రైల్వే ఉద్యోగం పేరుతో టోకరా
నిరుద్యోగుల గగ్గోలు
ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు
రెండు కోట్లతో పరారీ
పోలీస్‌స్టేషన్‌లో బంధువులు
పెడన : రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా వేసిన ఘటన పెడన మండలంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఉయ్యూరు మండలం ఆనందపురానికి చెందిన బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు పెడన పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పెడన మండలం అచ్చయ్యవారి పాలెం గ్రామానికి చెందిన జన్ను శివరామకృష్ణ ఇటీవల రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిపై చేరాడు. కానీ గ్రామంలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని చెబుతూ వచ్చాడు.
తనకున్న పరిచయాలతో టికెట్ కలెక్టర్ పోస్టు ఇప్పిస్తానని చెబుతూ 20 నుంచి 30 మంది నిరుద్యోగుల వద్ద నుంచి దాదాపు రూ. రెండు కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెడన మండలం జింజేరు గ్రామంలో ఒకరిద్దరితో పాటు ఆర్తమూరు, పురిటిపాడు, పోతేపల్లి, బంటుమిల్లి, పెనుమలూరు, ఉయ్యూరు, పశ్చిమ గొదావరి జిల్లాలో కొంతమంది, హైదారాబాద్‌కు చెందిన మరికొంతమంది నిరుద్యోగులను నమ్మించి .. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం.
అయితే నెలలు గడుస్తున్నా... రైల్వేలో టీసీ ఉద్యోగం రాకపోవడంతో లబోదిబోమంటూ శివ రామకృష్ణ కోసం ఆరాతీయగా ఆయన పరారీలో ఉన్నారని తేలడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులు జన్ను శివరామకృష్ణ స్వగ్రామానికి చేరుకుని ఇంటి వద్దకు వచ్చి ఉద్యోగం కోసం కట్టిన నగదును తిరిగి ఇవ్వాలని కుటుంబసభ్యలను కోరారు.
అయితే వారు వాయిదాల మీద వాయిదాలు వేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాసినంపాడు గ్రామానికి చెందిన బాధితుడు కె. వెంకటేశ్వరారవుకు జూన్ నెలాఖరుకు నగదు ఇస్తామని వాయిదా వేశారు. లేని పక్షంలో పొలం రాసిస్తామని గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు. ఇచ్చిన గడువు పూర్తయినా నగదు ఇవ్వకపోవడంతో బాధితుడు ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు ప్రయత్నించాడు. దీంతో జన్ను శివ రామకృష్ణ కుటుంబీకులు బాధితుడిని కొట్టేందుకు వెళ్లగా ఆయన గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు.
వారం రోజుఅ అనంతరం అతనికివ్వాల్సిన నగదు అందజేశారు. ఇదిలా వుంటే ఉయ్యూరు మండలం ఆనందపురానికి చెందిన నలుగురు బాధితులు శనివారం జింజేరు గ్రామానికి వెళ్లి నగదు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో జన్ను శివ రామకృష్ణ బంధువులు బాధితులను చితకబాది మీ దిక్కున చోట చెప్పుకోమని చెప్పడంతో బాధితులు పెడన పోలీసులను ఆశ్రయించారు. దీనిపై సోమవారం పెడన పోలీసులు జన్ను శివ రామకృష్ణ బంధువులను పిలిచి స్టేషన్లో విచారించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు ఎస్ఐ దుర్గా ప్రసాదు విలేకరులకు తెలిపారు.