Chaurasi Kosi Parikrama Yatra
-
పార్లమెంట్ ను కుదిపేసిన అయోధ్య యాత్ర
పార్లమెంట్ ఉభయ సభలను అయోధ్య 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర' కుదిపేసింది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు పదే పదే వాగ్వాదానికి దిగడంతో సభకు పలుమార్లు అంతరాయం కలిగింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ పై సభలో గందరగోళం నెలకొంది. రాజ్యాంగాన్ని, కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ బీజేపీ దౌర్జన్యానికి దిగి, ఢిల్లీలోని పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిందని సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ యాత్రలకు ప్రజల, స్వాముల మద్దతు లేదని... అందుకే దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ములాయం హితవు పలికారు. సోమవారం లంచ్ సమయానికి ముందే యాత్ర వివాదంపై ఉభయ సభలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర ములాయం సింగ్, పార్లమెంట్ బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ -
లక్నోలో సింఘాల్, అయోధ్యలో తొగాడియా అరెస్ట్!
విశ్వ హిందు పరిషత్ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ నాయకులు చేపట్టిన 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర'ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ సింఘాల్ ను లక్నోలో అరెస్ట్ చేయగా, తొగాడియాను అయోధ్యలో అదుపులోకి తీసుకున్నారు. 'చౌరాసీ కోసి పరిక్రమ యాత్ర'ను అడ్డుకుంటున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపట్నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్టు అయోధ్యలోని గోలాఘాట్ లో అరెస్టైన తర్వాత తొగాడియా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ప్రత్యక్షపోరాటానికి దిగిన విశ్వహిందూ పరిషత్.. అయోధ్య యాత్రను ప్రారంభించింది. పరిషత్ జాతీయ నాయకుడు ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 500 మంది వీహెచ్పీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఓ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. రామ జన్మభూమి న్యాస్ కమిటీ చైర్మన్ మహంత్ నృత్య గోపాలదాస్ ఈ యాత్రను అయోధ్యలోని మణిరాం చవానీ (అఖాడా) నుంచి ప్రారంభించారు. కానీ యాత్ర కొద్ది దూరం వెళ్లేలోపే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. తమ యాత్రను రాజకీయం చేయడం తగదని, ఇది కేవలం ఒకటి రెండు రోజులకు సంబంధించినది కాదని, ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటుందని గోపాలదాస్ తెలిపారు. యాత్ర చేసి తీరుతామని వీహెచ్పీ ప్రకటించిన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. దుకాణాలు మొత్తం మూసేశారు. నయాఘాట్ ప్రాంతమంతా పోలీసు వయలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది వీహెచ్పీ మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు.