అల్టిమేటం: ‘ఘాజీపూర్’ ఖాళీ చేయండి
ఘజియాబాద్: ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్న నిరసన కేంద్రం నుంచి వెళ్లిపోవాలని ఘజియాబాద్ అధికారులు రైతులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రిలోగా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అక్కడ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆత్మాహుతి అయినా చేసుకుంటా. కానీ ఇక్కడి నుంచి కదలను. నిరసనను ఆపను’ అని అన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని, కొందరు సాయుధ గూండాలు ఇక్కడికి వచ్చారని ఆందోళన వెలిబుచ్చారు. దాంతో ఘాజీపూర్ యూపీ గేట్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అక్కడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా బలగాలను తరలించింది.వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఘాజీపూర్ సరిహద్దు వద్ద తికాయత్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ నవంబర్ 28 నుంచి నిరసన తెలుపుతోంది. ‘ఖాళీ చేయాలని ఘజియాబాద్ కలెక్టర్ అజయ్ రైతులను ఆదేశించారు’ అని అధికారులు చెప్పారు. ‘శాంతియుత నిరసనలు చట్టబద్దమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా, రైతు నిరసనకారులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. యూపీ ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నిస్తోంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. ఏదేమైనా మా నిరసన కొనసాగిస్తాం’ అని తికాయత్ స్పష్టం చేశారు.
నోటీసులకు భయపడం
ఢిల్లీ పోలీసులు పంపిస్తున్న నోటీసులకు భయపడబోమని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్పష్టం చేశారు. జనవరి 26 నాటి అల్లర్లను కారణంగా చూపి రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడం. వాటికి జవాబిస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరసన కేంద్రాల నుంచి రైతులను వెనక్కు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలైన నేరస్తులపై చర్యలు తీసుకోకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టి, పాల్వాల్ నిరసన కేంద్రం నుంచి రైతులను పంపించివేసేందుకు కుట్ర చేశారు’ అని సంయుక్త కిసాన్ మోర్చా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఘాజీపూర్ సహా నిరసన కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలను నిలిపేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. సింఘు సరిహద్దు వద్ద రైతులు సద్భావన యాత్ర నిర్వహించారు. ట్రాక్టర్లు, బైక్‌లతో దాదాపు 16 కిలో మీటర్లు ఈ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘాల జెండాలకు బదులుగా కేవలం త్రివర్ణ పతాకాలు పట్టుకుని రైతులు ఈ యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, మతాలకు అతీతంగా రైతులంతా ఒక్కటేనన్న భావనను ప్రచారం చేసేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని రైతు నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్పాల్, గుర్నామ్ సింగ్.. తదితరులు తెలిపారు. జాతీయ పతాకాన్ని అవమానించారని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణకు ఇది తమ జవాబని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని తాము గౌరవించినట్లుగా మరెవరూ గౌరవించరని స్పష్టం చేశారు.
సింఘు, టిక్రీ సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతున్న రైతుల సంఖ్య భారీగా తగ్గినట్లు కనిపించింది. అయితే, జనవరి 26 నాటి ట్రాక్టర్ పరేడ్ కోసం వచ్చిన రైతులు వెనక్కు వెళ్లిపోవడం వల్ల అలా కనిపిస్తోందని రైతు నేతలు తెలిపారు. ‘మాలో స్ఫూర్తి దెబ్బతినలేదు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుంది’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి బల్దేవ్ సింగ్ స్పష్టం చేశారు. ఉద్యమం తొలిరోజు నుంచి ఉన్నవారిలో కొందరు వెనక్కు వెళ్లారని, వారి కుటుంబసభ్యుల్లో నుంచి కొందరు త్వరలో ఇక్కడకు వస్తారని తెలిపారు. ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంటుకు పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేశామని రైతు నేతలు వెల్లడించారు. జనవరి 26నాటి అల్లర్లు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రేనని రైతు నేత గుర్జీత్ సింగ్ ఆరోపించారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీగా భద్రతబలగాలు మోహరించాయి. యూపీలోని బాఘ్పట్ నిరసన కేంద్రంలో ఆందోళనలు ముగిశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరం డిసెంబర్ 19 నుంచి ఇక్కడ నిరసనలు సాగుతున్నాయి.
పోలీసులకు అమిత్ షా పరామర్శ
జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు. శుశ్రుత్ ట్రామా సెంటర్, తీరత్ రామ్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవలతో కలిసి హోం మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ అల్లర్లలో సుమారు 400 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.
రైతు నేతలపై లుక్ఔట్ నోటీసులు
గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసుల విచారణకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు 9 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అల్లర్ల వెనుక కుట్ర, నేరపూరిత ప్రణాళిక ఉన్నాయని, పరేడ్ మార్గంపై కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించాలని ముందే నిర్ణయించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రాజేవాల్ సహా 20 మంది రైతు నేతలకు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు గానూ వారిపై చట్టబద్ధ చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లోగా వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, ఢిల్లీ హింసాకాండపై నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న రైతు నేతలపై పోలీసులు ‘లుక్ ఔట్’ నోటీసులు జారీ చేశారు.
ఆ నాయకులు తమ పాస్‌పోర్ట్‌లను కూడా సరెండర్ చేయాల్సి ఉంటుందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజధానిలో జరిగిన హింసాకాండ దేశ పరువు ప్రతిష్టలను దెబ్బతీసిందని భావిస్తున్న పోలీసులు.. ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో బాధ్యులపై దేశద్రోహం ఆరోపణలను కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. వారిపై ఐపీసీలోని 124ఏ(దేశద్రోహం) సెక్షన్ కింద కూడా ఆరోపణలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎర్రకోట ఘటనలపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, మాజీ గ్యాంగ్‌స్టర్ లఖా సిధానియాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ల్లో రాకేశ్ తికాయత్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, గుర్నామ్ చాందునీ, కుల్వంత్ సింగ్ సంధూ, జోగిందర్ సింగ్ ఉగ్రహ, మేథా పాట్కర్ తదితర 37 మంది నాయకుల పేర్లు ఉన్నాయి.
రాజ్యాంగ బద్ధతపై సుప్రీం నోటీస్‌లు
వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. కొత్త సాగు చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించే 14, 15, 21 అధికరణలను ఉల్లంఘిస్తున్నాయని ప్రతాపన్ తన పిటిషన్లో ఆరోపించారు. అందువల్ల ఆ చట్టాలను అక్రమమైనవి, రాజ్యాంగ విరుద్ధమై నవిగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు.
తప్పుడు ప్రచారం: దీప్ సిద్ధూ
ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రైతు నేతలు తనను బాధ్యుడిని చేయడంపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మండిపడ్డారు. ఎర్రకోటపై సిక్కు మత జెండాను ఎగరేసిన ఆందోళనకారుల్లో దీప్ సిద్దూ ఉన్నారు. ఎర్రకోట వైపు వెళ్లాలని యువ రైతులు వారికి వారే నిర్ణయించుకున్నారని వివరించారు. పోలీసులు, రైతు నేతలు అంగీకరించిన మార్గాన్ని చాలా మంది అనుసరించలేదన్నారు. ఢిల్లీ లోపల ట్రాక్టర్ పరేడ్ ఉంటుందని చెప్పి రైతు నేతలు తమను పిలిపించారని అక్కడి వారు తనకు చెప్పారన్నారు. రైతు నేతలు తనను బీజేపీ, ఆరెస్సెస్ వ్యక్తి అని విమర్శించడంపై స్పందిస్తూ.. ‘బీజేపీ వ్యక్తి కానీ, ఆరెస్సెస్ వ్యక్తి కానీ ఎర్రకోటపై సిక్కు మత ‘నిషాన్సాహిబ్’ జెండా ఎగరేస్తాడా?’ అని ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ప్రశ్నించారు. తాను చేరుకునేటప్పటికే ఎర్రకోట గేట్ విరిగిపోయి ఉందన్నారు.