమ్మ పండుగ తదితర సీజన్లలో వీటి ధర కిలోకు రూ.200 నుంచి రూ.300 వరకు కూడా పలుకుతుందన్నారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నందున కూలీల అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం చామంతి సాగు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని ఇతర ప్రాంతాలతో పాటు స్థానిక రైతులు కూడా తమ తోటను చూసేందుకు వస్తున్నారని తెలిపారు. సలహాల కోసం సంప్రదించాలన్నారు.