‘నా ఫోన్ దొరికింది’.. భారత్లోని ఫ్రెంచ్ రాయబారి
ఢిల్లీ : భారత్లో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. థియరీ మాథౌ ఫోన్ దొంగతనం చేసిన నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.దీపావళి పండుగ నేపథ్యంలో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ అక్టోబర్ 20 తన కుటుంబ సభ్యులతో కలిసి ఓల్డ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ లో షాపింగ్ చేశారు. ఆ సమయంలో 20 నుంచి 25ఏళ్ల మధ్యన ఉన్న దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించారు.షాపింగ్ చేస్తున్న థియరీ మాథౌ జేబులో ఉన్న ఫోన్ను కాజేశారు. ఫోన్ మాయ మవ్వడంతో మాథౌ ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయబార కార్యాలయం అధికారులు సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా మాథౌ షాపింగ్ చేస్తున్న ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా మాథౌ ఫోన్ ట్రేస్ చేశారు. నిన్న, ఇవాళ రెండ్రోజుల వ్యవధిలో ఫోన్ దొంగతనం చేసిన యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం థియరీ మాథౌకు ఫోన్ను అందించారు. దీంతో మాథౌకు సంతోషం వ్యక్తం చేశారు.