చక్కెర ధరలపై విపక్షం వాకౌట్
సమగ్ర ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్
నాగపూర్: చక్కెర ధరలు నానాటికీ పడిపోతుండడంపై ఏకమైన ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. మంగళవారం విధానసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇందుకు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లోనూ సమగ్ర ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే సహకార శాఖ మంత్రి చంద్రకాంత్పాటిల్ ఇచ్చిన సమాధానం అసంతృప్తి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు చంద్రకాంత్పాటిల్ సభనుద్దేశించి మాట్లాడుతూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి తీసుకుపోతానన్నారు. ఆయనతో చర్చిస్తానన్నారు.
అంతేకాకుండా త్వరలో అఖిలపక్షంతో కలసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్‌పవార్ మాట్లాడుతూ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ (ఎఫ్ఆర్పీ) విధానం అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అనేకమంది చక్కెర కర్మాగారం యజమానులు నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. వారిపై క్రిమినల్ అభియోగాలను మోపాలని డిమాండ్ చేశారు. చివరికి రాష్ట్రమంత్రులకు సైతం చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, ఈ కర్మాగారాలు కలిగిన వారిలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే, రెవె న్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే, సభాపతి హరిభావ్ బాగ్డే తదితరులు ఉన్నారన్నారు.
దీంతో సభలోనే ఉన్న మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే స్పందించారు. ఎఫ్ఆర్పీ కింద రైతాంగానికి చక్కెరకు తగినంత ధర ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదన్నారు. అయితే ఆ సమయంలో బాగ్డే, ఖడ్సేలు సభలో లేరు. మాజీ స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ మాట్లాడుతూ దిగుమతులు, ఎగుమతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానం వల్లనే చక్కెర రైతాంగానికి గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపించారు. చక్కెర రైతులు సంక్షోభంలో చిక్కుకుపోయారని, అందువల్ల వారికి అండదండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేకపోతే రుణం తీసుకోవాలని సూచించారు.
త్వరలో రెండు ఫొరెన్సిక్ లేబొరేటరీలు
నాగపూర్: రాష్ర్టంలో రెండు ప్రాంతీయ ఫొరెన్సిక్ లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం మంగళవారం విధానసభలో వెల్లడించింది. ఒకటి మరాఠ్వాడాలోని కొల్హాపూర్‌లోనూ, మరొకటి నాందేడ్‌లోనూ ఏర్పాటు చేయనుంది. కొల్హాపూర్‌లో ఏర్పాటయ్యే ఫొరెన్సిక్ లేబొరేటరీ... సాంగ్లి, కొల్హాపూర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు, ఇక నాందేడ్‌లో ఏర్పాటు కానున్న ఫొరెన్సిక్ లేబొరేటరీ పర్భణి, నాందేడ్, హింగోళి, లాతూర్ జిల్లాలకు సేవలందించనుంది. ఫొరెన్సిక్ లేబొరేటరీల ఏర్పాటుకోసం ప్రభుత్వం రూ. 27 కోట్ల మేర నిధులను కేటాయించింది. కొత్తగా వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
నేరాలు జరిగిన సమయంలో ఈ లేబొరేటరీలు శాస్త్రీయ విశ్లేషణ ద్వారా ఆధారాలను సేకరిస్తాయి. న్యాయస్థానాల్లో కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ఈ లేబొరేటరీలు అందించే నివేదికలే అత్యంత కీలకం. ఈ ఫొరెన్సిక్ లేబొరేటరీల్లో అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటివల్ల నేరనిర్ధారణ త్వరగా జరుగుతుంది. దీంతో దోషులకు శరవేగంగా శిక్ష పడుతుంది. ప్రస్తుతం ఫొరెన్సిక్ లేబొరేటరీ డెరైక్టరేట్ ముంబైలో ఉంది. దీనికి అనుబంధంగా నాగపూర్, పుణే, ఔరంగాబాద్ , నాసిక్, అమరావతిలలో ఫొరెన్సిక్ లేబొరేటరీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అయితే పెండింగ్‌లో ఉన్న నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ప్రభుత్వం కొత్తగా మరో రెండు ప్రాంతీయ ఫొరెన్సిక్ లేబొరేటరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.