breaking news
check-in
-
యూరప్ ఎయిర్‌పోర్ట్‌లపై సైబర్ దాడి
లండన్/న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో రహదారు లను ఎంత విపరీతంగా వినియోగిస్తారో యూరప్ దేశాల్లో విమానాలను పౌరులు అంతే స్థాయి లో ఉపయోగిస్తారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే యూరప్‌లోని పలు దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాలపై శనివారం అనూహ్యంగా హఠాత్తుగా ఒకేసారి సైబర్ దాడి జరిగింది. ఈ దెబ్బకు ఆయా విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికుల చెక్–ఇన్, బోర్డింగ్ సర్వీసులు స్తంభించిపోయాయి. సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సర్వీస్ ప్రొవైడర్లను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకోవడంతో ఈ సమస్య తెలెత్తినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే అప్రమత్తమైన నిపుణులు పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చిందని, స్వల్పస్థాయిలో ప్రయాణికులే ఇంకా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో విమానసర్వీసుల వ్యవస్థలో పటిష్ట భద్రతా లోపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లండన్‌లోని ప్రఖ్యాత హీత్రూ ఎయిర్పోర్ట్ మొదలు బెల్జియంలోని బ్రస్సెల్‌లో ఎయిర్పోర్ట్, జర్మనీలోని బెర్లిన్ విమానాశ్రయం దాకా పలు ఎయిర్‌పోర్ట్‌లు సైబర్‌దాడుల ప్రభావాన్ని చవిచూశాయి. ఎయిర్‌లైన్స్, ఎయిర్పోర్ట్ వ్యవస్థల్లో సైబర్‌దాడి జరగలేదని కేవలం సర్వీస్ ప్రొవైడర్లలోనే ఈ ఘటన జరిగిందని బ్రస్సెల్స్ ఎయిర్పోర్ట్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘కొన్ని ఎయిర్‌పోర్ట్‌లలో మల్టీ–యూజర్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ (మ్యూస్) సాఫ్ట్‌వేర్‌పై సైబర్‌దాడి జరిగింది. దీంతో ప్రయాణికులు సొంతంగా చెక్–ఇన్ చేసుకోవడం, బోర్డింగ్ పాస్ ముద్రణ, బ్యాగులకు ట్యాగ్లు తదితర సేవలు అందుబాటులోకి లేకుండా పోయాయి’’అని ఈ సాఫ్ట్వేర్ సేవలు అందించే కోలిన్స్ ఏరోస్పేస్ సంస్థ తెలిపింది.ఇది కచ్చితంగా లక్షిత దాడే‘‘యథాలాపంగా జరిగిన దాడి కాదు. హ్యాకర్లు, నేరముఠాలు లేదా యూరప్ అంటే గిట్టని దేశాలు తమ సైబర్ నిపుణులతో చేయించిన దాడి ఇది. ఒకేసారి వేర్వేరు దేశాల్లోని వేర్వేరు సర్వీస్ ప్రొవైడర్ల సమక్షంలో పనిచేసే ఎయిర్‌పోర్ట్‌లపై జరిగిన దాడి ఇది. ఇది నిజంగా ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేసే దాడి. ప్రపంచంలోనే మంచి పేరున్న ఏవియేషన్, రక్షణరంగ కంపెనీల సాఫ్ట్‌వేర్‌పైనే దాడి జరిగింది. భద్రతావైఫల్యాలను ఈ ఘటన ఎత్తిచూపిస్తోంది’’ అని ప్రయాణి నిపుణుడు పౌల్ ఛార్లెస్ విశ్లేషించారు. సైబర్‌దాడికి గురైన వ్యవస్థలతో అనుసంధానతను ఆపరేటర్లు వెంటనే తొలగించి ప్రభావతీవ్రతను తగ్గించారని బెర్లిన్ ఎయిర్పోర్ట్ తెలిపింది. యూరప్‌లోనే అత్యంత రద్దీగా ఉంటే హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లోనూ కొందరు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ‘కియోస్క్‌లు పనిచేయట్లేవు. కౌంటర్ల వద్ద సిబ్బంది ఎటో వెళ్లిపోయారు. బ్యాగేజ్ చెక్–ఇన్ కోసం టెర్మినల్–4 వద్ద మూడు గంటలువేచి ఉన్నాను’ అని మేరియా కాసే అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఆన్లైన్ పనిచేయట్లేదు. దీంతో మ్యాన్యువల్‌గా చెక్–ఇన్ పూర్తిచేస్తున్నాం. బ్యాగ్‌లపై చేతితో నంబర్లు వేస్తున్నాం’’అని ఏవియేషన్, డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ కోలిన్స్‌కు అనుబంధ ‘ఆర్టీఎక్స్’ తెలిపింది. భారత్‌లో మాత్రం ఇలాంటి సమస్య తలెత్తలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు శనివారం ప్రకటించారు. -
పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్ కష్టమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయాణ బుకింగ్స్ వ్యాపార సంస్థ ఓయో కొత్తగా తమ భాగస్వామ్య హోటళ్లలో దిగే వినియోగదారులకు నూతన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. తొలుత మీరట్ పట్టణంలో మాత్రమే ఈ కొత్త చెక్–ఇన్ నియమావళిని అమలుచేస్తోంది. పెళ్లికాని జంటలకు హోటల్ గది ఇవ్వడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. సవరించిన నిబంధనావళి ప్రకారం ఎవరైనా జంట హోటల్ గదిని బుక్చేయాలనుకుంటే తమ వివాహబంధాన్ని ధృవీకరిస్తూ ఏదైనా గుర్తింపును చూపాల్సి ఉంటుంది. స్థానిక సామాజిక సున్నితాంశాలను పరిగణనలోకి తీసుకుని గదిని ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే విచక్షణాధికారం ఆయా హోటళ్లకు ఉందని ఓయో ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త చెక్–ఇన్ నిబంధనలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని తదనుగుణంగా సవరించిన నియామావళిని దేశవ్యాప్తంగా త్వరలో అమలుచేసే యోచన ఉందని ఓయో పేర్కొంది. ‘‘అత్యంత సురక్షితమైన, భద్రమైన, మెరుగైన హోటల్ సేవలు అందించే లక్ష్యంతో కొత్త నిబంధనావళిని తెస్తున్నాం. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇస్తూనే పౌరసమాజాల విజ్ఞప్తులు, వినతులను పరిగణనలోకి తీసుకుని మేం పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణాలు చేసే పర్యాటకులు, సందర్శకులు, వ్యాపారుల సౌకర్యార్థం కొత్త నియమావళిని తెస్తున్నాం’అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ చెప్పారు. ‘‘మెరుగైన, పటిష్ట నిబంధనల కారణంగా వినియోగదారుల్లో మా పట్ల విశ్వాసం మరింత పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ రోజులు గదులు అద్దెకు తీసుకోవడం, మళ్లీ మళ్లీ బుక్ చేయడం వంటివి చేస్తారు’’అని ఆయన అన్నారు. అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవడం, వాటిని నిషేధించడం, తమ బ్రాండ్ పేరును అనధికారికంగా వాడుకోవడం, దుర్వినియోగం చేయడం వంటి వాటిపై ఓయో సంస్థ.. హోటళ్ల భాగస్వాములు, పోలీసులతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంయుక్తంగా పలు సెమినార్లను నిర్వహించింది. -
స్పైస్ జెట్.. మొబైల్ చెకిన్ సేవలు!
ఇప్పటికే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలు అందించడంలో ముందున్న విమానయాన సంస్థ స్పైస్ జెట్.. కొత్తగా స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. గంటలదరబడి క్యూలైన్లలో బోర్డింగ్ పాస్ ల కోసం, చెకిన్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ యాప్.. స్మార్ట్ చెక్-ఇన్ ను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కొత్తగా ప్రవేశ పెట్టింది. ప్రయాణీకులు గంటలకొద్దీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకు స్పైస్ జెట్ మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ చెక్- ఇన్ పేరున కొత్త యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ నూతన యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని దీనిద్వారా ఎయిర్ పోర్టులో నిమిషాల్లో చెకిన్ అయ్యే అవకాశం కల్పించింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటిసారి స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. ఈ సరికొత్త సేవతో ప్రయాణీకులు చెకింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. ఈ సేవలను కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంలో స్పైస్ జెట్ ముందుంటుందని ఈ సందర్భంలో ఆయన తెలిపారు. త్వరలో ఈ సేవలను అన్ని విమానాశ్రయాల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న విమాన ప్రయాణీకులు.. విమానాశ్రయంలోని చెక్ ఇన్ ప్రాంతంలోకి చేరగానే ఫోన్లకు ఓ అలర్డ్ వస్తుంది. దాన్ని అంగీకరించిన వెంటనే ఫోన్ లోకి బోర్డింగ్ పాస్ వచ్చి చేరుతుంది. ఈ కొత్త స్మార్ట్ చెక్-ఇన్ సేవ ను వినియోగించుకుంటే ప్రయాణం హడావుడితోపాటు ప్రయాణీకులు చెకిన్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.