ఫేస్బుక్ చాటింగ్... ఆపై చీటింగ్!
► సోషల్‌మీడియా ద్వారా ఉద్యోగాలంటూ ఎర
► దరఖాస్తుల్లోని వివరాల ఆధారంగా చాటింగ్స్
► బ్లాక్మెయిల్ చేస్తూ యువతులకు బెదిరింపులు
► నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్
సిటీబ్యూరో: సోషల్ మీడియాలోని వివిధ సైట్లలో ఉద్యోగాలంటూ ప్రకటనలు ఇచ్చి, దరఖాస్తు చేసిన మహిళలతో చాటింగ్స్ చేసి, చివరకు బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసులో ఓ యువతిని ఫేస్బుక్ ద్వారా వేధిస్తున్న ఆమె క్లాస్‌మేట్‌ను కటకటాల్లోకి పంపారు. నిందితులిద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. చిలకలూరిపేటకు చెందిన బాబూరావు (52) ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలైన ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. అందులో తన ఈ-మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నెంబర్ పొందుపరుస్తాడు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన యువతులు, మహిళల ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీల ఆధారంగా వారితో చాటింగ్ చేస్తాడు. తర్వాత అభ్యంతరకర, అశ్లీల సందేశాలు పంపిస్తాడు. కొన్నాళ్లు గడిచాక సదరు యువతి/మహిళకు ఫోన్లు చేసి.. ‘చాటింగ్’ వివరాలను వారి కుటుంబ సభ్యులకు, సంబంధీకులకు చెప్పకుండా ఉండాలంటే తనకు డబ్బు డబ్బు ఇవ్వాలని బ్లాక్‌మెయిలింగ్ చేసి తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ పి.రాజు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించారు. సోమవారం చిలకలూరిపేటలో బాబూరావును అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. గతంలో వెలుగులోకి వచ్చిన ‘మధు’ వ్యవహారం మాదిరిగానే ఇతడి కేసూ ఉండటంతో చాటింగ్ హిస్టరీని అధ్యయనం చేస్తున్నారు.
అసూయతో కటకటాల్లోకి...
తన క్లాస్‌మేట్‌పై ఉన్న అసూయ ఓ వివాహితుడిని కటకటాల పాల్జేసింది. గుంటూరుకు చెందిన సాయికృష్ణ, నగరానికి చెందిన యువతి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటికీ అనేక అంశాల్లో పోటీ నేపథ్యంలో వీరి మధ్య స్పర్థలు వచ్చాయి. యువతిపై సాయి అసూయ పెంచుకున్నాడు. కొన్నాళ్ల క్రితం సాయి ఆ యువతి స్నేహితురాలినే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురికీ ఆ యువతి స్నేహితురా లు కావడంతో తన క్లాస్‌మేట్‌కు బహుమతి అంటూ ఓ లేఖను పంపింది. అందులో ఆమె తనను తిట్టడంతో సాయి జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమెపై కక్షకట్టి వేధింపులు ప్రారంభించాడు. ఫేస్బుక్ చాటింగ్ ద్వారా పరుషపదజాలంతో సందేశా లు పెట్టడంతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలూ చేశాడు. ఇటీవల ఈ ధోరణి మరీ పెరిగిపోవడంతో విసుగు చెందిన యువతి సీసీఎస్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ పి.రాజు సోమవారం సాయిని గుంటూరులో అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చి జైలుకు పంపారు. సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీ సులు వీరిద్దరితో పాటు క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్ డేటాలను సంగ్రహించి, మోసాలకు పాల్పడుతున్న మరో తొమ్మిది మంది నిందితుల్నీ అరెస్టు చేశారు.