breaking news
Chandrababu Vennupotuku Rendellu
-
అన్నదాత.. ‘ఆత్మ’ఘోష!
(పంపాన వరప్రసాదరావు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి): రెండేళ్ల ‘కాల కూటమి’ పాలనలో అన్నదాతలు అ«ధోగతి పాలయ్యారు! నష్టాల సాగులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సాగు భారమై... బతుకు బరువై సంక్షోభంలో కూరుకుపోయారు. ఏ పంటకూ మద్దతు ధర దక్కపోవడం.. చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలకు బలైపోతున్నారు. కొనేవారు లేక.. అమ్ముకునే దారిలేక.. పెట్టుబడి ఖర్చులు దక్కక.. అప్పులు తీర్చలేక రైతన్నల బతుకు దుర్భరంగా తయారైంది. దేశానికి అన్నంపెట్టే రైతులు భార్య పిల్లలకు పట్టెడన్నం పెట్టలేక పురుగు మందులను ఆశ్రయిస్తున్నారు. ఇంతటి విపత్తులో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే కాడిపారేయడంతో ఆసరా లేక, భరోసా కరువై అన్నదాతలు విగత జీవులుగా మారుతున్నారు. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రైతు ఆత్మహత్యల వార్త లేని రోజు లేదనే చెప్పాలి. ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకూ ఏ పల్లెకు వెళ్లినా ఇదే దుస్థితి. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. విత్తు నుంచి విక్రయం వరకు గతంలో ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపించిన తోడు కరువైందంటూ విలపిస్తున్నారు. మేమున్నామంటూ తమకు భరోసా ఇచ్చే నాధుడు లేకుండా పోయారంటూ వాపోతున్నారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనలో రైతుల వెతలపై అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో సుమారు 30కిపైగా పల్లెల్లో ‘సాక్షి ప్రతినిధి’ బృందం రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కళావిహీనంగా సీమ పల్లెలు.. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు చోటు చేసుకున్న రాయలసీమ జిల్లాల్లో రైతన్నల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. ఉద్యాన హబ్‌లో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. సీమలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి మొదలు టమాటా, బత్తాయి (చీని), మామిడి, బొప్పాయి, అరటి, పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ.. ఇలా ఏ పంట పండించే రైతు పరిస్థితి చూసినా దయనీయంగా ఉంది.సాగుభారమై బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోతుండడంతో సీమ పల్లెలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం లేదు.. అదునుకు విత్తనం లేదు.. కట్ట యూరియాకు దిక్కులేదు.. కరువు కాటకాలు, వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే పైసా పరిహారం లేదు... ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు.. ఏ పంటకూ మద్దతు ధర లేక, కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు మండిపడుతున్నారు. ఏ పంట చూసినా కన్నీళ్లే..మామిడి, బత్తాయి, అరటి, ఉల్లి, వేరుశనగ, కూరగాయలు లాంటివి రాయలసీమలో ప్రధాన పంటలు. వేరుశనగలో 90 శాతం.. పత్తి, సజ్జ లాంటి పంటలు సగానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగవుతుండగా.. జొన్న, మొక్కజొన్న సైతం 40 శాతానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి రకమైన జీ–9 అరటితో పాటు తోతాపురి మామిడి, బత్తాయి, ఉల్లి, పత్తి, పుచ్చకాయ, కర్భూజ, బొప్పాయి లాంటి పండ్లను సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగడం సర్కారు నిర్వాకాలకు నిదర్శనం.పత్తి మద్దతు ధర రూ.8110 కాగా మార్కెట్లో రూ.5 వేలకు మించి కొనలేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,400–1,600 మించి ఇవ్వడం లేదు. అరటి రైతులైతే ఖరీఫ్‌లో రూపాయికి తెగనమ్ముకోగా రబీలో రూ.5కు మించి దక్కలేదు. సజ్జ మద్దతు ధర రూ.2,750 కాగా మార్కెట్లో రూ.1,800–1,900 మధ్య అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.తోతాపురి మామిడికి కిలో రూ.4–6కు మించి దక్కలేదు. చివరికి బత్తాయికి కూడా ఖరీఫ్‌లో కిలో రూ.6మించి లభించలేదు. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి మరీ దారుణం. కిలో రూపాయి.. అర్ధ రూపాయి పలకడంతో చేసేదిలేక వేలాది టన్నులు రోడ్లపైనే పారబోసిన ఘటనలు కోకొల్లలు. రెండేళ్లుగా కర్భూజ, పుచ్చకాయ పంటకు ధర లేదు. చివరికి పూలకు కూడా రేటు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అన్నదాతకు సున్నం.. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోతపెట్టి 46.85 లక్షల మంది భూ యజమానులకు అరకొరగా రూ.14 వేల చొప్పున రూ.6,560.18 కోట్లతో సరిపెట్టారు. రెండేళ్లలో భూ యజమానులకే రూ.14,873.28 కోట్లు ఎగ్గొట్టారు. ఇక కౌలు రైతులకైతే రెండేళ్లూ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టారు. దాదాపు 16 లక్షలమంది కౌలు రైతులుండగా ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.6,400 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. పెట్టుబడి కోసం రైతులు సీజన్లో పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.బలవన్మరణాలు..సాగు కలిసి రాకపోవడంతో అప్పుల పాలైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వర్షాభావం, వరదలు, తుపాన్లు.. ఒక్కొక్కటిగా వైపరీత్యాలు విరుచుకుపడటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు మృత్యుపాశాలుగా మారాయి.టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే నాథుడు లేక, అప్పులు తీర్చే దారిలేక 2024–25లో 150 మందికి పైగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడగా.. ఇక 2025–26లో 393 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటించింది. వీరిలో అత్యధికులు సీమ జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ప్రభుత్వం పైసా పరిహారం ఇచి్చన పాపాన పోలేదు.చేయిపట్టి నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంవిత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా గ్రామ స్థాయిలో అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు కూటమి పాలనలో నిరీ్వర్యమైపోయాయి. 10,778 ఆర్బీకేలు కాస్తా రేషనలైజేషన్ పేరిట 8451 క్లస్టర్లుగా కుదించారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే సంకల్పంతో గత ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ల్లో సగానికి పైగా మూతపడగా మిగిలినవి అలంకారప్రాయంగా తయారయ్యాయి. సిబ్బందిని సర్వేలు, ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఆర్బీకేలకు వెళ్తే పలుకరించే నాధుడే కరువయ్యారు.అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన భవనాలను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీని నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో అడ్డగోలుగా కోత పెట్టారు. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఎరువులను పక్కదారి పట్టిస్తుండడంతో రైతులకు యూరియా, డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని వాపోతున్నారు.మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండేళ్లలో 50–70 శాతం మేర పెరిగిపోవడంతో సాగు భారం మారింది. మత్స్యకార, పశుసంవర్ధక శాఖలకు చెందిన సాగు ఉత్పాదకాల సరఫరాకు మంగళం పాడేశారు. వరుస వైపరీత్యాలు, కరువు సాయం కలిపి దాదాపు 7 లక్షల మంది రైతులకు చంద్రబాబు సర్కారు దాదాపు రూ.1,100 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.అటకెక్కిన ఉచిత పంటల బీమా రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం వచీ్చరాగానే మంగళం పాడేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన 2023–24 సీజన్‌కు సంబంధించిన ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. ఖరీఫ్ 2024 సీజన్ వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా పథకం కొనసాగగా.. రబీ–2024–25 సీజన్ నుంచి చంద్రబాబు సర్కారు స్వచ్ఛంద నమోదు పద్ధతి తెచ్చింది.2024–25 వ్యవసాయ సీజన్‌తో పాటు ఖరీఫ్–2025–26 సీజన్లో ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం బకాయిలు రూ.1,095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయి. రబీ –2025–26 సీజన్లో కనీసం బీమా పోర్టల్ కూడా తెరవలేదు. ఫలితంగా ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా బీమా చేయించుకోలేకపోయారు. ఇక రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీని రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మద్దతు ధర కోసం ఆందోళనలు.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. ధరల స్థిరీకరణ నిధి కింద పైసా ఇచి్చన పాపాన పోలేదు. ఉల్లి, టమాటా, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొగాకు, కోకో, మామిడి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 2024–25 సీజన్లో 75 కేజీల ధాన్యం బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకు రూ.1,150–1,450కి మించి దక్కలేదు.2025–26లో 75 కేజీల బస్తాకు రూ.1,777 దక్కాల్సి ఉండగా రూ.1,250 నుంచి రూ.1,500 మధ్య దక్కింది. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం, మామిడి, జొన్న, మొక్కజొన్న, పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగారు. 2023–24లో క్వింటా రూ.27 వేలకు పైగా పలికిన మిర్చి రైతుకు గతేడాది రూ.6–8 వేలకు మించి దక్కలేదు. మొక్కజొన్న ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,400 అయితే రైతులకు దక్కింది కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మధ్యే. టమాటా, ఉల్లి రైతుల పరిస్థితి రెండేళ్లుగా దారుణంగా ఉంది. పైసా సాయం అందలేదు.. గత ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో శనగ, మినుము, నాటుపొగాకు సాగు చేశా. దాదాపు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పత్తి తెగుళ్ల బారిన పడింది. నాటు పొగాకు కొనేవారు లేకుండా పోయారు. శనగ, మినుము పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అధికారులు రాసుకుని వెళ్లారే గానీ పైసా సాయం అందలేదు. – సుద్దాల సుబ్బరాయుడు, కొనకుంట్ల, నంద్యాల జిల్లారూ.60 లక్షలు నష్టపోయా.. 4 ఎకరాల్లో దానిమ్మ, మరో 4.5 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా. ముంపునీటి బారిన పడి గతేడాది అరటి పంట దెబ్బతింటే.. ఈ ఏడాది బాక్టీరియల్ బ్లైట్ తెగులు బారిన పడి దానిమ్మ పూర్తిగా నాశనమైంది. మరో 15–20 రోజుల్లో పంట కోతకొచ్చే దశలో అకాల వర్షాలు, వడగండ్లతో తెగులు సోకింది.చెట్టుకు 28 కేజీలకు తక్కువ కాకుండా ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆశించా. బెంగళూరు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. ఆ లెక్కన రూ.60 లక్షల వరకు నష్టపోయా. ఇది వాణిజ్య పంట కాబట్టి మీకు పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యాన పంటలన్నింటికి ఉచితంగా బీమా పరిహారం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పైసా సాయం లేదు. – ధర్మవరపు రవిశేఖర్‌రెడ్డి, కందుకూరు, అనంతపురం జిల్లాపరిస్థితి దారుణంగా ఉంది.. ఐదెకరాల్లో మొక్క జొన్న, వేరుశనగ వేశా. మొక్కజొన్నకు ఎకరాకు రూ.లక్ష, వేరుశనగకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కజొన్న 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,500కి మించి ధర రాలేదు. క్వింటాకు రూ.900 చొప్పున దాదాపు రూ.1.13 లక్షల మేర నష్టపోయా. వేరుశనగ అకాల వర్షాల బారిన పడి ఎందుకు పనికి రాకుండా పోయింది. రూ.8 లక్షలు అప్పు మిగిలింది. వైఎస్ జగన్ హయాంలో పైసా కట్టించుకోకుండా రూ.లక్షన్నరకు పైగా పంటల బీమా పరిహారం ఇచ్చారు. సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం ఇచ్చేవారు. నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. – మన్నెపూల శివశంకర్, మద్దాలపురం, అనంతపురం జిల్లాపాడి రైతులకు దగా.. మాకు మూడు ఆవులున్నాయి. రోజుకు నాలుగైదు లీటర్ల పాలు ఇస్తాయి. మా గ్రామంలో లీటర్ గేదె పాలకు రూ.40, ఆవుపాలకు రూ.20 మించి ఇవ్వడం లేదు. అదేమిటని అడిగితే వెన్న శాతం లేదంటారు. గత ప్రభుత్వ హయాంలో మంచి రేటు వచ్చేది. అమూల్ కేంద్రాల్లో పాలు పోసేవాళ్లం. లీటర్ గేదె పాలకు రూ.80, ఆవుపాలకు రూ.50కిపైగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలా అయితే పాడి రైతులు బతికేదెలాగో అర్ధం కావడం లేదు. – ఎం.జానకమ్మ, మద్దాలపురం, అనంతపురం జిల్లాపరిహారం లేదు.. వితంతు పింఛనూ ఇవ్వరు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్ఠూరు గ్రామానికి చెందిన రాగులపాడు సురేష్ (35) తనకున్న 1.5 ఎకరాల సొంత భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని గత ఖరీఫ్‌లో మొక్కజొన్న, శనగ సాగుచేశాడు. పెట్టుబడి కోసం నాలుగు తులాలు బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవ పెట్టాడు. తీరా పంట చేతికొచ్చే సరికి మద్దతు ధరలేక పెట్టుబడి కూడా రాలేదు.అప్పులు రూ.5 లక్షలకు చేరుకోవడంతో ఒత్తిళ్లు భరించలేక మార్చిలో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు బిడ్డలను పోషించుకునేందుకు కూలి పనులకు వెళ్తున్నట్లు సురేష్ భార్య సునీత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకు పరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోందని, కనీసం వితంతు పింఛన్ అయినా ఇప్పించండి బాబూ అంటూ కాళ్లా వేళ్లా పడినా పట్టించుకోవడంలేదంటూ వాపోయింది. పిల్లలతో కలిసి కూలి పనులకు పోతున్నా.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం చెరుకులపాడు మజర కోసనా పల్లె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కురువ రామచంద్రుడు (45)కి సొంతంగా 2.5 ఎకరాలు, మరో 2 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. రెండు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి, పొగాకు సాగు చేసినా పంటలు కొనేవారు లేక తీవ్రంగా నష్టపోయాడు.ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. అప్పులు కాస్తా వడ్డీలతో రూ.12 లక్షలకు చేరుకున్నాయి. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఉల్లి, తెగులు నివారణకు తెచ్చిన పురుగుల మందు తాగి గతేడాది సెప్టెంబర్ 14న ఆత్మహత్యకు ఒడిగట్టడంతో రామచంద్రుడి కుటుంబం దిక్కుతోచక అల్లాడుతోంది. ఇద్దరు కుమార్తెలను పోషించుకునేందుకు కూలి పనులకు పోతున్నానంటూ రామచంద్రుడు భార్య లక్ష్మీ వాపోయింది. తనకు భర్తకు కౌలు కార్డు లేదనే సాకుతో పరిహారం రాదు పొమ్మంటున్నారని.. అప్పులోళ్లు భూమిని లాగేసుకున్నారని.. ఎలా బతకాలో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది.భూములు అమ్ముకుంటున్న అన్నదాతలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసులుడికి గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉల్లి, శనగ, వేరుశనగ, బంతి, చామంతి సాగు చేస్తారు. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో గ్రామంలో 90 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చేదారిలేక కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న భూములను తెగనమ్ముకుంటున్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఇప్పటికే 500 ఎకరాలకు పైగా అమ్ముకున్నామంటూ వాపోతున్నారు.వేరుశనగకు దూరమైన పల్లెలు.. ఈ ఫొటోలో ఉన్నవారంతా అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం కోటంక గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో దాదాపు 3 వేల ఎకరాల సాగు భూమి ఉండగా 95 శాతం మంది రైతులు వేరుశనగ సాగు చేస్తుంటారు. రెండేళ్లుగా చీడపీడలతో దిగుబడులు తగ్గిపోవడం.. పెట్టుబడులు పెరిగిపోవడంతో పాటు ఏ ఒక్క సీజన్లోనూ మద్దతు ధర దక్కక పోవడంతో ప్రతీ ఒక్కరూ రూ.లక్షల్లో అప్పుల పాలయ్యారు. దీంతో వేరుశనగ సాగుకు గ్రామం పూర్తిగా దూరమైంది. ప్రత్యామ్నాయ పంటలు సైతం కలసి రావడం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద ఒక్క అనంతపురం, కర్నూలు జిల్లాలకే రూ.1,000 కోట్లకు పైగా పరిహారం దక్కింది. దాదాపు ప్రతీ రైతు రూ.లక్ష నుంచి రూ.నాలుగైదు లక్షల వరకు పరిహారం అందుకున్నారు. కానీ రెండేళ్లుగా తమ పరిస్థితి దారుణంగా ఉందంటూ గ్రామానికి చెందిన రైతు టి.నారాయణ ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రత్తిపాడు లో పోలీసులు ఓవర్ యాక్షన్.. కాలుతున్న కర్రను పట్టుకుని
-
ఆళ్లగడ్డలో ఉప్పొంగిన జనహోరు.. బాబుపై గంగుల బ్రిజేంద్ర రెడ్డి సెటైర్లు
-
ఆ హామీలు ఏమయ్యాయి బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమం సక్సెస్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం ఆగదు.. మోసాలను నిలదీస్తాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. 2YearsForCBNBackStabbing హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. రెండేళ్ల ‘నారాసుర’ పాలన-రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు.. ర్యాలీలు ప్రజాగ్రహానికి అద్దం పట్టాయని ఆయన ట్వీట్ చేశారు.‘‘రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది...విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు...ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు...చంద్రబాబుకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు’’ అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన… pic.twitter.com/07PTqq4ojb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 12, 2026 -
ట్రెండింగ్‌లో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’
సాక్షి, తాడేపల్లి: 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' ట్రెండింగ్‌లో నిలిచింది. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీ నిరసన వీడియోలు 'ఎక్స్'లో బాగా వైరల్ అవుతున్నాయి. #2yearsforTdpbackstabbing పేరుతో ట్రెండింగ్ అవుతోంది. చంద్రబాబు మోసాలపై జనం స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. దీంతో పాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహించారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సమర శంఖం(ఫోటో గ్యాలరీ) -
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్సీపీ సమర శంఖం (ఫొటోలు)
-
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ఈ ర్యాలీలు చేపట్టినట్లు తెలిపారు. దగాపడ్డ రైతులు, మహిళలు, పిల్లలు ఇలా ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొన్నారు.అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు.


