పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్‌ కష్టమే | OYO revises check-in policy for unmarried couples in Meerut | Sakshi
Sakshi News home page

పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్‌ కష్టమే

Published Mon, Jan 6 2025 5:20 AM | Last Updated on Mon, Jan 6 2025 5:20 AM

OYO revises check-in policy for unmarried couples in Meerut

హోటళ్ల చెక్‌–ఇన్‌ తదితరాలకు నూతన నిబంధనలు 

న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయాణ బుకింగ్స్‌ వ్యాపార సంస్థ ఓయో కొత్తగా తమ భాగస్వామ్య హోటళ్లలో దిగే వినియోగదారులకు నూతన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. తొలుత మీరట్‌ పట్టణంలో మాత్రమే ఈ కొత్త చెక్‌–ఇన్‌ నియమావళిని అమలుచేస్తోంది. పెళ్లికాని జంటలకు హోటల్‌ గది ఇవ్వడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. 

సవరించిన నిబంధనావళి ప్రకారం ఎవరైనా జంట హోటల్‌ గదిని బుక్‌చేయాలనుకుంటే తమ వివాహబంధాన్ని ధృవీకరిస్తూ ఏదైనా గుర్తింపును చూపాల్సి ఉంటుంది. స్థానిక సామాజిక సున్నితాంశాలను పరిగణనలోకి తీసుకుని గదిని ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే విచక్షణాధికారం ఆయా హోటళ్లకు ఉందని ఓయో ఒక ప్రకటనలో పేర్కొంది. 

కొత్త చెక్‌–ఇన్‌ నిబంధనలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని తదనుగుణంగా సవరించిన నియామావళిని దేశవ్యాప్తంగా త్వరలో అమలుచేసే యోచన ఉందని ఓయో పేర్కొంది. ‘‘అత్యంత సురక్షితమైన, భద్రమైన, మెరుగైన హోటల్‌ సేవలు అందించే లక్ష్యంతో కొత్త నిబంధనావళిని తెస్తున్నాం. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇస్తూనే పౌరసమాజాల విజ్ఞప్తులు, వినతులను పరిగణనలోకి తీసుకుని మేం పనిచేయాల్సి ఉంటుంది. 

కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణాలు చేసే పర్యాటకులు, సందర్శకులు, వ్యాపారుల సౌకర్యార్థం కొత్త నియమావళిని తెస్తున్నాం’అని ఓయో నార్త్‌ ఇండియా రీజియన్‌ హెడ్‌ పవాస్‌ శర్మ చెప్పారు. ‘‘మెరుగైన, పటిష్ట నిబంధనల కారణంగా వినియోగదారుల్లో మా పట్ల విశ్వాసం మరింత పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ రోజులు గదులు అద్దెకు తీసుకోవడం, మళ్లీ మళ్లీ బుక్‌ చేయడం వంటివి చేస్తారు’’అని ఆయన అన్నారు.

 అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవడం, వాటిని నిషేధించడం, తమ బ్రాండ్‌ పేరును అనధికారికంగా వాడుకోవడం, దుర్వినియోగం చేయడం వంటి వాటిపై ఓయో సంస్థ.. హోటళ్ల భాగస్వాములు, పోలీసులతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంయుక్తంగా పలు సెమినార్లను నిర్వహించింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement