chandrasekar
-
TS Election 2023: గీతారెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి..
సంగారెడ్డి: నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే శనివారం రాత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆదివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌తో కలిసి చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించడం చక చకా జరిగిపోయాయి. తన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు జహీరాబాద్ నియోజకవర్గంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన వారని, భార్య స్వస్థలం జహీరాబాద్ కావడంతో తనకు కలిసివస్తుందని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ నెల 18న కాంగ్రెస్‌లో అధికారికంగా చేరుతున్నట్లు ప్రకటించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం చంద్రశేఖర్ పేరును ప్రతిపాదించినట్లు ప్రచారం సాగుతోంది. గీతారెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి.. మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి జె.గీతారెడ్డిని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి ఎంపీపీ అధ్యక్షుడు ఎన్.గిరిధర్‌రెడ్డితో కలిసి ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితుల కారణంగా గీతారెడ్డి ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సుముఖంగా లేనట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి, లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలనే దానిపై ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. తన స్థానంలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని, గెలిచే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని గీతారెడ్డి సూచించినట్లు వినికిడి. ఈ సందర్భంగా వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరు ప్రస్తావనకు రాగా ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
బీజేపీకి బిగ్ షాక్.. బండి సంజయ్ ఎఫెక్ట్ మామూలుగా లేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. తెలంగాణ చీఫ్‌గా బండి సంజయ్‌ను తప్పించిన నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారా?. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయి. వివరాల ప్రకారం.. బండి సంజయ్ మార్పు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ హైకమాండ్‌పై కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న బండి సంజయ్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో మార్చడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లేదన్నారు. కిషన్‌రెడ్డిని డీగ్రేడ్ చేయడం సరికాదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి నేతల మధ్య పార్టీ బలపడదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక, ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ఆదివారం హుటాహుటిన చంద్రశేఖర్‌ను ఈటల కలిశారు. ఈ సందర్భంగా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈటల కోరారు. బీజేపీలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లు అయినా ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామని.. వారికి ఉమ్మడిగా ఎజెండా ఉందని ఈటల రాజేందర్ అన్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ తనకి ఏమి చెప్పలేదని.. తాను పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఈటలకు చెప్పానన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలనే అంశాలపైనే చర్చించామని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ, బీఆర్ఎస్కు షాక్ తప్పదా?.. రేణుకా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
ఆ వ్యాపారులపై తనిఖీలు, వేధింపులు ఉండవు
సాక్షి, విజయవాడ బ్యూరో: బంగారు ఆభరణాల వ్యాపారులపై శాఖాపరంగా ఎలాంటి వేధింపులు ఉండబోవు. ఎక్సైజ్ డ్యూటీ విధింపుపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ జేఎస్ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. ఎక్సైజ్ డ్యూటీ విధింపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మె చేస్తోన్న విజయవాడ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల బంగారు ఆభరణాల వ్యాపారులతో ఆయన మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజయవాడలోని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ చంద్రశేఖర్ వ్యాపారులకు పలు వివరాలను తెలియజేశారు. బంగారు ఆభరణాలపై ఇన్పుట్ ట్యాక్సు క్రెడిట్ లేకుండా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఒక శాతం, క్రెడిట్‌తో కలిపి 12.5 శాతాన్ని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిందన్నారు. ఏడాదికి రూ.12 కోట్లకు పైబడి వ్యాపారం జరిపే పెద్దపెద్ద వ్యాపారులకే ఎక్సైజ్ డ్యూటీ వర్తిస్తుందనీ, చిన్నచిన్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎక్సైజ్ డ్యూటీ పరిధిలోకి వచ్చే వ్యాపారులు రిజిస్ట్రేషన్ తీసుకుని సహకరించాలనీ, అధికారులతో సంబంధం లేకుండా నేరుగా ఆన్లైన్లో ఈ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం నగల వ్యాపారుల దుకాణాలను తనిఖీ చేయడం గానీ, తయారీ యూనిట్లకు వెళ్లడం గానీ ఉండబోవన్నారు. నిల్వలను స్వాధీనం చేసుకోవడం, అరెస్టులు, ప్రాసిక్యూషన్లు కూడా ఉండవన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపులన్నీ మొదటి అమ్మకం ఇన్వాయిస్లపైనే ఆధారపడి ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ నెలాఖరుతో ముగుస్తుందని కమిషనర్ చంద్ర శేఖర్ వెల్లడించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అదనపు కమిషనర్ వి.నాగేంద్ర రావు మాట్లాడుతూ, జాబ్ వర్క్‌పై చిన్నచిన్న ఆభరణాలు తయారు చేసే వ్యాపారులు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన పనిలేదన్నారు. కిందటేడాది రూ.12 కోట్ల టర్నోవ ర్ దాటిన వ్యాపారులు మాత్రం ఈ ఏడాది ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన బంగారు వర్తకుల నాయకులు, అసోషియేషన్ సభ్యులు పాల్గొన్నారు.