సాక్షి, విజయవాడ బ్యూరో: బంగారు ఆభరణాల వ్యాపారులపై శాఖాపరంగా ఎలాంటి వేధింపులు ఉండబోవు. ఎక్సైజ్ డ్యూటీ విధింపుపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ జేఎస్ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. ఎక్సైజ్ డ్యూటీ విధింపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మె చేస్తోన్న విజయవాడ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల బంగారు ఆభరణాల వ్యాపారులతో ఆయన మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజయవాడలోని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ చంద్రశేఖర్ వ్యాపారులకు పలు వివరాలను తెలియజేశారు. బంగారు ఆభరణాలపై ఇన్‌పుట్ ట్యాక్సు క్రెడిట్ లేకుండా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఒక శాతం, క్రెడిట్‌తో కలిపి 12.5 శాతాన్ని కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిందన్నారు.
ఏడాదికి రూ.12 కోట్లకు పైబడి వ్యాపారం జరిపే పెద్దపెద్ద వ్యాపారులకే ఎక్సైజ్ డ్యూటీ వర్తిస్తుందనీ, చిన్నచిన్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎక్సైజ్ డ్యూటీ పరిధిలోకి వచ్చే వ్యాపారులు రిజిస్ట్రేషన్ తీసుకుని సహకరించాలనీ, అధికారులతో సంబంధం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం నగల వ్యాపారుల దుకాణాలను తనిఖీ చేయడం గానీ, తయారీ యూనిట్లకు వెళ్లడం గానీ ఉండబోవన్నారు. నిల్వలను స్వాధీనం చేసుకోవడం, అరెస్టులు, ప్రాసిక్యూషన్‌లు కూడా ఉండవన్నారు.
సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపులన్నీ మొదటి అమ్మకం ఇన్‌వాయిస్‌లపైనే ఆధారపడి ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ నెలాఖరుతో ముగుస్తుందని కమిషనర్ చంద్ర శేఖర్ వెల్లడించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అదనపు కమిషనర్ వి.నాగేంద్ర రావు మాట్లాడుతూ, జాబ్ వర్క్‌పై చిన్నచిన్న ఆభరణాలు తయారు చేసే వ్యాపారులు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన పనిలేదన్నారు. కిందటేడాది రూ.12 కోట్ల టర్నోవ ర్ దాటిన వ్యాపారులు మాత్రం ఈ ఏడాది ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన బంగారు వర్తకుల నాయకులు, అసోషియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆ వ్యాపారులపై తనిఖీలు, వేధింపులు ఉండవు
Published Tue, Mar 29 2016 11:32 PM | Last Updated on Thu, Aug 2 2018 4:53 PM
Advertisement