హోదా విషయంలో ప్రభుత్వాలు విఫలం
వింజమూరు:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీ, సాధించడంలో టీడీపీ పూర్తిగా విఫలమయ్యాయని మాజీ జెడ్పీ చైర్మన్, ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పి.చెంచలబాబుయాదవ్ విమర్శించారు. స్థానిక ఆర్అండ్బి అతి«థి గృహంలో గురువారం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, టీడీపీ మంత్రుల తీరు చూస్తే ప్రత్యేక హోదా రాదని తేలిపోయిందన్నారు. హోదా సంజీవని కాదని, హోదాతో అన్ని సమస్యలు పరిష్కారం కావని బీజేపీ నేతలు అనడం దారుణమన్నారు. రాష్ట్రంలో 2014 ఎన్నికల ప్రచారంలో 5 చోట్ల బహిరంగ సభల్లో నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఇస్తామని ఓట్లు వేయించుకుని, ప్రస్తుతం 5 కోట్ల ఆంధ్రులను నయవంచనకు గురిచేశారన్నారు. వీరికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ప్రధానమంత్రి దేశంలో మాట తప్పడం 70 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రధమమన్నారు. ఏడు సార్లు జిల్లాకు చంద్రబాబు వచ్చినా ఒరిగిందేమీ లేదన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు ఆర్థిక లబ్ధి చేకూర్చుతున్నాయన్నారు. ఆయన వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి బయ్యపురెడ్డిచెన్నారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోడెందుల వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సుమన్ ఉన్నారు.