బొత్స వర్సెస్ కిమిడి నాగార్జున
చీపురుపల్లి: ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొననున్నది. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, టీడీపీ అభ్యర్థిగా కిమిడి నాగార్జున పోటీలో నిలవనున్నారు. అనుభవానికి అనుభవలేమికి జరగనున్న పోటీల్లో గెలుపుపై నియోజకవర్గ ప్రజలు చర్చించు కుంటున్నారు. వీరి గుణగణాలను ప్రజలు బేరీజు వేసుకుం టున్నారు.
బొత్స సత్యనారాయణ
బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన కళాశాల చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘ నాయకుడుగా పని చేశారు. ఆ తరువాత కాలంలో గాజులరేగ పీఏసీఎస్ అధ్యక్షుడిగా, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) చైర్మన్గా పని చేశారు. 1998లో బొబ్బిలి ఎంపీగా గెలుపొం ది పార్లమెంటు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కేబినేట్లో రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖా మంత్రిగా, మార్కెటింగ్శాఖా మంత్రిగా, పంచా యతీరాజ్, గృహ నిర్మాణశాఖా మంత్రిగా ఎలా ఎన్నో పదవులు అలరించారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా, రాష్ట్ర రాజకీయాలను శాసిం చే సమర్థత కలిగిన నాయకుడు.
ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో కార్యకర్తలను సైతం పేరు పెట్టి పిలిచే నాయకుడు. అర్థరాత్రి, అపరాత్రి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి ఫోన్ చేస్తే నేరుగా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేసి వారి కష్ట, సుఖాలు విని వాటిని పరిష్కరించే గొప్ప మనిషి. ఆయన పదేళ్ల పదవీ కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలలు, అన్ని గ్రామాలకు రోడ్లు, నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు తాగునీరు, టీటీడీ కల్యాణ మండపం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయాంలోనే జరిగాయి.
కిమిడి నాగార్జున
కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2016 వరకు అమెరికా లో ఉద్యోగం చేశారు. అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి 2016లో చీపురుపల్లి వచ్చారు. అప్పటి నుంచి ఆయన తల్లి, ఎమ్మెల్యే మృణాళినితో కలిసి గ్రామాల్లోకి వెళుతూ పరిచయం చేసుకున్నాడు. రాజకీయంగా ఎలాంటి అనుభవం, పదవులు లేవు. ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి మృణాళిని వారసునిగా తప్ప ఆయనకు ఎలాంటి గుర్తింపు లేదు.