చౌదర్పల్లి గ్రామం
మోదీతో ముఖాముఖికి చౌదర్పల్లి సర్పంచ్
యాచారం (ఇబ్రహీంపట్నం) : రంగారెడ్డి జిల్లా చౌదర్పల్లి సర్పంచ్ గౌర నర్సింహకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం దక్కింది. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ నెల 24 న లక్నోలో జరగనున్న " గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ తక్ " కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హజరుకానున్నారు. లక్నోలో జరిగే కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా నుంచి యాచారం మండలం చౌదర్పల్లి సర్పంచ్ నర్సింహకు అరుదైన గౌరవం దక్కింది.
ఆదివారం ఉదయం ఆయన గ్రామం నుంచి బయలుదేరనున్నారు. గ్రామంలో వంద శాతం పన్నులు వసూలు చేసినందుకు, గ్రామ వివరాలను కంప్యూటర్లో పొందుపర్చినందుకు జిల్లా పంచాయతీ శాఖ గౌర నర్సింహను ఎంపిక చేసింది. లక్నోలో జరిగే కార్యక్రమంలో సర్పంచ్ ప్రధానితో జరిగే ముఖాముఖిలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ అవకాశం దక్కడంపై సర్పంచ్ గౌర నర్సింహ మాట్లాడుతూ, అరుదైన గౌరవం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసుల సహకారంతోనే తనకు గుర్తింపు వచ్చిందని తెలిపారు.