Chennai Central
-
శివమొగ్గ – చెన్నై మధ్య బైవీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
గుంతకల్లు: ప్రయాణికుల సౌకర్యార్థం శివమొగ్గ–చెన్నై సెంట్రల్ మధ్య బై వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ రైలు (నం:06223) శివమొగ్గ నుంచి ప్రతి ఆది, మంగళవారాల్లో బయలుదేరుతుంది. ఈ రైలు ఏప్రిల్ 17 నుంచి జూన్ 28వ తేదీ వరకు మాత్రమే రాకపోకలు సాగించనుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో (రైలు నం: 06224) చెన్నై సెంట్రల్ నుంచి సోమ, బుధవారాల్లో బయలుదేరుతుంది. ఈ నెల 18 నుంచి జూన్ 29వ తేదీ వరకు మాత్రమే ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు శివమొగ్గ, భద్రావతి, తరికెరె, బీరూర్, అజాంపురా, హసదుర్గ, చిక్జాజూర్, చిత్రదుర్గ, చెళ్లికెర, మొలకాల్మూరు, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, వైఎస్సార్ కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా అర్కోణం నుంచి చెన్నై సెంట్రల్‌కు చేరుతుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–కొచ్చివేలి ప్రత్యేక రైలు (07115) జూలై 6, 13, 20, 27, ఆగస్టు 3, 10, 17, 24, 31వ తేదీల్లో రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.20కి కొచ్చివేలి చేరుకుంటుంది. కొచ్చివేలి–హైదరాబాద్ రైలు (07116) జూలై 8, 15, 22, 29, ఆగస్టు 5, 12, 19, 26, సెప్టెంబర్ 2వ తేదీల్లో ఉదయం 7.45 గంటలకు కొచ్చివేలిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–ఎర్నాకుళం ప్రత్యేక రైలు (07117) జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో, ఆగస్టు 7, 14, 21, 28వ తేదీల్లో మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. ఎర్నాకుళం–హైదరాబాద్ రైలు (07118) జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30కు ఎర్నాకుళంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.55కు హైదరాబాద్ చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్–సంత్రాగచి రైలు (06058) జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో మధ్యాహ్నం 3.15కు చెన్నైలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 7.00 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది. సంత్రాగచి – చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు (06057) జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1వ తేదీల్లో రాత్రి 11.50కు సంత్రాగచిలో బయల్దేరి రెండో రోజు ఉదయం 5.30కు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. పుదుచ్చేరి –సంత్రాగచి రైలు (06010) జూలై 6, 13, 20, 27వ తేదీల్లో సాయంత్రం 6.45కు పుదుచ్చేరిలో బయలుదేరి రెండో రోజు తెల్లవారుజామున 4.30కు సంత్రాగచి చేరుకుంటుంది. సంత్రాగచి–పుదుచ్చేరి ప్రత్యేక రైలు (06009) జూలై 8, 15, 22, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2.10కు సంత్రాగచిలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 9.45కు పుదుచ్చేరి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయని,ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రప్రసాద్ కోరారు. -
హైదరాబాద్ నుంచి చెన్నైకి రెండు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: భారీ వర్షాలు కురిసి చెన్నైలో వరదలు సంభవించి రద్దయిన రైళ్ల రాకపోకల పునరుద్ధరణ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్‌కు రెండు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నేటి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ బయలుదేరనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రెండో ట్రైన్ సర్వీసు శనివారం రాత్రి 9 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జంక్షన్ నుంచి బయలుదేరనున్నట్లు సమాచారం. -
తమిళదేశంలో తెలుగు గ్యాలరీ
చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు ఎన్‌టిర్ ఏఎన్నార్ శివాజీ గణేశన్... వంటి సినీతారలు; వైఎస్‌రాజశేఖరరెడ్డి, కరుణానిధి, సుర్జీత్ సింగ్ బర్నాలా... వంటి రాజకీయ నేతలు; ఎవిఎం... విజయ వాహినీ వంటి సినీ రంగ సంస్థల సుప్రసిద్ధులు... ఇలా ఎందరినో ఎంతో సాదరంగా ఆహ్వానించి, చెన్నపట్టణంలోని ప్రముఖుల గృహాలను అందంగా తీర్చిదిద్దిన చరిత్ర... నూట పది సంవత్సరాలుగా చెన్నపట్టణంతో మమేకమై ఉన్న యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీది. సుమారు అరవై ఏళ్లుగా తమిళనాడు రాజ్‌భవన్ అలంకరణ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీదే! అక్కడి ఇంటీరియర్, గవర్నరును చూడటానికి వచ్చిన వారికి బహుమతులు వంటివన్నీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ చేతుల మీదుగానే సాగుతాయి. తమిళనాడు మాజీ గవర్నరు సుర్జీత్‌సింగ్ బర్నాలా మంచి చిత్రకారుడు. ఆయన వేసిన బొమ్మలన్నిటికీ ఈ ఆర్ట్ గ్యాలరీ వారే ఫ్రేము చేయాలి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీకరుణానిధి ఈ ఆర్ట్ గ్యాలరీకి సుమారు 60 సంవత్సరాలుగా నిత్య వీక్షకులు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని తంజావూరు విధానంలో గ్లాస్ పెయింట్ చేసిన ఘనత కూడా యతిరాజ్ గ్యాలరీకి ఉంది...ఎక్కడా లేని విధంగా థాయ్‌లాండ్ సీత, కామధేనువు ఎంబాసింగ్ వర్క్, గోల్డ్ ప్లేటెడ్ వెంకటేశ్వర స్వామి ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేకం. వరలక్ష్మి అమ్మవారు, వెన్న కృష్ణుడు, శివుడు, ఆండాళ్... చిత్రాలన్నీ వంద సంవత్సరాలుగా ఈ ఆర్ట్ గ్యాలరీని మ్యూజియంగా మార్చాయి. ఎన్నో ఆటుపోట్లు మరెన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ కూడా కళా సేవ చేయడం మానలేదు ఈ ఆర్ట్ గ్యాలరీ. తంజావూరు కళాచిత్రాలతో పాటు ఇతర ఇంటీరియర్ వస్తువులను కూడా తయారుచేయడం ప్రారంభించి, నవ్యతను ఆకళింపు చేసుకుంటోంది యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ. తంజావూరు పెయింటింగులు ఓల్డ్ మద్రాసు, ఓల్డ్ కలకత్తా, ఓల్డ్ ఢిల్లీ ఫొటోలు, పెయింటింగ్‌లు కావాలంటే యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీని సందర్శించవలసిందే. చెన్నైలోని వారినే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రముఖులనూ ఆకర్షిస్తున్న సంస్థ ఇది. పల్లెల్లో దేవాలయాలకు ఇక్కడి నుండే తంజావూరు పెయింటింగ్‌లను విరివిగా తీసుకువెతుంటారు. ఎక్కడో ఒంగోలు నుంచి చెన్నపట్టణం వచ్చి, తెలుగువారి కీర్తి బావుటాను విదేశాల వరకు రెపరెపలాడించింది లక్ష్మీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ. తంజావూరును ఆంధ్రనాయక రాజులు పరిపాలించారు. నేటికీ అక్కడ తెలుగు వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. చిత్రలేఖనంలో తంజావూరు శైలి విలక్షణం. ఎంతో శ్రమకోర్చి ఈ బొమ్మలను తయారుచేయడం ఒక ఎత్తయితే, వాటికి అందమైన, విలక్షణమైన ఫ్రేములు అమర్చడం మరో ఎత్తు. బంగారు రేకులతో తయారయ్యే ఈ తంజావూరు చిత్రాలు ఇంటికి అందాన్ని, దైవత్వాన్ని తీసుకువస్తాయి. ఇంతకీ ఈ ఆర్ట్‌గ్యాలరీని ఎవరు నెలకొల్పారంటారా... అక్కడికే వెళ్దాం.. ఒంగోలు నుంచి మద్రాసుకు... రామానుజకూటం యతిరాజయ్య ఓ వ్యాపారవేత్త. మంచి వ్యాపారం చేసి ధనం సంపాదించాలనే ఉద్దేశంతో ఒంగోలు నుంచి సుమారు 1890 ప్రాంతంలో మద్రాసు ప్రెసిడెన్సీకి కుటుంబంతో తరలి వచ్చారు. కొంతకాలం ఏదో ఒక పనిచేశారు. కాని ఆయనకు చేస్తున్న పని మీద తృప్తి కలగలేదు. ఇంకా ఏదో చేయాలని తపన నానాటికీ పెరుగుతూ వచ్చింది. 1905 నాటికి ఆయన లక్ష్యసాధన కార్యరూపం దాల్చింది. తను అనుకున్న వ్యాపారం ప్రారంభించారు. ప్లైవుడ్, గ్లాస్, ఫొటో ఫ్రేమ్స్... వంటి వస్తువులతో ‘యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’ అని సంస్థను మద్రాసు ప్యారిస్ కార్నర్లో దేవరాజ్ముదలి వీధిలో ప్రారంభించారు. సుమారు లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభమైన వ్యాపారం, మొదట్లో కొంత నిరాశ నే మిగిల్చింది. ఆయన ఎంత పట్టుదలతో ప్రారంభించారో అంతే పట్టుదలతో వ్యాపారాన్ని వృద్ధిచేశారు. చీమలాగ నిరంతరం కృషి చేశారు. గ్లాస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం కూడా ప్రారంభించారు. చీమలాగే ధనం కూడబెట్టారు. కేవలం చెక్కలు, గ్లాస్ వంటి వాటితో ప్రారంభమైన ఈ గ్యాలరీ తంజావూరు పెయింటింగ్‌ల వంటి ఇంటీరియర్స్‌ను తయారుచేసి అమ్మడం ప్రారంభించారు. బంగారు రేకులతో తయారయ్యే ఈ కళాకృతులను చూసిన సినీవర్గీయులు, అవి తమ ఇళ్లల్లో ఉంటే ఇంటికి అందమే కాకుండా పవిత్రత కూడా వస్తుందని భావించి వాటిని కొనుగోలు చేసి కుడ్యాలకు అలంకరించారు. అలా ఈ వ్యాపారాన్ని సినీరంగ ప్రముఖులంతా ప్రోత్సహించారు. విదేశాలలో ఉన్న మిత్రులకు భారతీయ సంస్కృతి గురించి తెలియచేయడానికి చిహ్నంగా తంజావూరు చిత్రాలను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. తొలిసారి... బెల్జియం గ్లాస్... ఎ.వి.ఎం. విజయవాహినీ వారు... తమ స్టూడియోలకు కావలసిన ఇంటీరియర్ డెకొరేషన్ అంతా యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీలోనే కొన్నారు. ఈ అలంకరణతో వారి స్టూడియోలు అందాల బృందావనాలయ్యాయి. ఎన్టిఆర్, ఎంజిఆర్, ఏఎన్నార్, శివాజీగణేశన్... వంటి చలనచిత్ర కథానాయకులు ఈ గ్యాలరీకి నిత్య సందర్శకులు. వారివారి ఇళ్లను యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ వారి అలంకరణతో తీర్చిదిద్దుకున్నారు. బెల్జియం గ్లాస్‌ను మొట్టమొదటగా దిగుమతి చేసుకున్న ఘనత వీరిదే. రామానుజకూటం యతిరాజయ్యకు ముగ్గురు సంతానం. మూడవ తరంలో పదిహేను మంది, నాలుగవ తరంలో సుమారు 30 మంది. ఈ నాలుగవ తరంలోని వారే అమ్మాయి లక్ష్మి, అల్లుడు సుబ్బారావు. వీరు తమ ముత్తాత గారు ప్రారంభించిన ‘యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’ని ‘లక్ష్మీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’గా టి.నగర్లో ప్రారంభించి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లారు. మూడు లక్షల టర్నోవర్‌తో ఉన్నప్పుడు వ్యాపార వారసత్వాన్ని స్వీకరించి 50 లక్షల టర్నోవర్‌గా పెంచారు. - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై ఇన్పుట్స్: సుకేల సుబ్బారావు, లక్ష్మి (నాలుగవ తరం వారు) వై.ఎస్. ప్రమాణ స్వీకారానికి కూడా... దివంగత నందమూరి తారకరామారావు భార్య బసవతారకమ్మ గతించినప్పుడు ఆమెను చిరస్మరణీయంగా తన కన్నులెదుట నిలుపుకునేందుకు వీలుగా ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుగా ఉండే చిత్రపటాన్ని వీరి చేత చేయించుకున్నారు. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో, ఆయన కుర్చీలో కూర్చుని ఉన్న ఫొటోను అందచేసే అవకాశం యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీనే వరించింది. తమిళులు, ఉత్తరాదివారు, ఎన్నారైలు... అందరూ ఈ ఆర్ట్ గ్యాలరీ కస్టమర్లే. ప్రస్తుతం అందరూ పూజగదిలో తంజావూరు చిత్రాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో, ఈ చిత్రాలు స్థిరంగా నిలబడుతున్నాయి. -
రాణీ రాణమ్మా! ఆనాటి గురుతులు ఇవేనమ్మా!
చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు తెనాలిలో జన్మించారు... చెన్నపట్నం చేరుకున్నారు... ఆటుపోట్లతో నిండిన జీవితాన్ని గడిపారు. కట్టుబాట్లను ఎదుర్కొన్నారు. మూడు పదులు నిండకముందే నూరేళ్ల కష్టాలు ఎదుర్కొన్నారు... రాణి బుక్ సెంటర్ స్థాపించి... చెన్నైలోనిశివజ్ఞానం రోడ్ నుంచి పానగల్పార్కు మధ్యనున్న పాండీబజార్ రోడ్లను వాణిజ్య కేంద్రాలుగా మార్చారు... తెలుగు వారికి చేరువయ్యారు... తెలుగు సాిహ తీప్రముఖులకు కేంద్రబిందువు అయ్యారు... ఆమె త్రిపురనేని రామస్వామి, అన్నపూర్ణదేవిల కుమార్తె... పేరు చౌదరాణి త్రిపురనేని రామస్వామి కుమార్తె త్రిపురనేని గోపీచంద్ చెల్లెలు అయిన చౌదరాణి ఎనిమిదో యేటే తండ్రి గతించారు. నేవల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అట్లూరి పిచ్చేశ్వరరావును వివాహం చేసుకున్నారు. ‘రాయల్ ఇండియన్ నేవీ’ తిరుగుబాటు జరిగిన సందర్భంలో తనున్న నౌకమీద తిరుగుబాటుని ముందుండి నడిపించారు. అది ఆంగ్లేయుల పాలనని ప్రతిఘటించడం. అయితే ఉన్నట్టుండి పిచ్చేశ్వరరావు గుండెపోటుతో మరణించారు. అంతే! ఆమెకు కళ్లముందు అంధకారం దట్టంగా అలముకుంది. చౌదరాణి ఒంటరివారయ్యారు. పదిసంవత్సరాలు కూడా నిండని ఏకైక కుమారుడు. బతుకుపోరాటం చేయాల్సిన పరిస్థితి. తండ్రి దగ్గర నుంచి వచ్చిన విప్లవభావాలు, భర్త నుంచి నేర్చుకున్న స్వేచ్ఛాయుత జీవనం, ఇవన్నీ ఆమెను భావోద్వేగాలకు దూరం చేశాయి. ఆమె వంటింటికి పరిమితమై మరో వంటమనిషి కాకూడదని నిశ్చయించుకున్నారు. ఆ రోజుల్లో భర్తను పోగొట్టుకున్న వారంతా వంటగదికి పరిమితమైపోయేవారు. ఆమె మాత్రం ధైర్యంగా ముందడుగు వేయడానికి నిశ్చయించుకున్నారు. భర్త గతించేనాటికి ఆమె చేతిలో దమ్మిడీ లేదు. కాని కొత్త జీవితం ప్రారంభించాలి. అందుకు ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించారు. ఆవిడలోని ఆ స్వేచ్ఛాయుత ఆలోచనను పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. అయినా ఆమె దృఢసంకల్పంతో ముందడుగు వేశారు. ఒక యువతి, అందునా వితంతువు... ఇంటిపట్టున ఉండక, బయటకు వచ్చి తన హక్కులకోసం పోరాడటాన్ని పెద్దలు భరించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. ఆమె ప్రాణానికి ముప్పు ఏర్పడే వరకు వెళ్లింది. ఒకానొక పరిస్థితుల్లో చౌదరాణి లెసైన్స్డ్ రివాల్వర్‌కి అర్జీ పెట్టుకోవలసి వచ్చిందంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఇక యువ వితంతువు... 30 సంవత్సరాల వయసు... అది 1960ల నాటి కాలం... అన్ని ఆటంకాలను ఎంతో ఓర్పుతో, ధైర్యంతో ఎదుర్కొని ఒక్కో అడుగు ముందుకు వేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆమె కొన్ని మాస పత్రికలకు, దినపత్రికలకు కరస్పాండెంట్‌గా పనిచేశారు. వాటిలో కొన్ని విశాలాంధ్ర, శ్రీమతి, జయశ్రీ వగైరా. కోయంబత్తూరు వెళ్లి అక్కడి అంశాలపై కథనాలు అందించిన తొలి తెలుగు జర్నలిస్టు ఈవిడే అయి ఉండవచ్చు. అంతేకాక, అక్కడి పరిశ్రమల నుంచి ప్రకటనలను కూడా ఆమె సేకరించి చరిత్ర సృష్టించారు. పాండీబజార్ (సర్ త్యాగరాయ రోడ్)లో పాత ఇంటి నెంబరు 88లో పెనుగొండ నారాయణ చెట్టికి ఒక భవంతి ఉండేది. ఆయన ఎంతో ఉదారుడు. చౌదరాణికి దుకాణం కట్టించి అతి తక్కువ అద్దెకు ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. అయితే మద్రాసు కార్పొరేషన్ ఇంకా ఇతర విభాగాల నుంచి పర్మిషన్లు తెచ్చుకునే బాధ్యతను ఆవిడకు వదిలేశారు. ఆవిడ ఈ విషయాన్ని సవాలుగా తీసుకున్నారు. ఒక స్త్రీ ఇలా ముందుకు రావడాన్ని పురుష సమాజం అంగీకరించలేకపోయింది. ఆ విషయాన్ని విడిచిపెట్టేద్దాం. వ్యాపారం నడపడం? ఆ భూమి తాలూకు ఆసామికి బెదిరింపులు రావడం ప్రారంభమైంది. ఆయన ఆడిన మాట తప్పలేదు. షాపు నిర్మించి, చౌదరాణి చేతికి అందించారు. జీవితంలో పోరాటాలు అలవాటుపడిన ఆమె తను అనుకున్న లక్ష్యం చేరారు. తెలుగు పుస్తకాల షాపు ప్రారంభించారు. ఆమె సన్నిహితులంతా షాపుకి ఆమె పేరునే పెట్టుకోమని సూచించడంతో ‘రాణి బుక్ సెంటర్’ అని పేరు పెట్టారు. ‘‘ఓపెనింగ్ షార్ట్లీ’’ అనే బ్యానర్ తగిలించారు. ఆ బ్యానర్‌ని రాత్రికి రాత్రే కొందరు ఉన్మాదులు తొలగించేశారు. తెలుగు పుస్తక ప్రచురణారంగంలో విప్లవం తీసుకువచ్చిన కీ.శే.ఎం.ఎన్‌రావు అనే పెద్దమనిషి ఎంతో ఉదారంగా తన దగ్గర ఉన్న పుస్తకాలను అప్పు మీద ఆ దుకాణంలో అమ్మకానికి ఉంచారు. న్యూ సెంచరీ బుక్‌హౌస్‌కి చెందిన రాధాకృష్ణన్, ఇంకా ‘మక్కా ఆఫ్ తెలుగు పబ్లిషింగ్’గా ప్రసిద్ధి చెందిన విజయవాడలోని ఇతర ప్రచురణ సంస్థలు కూడా అభిమానంతో ముందుకు వచ్చాయి. సరిగ్గా ఆమె భర్తను కోల్పోయిన మూడు సంవత్సరాల తరవాత 1969, డిసెంబరు 8వ తారీకున షాపు ప్రారంభమైంది. నగరంలోని తెలుగు ప్రముఖులంతా అక్కడకు రావడం ప్రారంభమైంది. కొందరు ఆమెను కలిసి అభినందనలు తెలియచేస్తూనే, పక్కకు వచ్చి ‘త్వరలోనే మూత పడిపోతుంది’ అనడం పరిపాటి అయిపోయింది. మొత్తానికి శివజ్ఞానం వీధి మూల నుండి పానగల్ పార్కు మధ్యనున్న పాండీ బజార్లో ఉన్న ఆవాసాలు వాణిజ్యకేంద్రాలుగా మారిపోయాయి. అక్కడివారందరూ ఆమెను ఎంతో గౌరవాభిమానాలతో రాణమ్మ అని పిలుచుకునేవారు. చౌదరాణి తెలుగులో ‘శాంతినివాసం’ వంటి మేటి కథలను, ‘అగ్నిపూలు’, నిశ్శబ్ద తరంగాలు’ వంటి నవలలను రచించారు. హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి తర్జుమా చేశారు. ఆకాశవాణిలో కథలు చదివారు. నవలలు రచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు సకాలంలో ప్రచురించి తమిళనాడులో ఉన్న తెలుగువారికి అందజేయలేక పోయినప్పుడు చౌదరాణి లాభాలు ఆశించకుండా అందించారు. ప్రభుత్వ ఉదాసీనవైఖరితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయారు. ఆ కాలంలో జీవించిన తెలుగు ప్రముఖులందరూ అక్కడ గౌరవం అందుకున్నవారే. చిత్రనిర్మాత కాట్రగడ్డ మురారి తన పుస్తకం ‘నవ్వి పోదురు గాక’ లో ‘‘ఆవిడ నన్ను ఉత్తమ సాహిత్యం వైపు నడిపించారు. ఆమెను సోదరి సమానురాలుగా భావిస్తున్నాను’’ అని చెప్పుకున్నారు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం పుస్తకాల మీద పన్ను విధించినప్పుడు, చౌదరాణి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు వార్త అందించడం వల్ల అందులో ఎడిటోరియల్ కూడా వచ్చింది. 1996లో చౌదరాణి కన్ను మూశారు. చెన్నైలో అడుగుపెట్టిన తెలుగువారికి చౌదరాణి అంటే తెలుగు సాహిత్యకుటుంబానికి ఆడపడచు అనే ముద్ర పడిపోయింది. - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై ఇన్పుట్స్: అనిల్ అట్లూరి (చౌదరాణి ఏకైక కుమారుడు) జవహర్లాల్ నెహ్రూ తరవాత, చౌదరాణి కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు పోస్టేజ్ స్టాంప్ ఆతిథ్యం లభించింది. ఒకటి- కవిరాజు త్రిపురనేని రామస్వామి, రెండు- త్రిపురనేని గోపీచంద్. -
తెలుగువారి కీర్తిపతాక... పానగల్...
చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు ఆ పార్క్ పేరు చెప్పడమంటే తెలుగు సినీపరిశ్రమ గురించి చెప్పడమే. తెలుగు ప్రముఖులకు అదొక సమావేశ వేదిక. సాహితీ చర్చలకు ఆలయం. ఎందరికో నీడనిచ్చి, సేదతీర్చిన చలువరాతి మేడ. ఎందరినో సంపన్నులను చేసిన అపర లక్ష్మీదేవి. ఎందరో ఆర్టిస్టులకు అన్నపూర్ణ నిలయం ఆ పార్కు. ఎందరినో తన చల్లని ఒడిలో సేదతీర్చిన అచ్చ తెలుగు అమ్మ. మద్రాసు చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన వారంతా పానగల్ పార్కులో అడుగుపెట్టి, ఆ చెట్టుతల్లుల ఆశీర్వాదాలందుకుని అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఆరుద్ర, శ్రీశ్రీ, ఆత్రేయ... ఒకరేమిటి సాహితీ ఉద్దండులందరికీ అదే చర్చా వేదిక. అదే సమావేశ మందిరం. ఆ పార్కు వల్ల ప్రముఖులయ్యారా, ప్రముఖుల వల్ల ఆ పార్కు ప్రముఖం అయ్యిందా... అంటే ‘గుడ్డు ముందా! కోడి ముందా!’ అన్న చందాన ఉంటుంది. పానగ ల్ పార్కులోని చిగురాకు మొదలు చిటారుకొమ్మల వరకు ఒకే మాట పలుకుతాయి.. ‘చలనచిత్ర పరిశ్రమకు గురుకులం వంటి వారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు’ అని. పానగల్ పార్కులో రామకృష్ణశాస్త్రిగారి బెంచికి దక్కిన గౌరవం మరెవరికీ లేదు. పార్కుకి ఏ కొత్త సందర్శకులు వచ్చినా ముందుగా ప్రశ్నించే మాట, ‘‘మల్లాది వారి బెంచీ ఎక్కడ’’ అని. ఎందుకంటే మల్లాది వారికి పానగల్ పార్కే తల్లి, తండ్రి, దైవం. మల్లాదివారు నిత్య సందర్శకులు. ఆయనకు ఆసనం ఇచ్చి, ఆయనను గౌరవించి, తనను తాను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేసుకుంది పానగల్ పార్కు. ఒక్కరోజు ఆయన కనిపించకపోయినా అక్కడి చెట్లన్నీ దిగాలుపడి పోయేవి. ఆకులు రాలుస్తూ కన్నీరు విడిచేవి. చలనచిత్రాలలో చేరాలనుకునే ఎందరో ఔత్సాహికులకు ఈ పార్కే వరాలిచ్చే దేవాలయం అయ్యింది. ప్రతి సినీ ప్రముఖులు, సాహితీవేత్తలు పానగల్ పార్కుకి నిత్య అతిథులే. మూడు పైసలతో టీ తాగి మూడు పైసలు గేటు దగ్గర ఉండే వ్యక్తికి ఇచ్చి కాళ్లు కడుపులో ముడుచుకుని నిద్రించినవారు ఎందరో! బెంచి మీద నుంచి బెంజి కారు వరకు ఎదిగిన ఎందరో నటులకు పానగల్ పార్కు ప్రత్యక్షసాక్షి. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు ఎందరో మహానుభావుల పాదస్పర్శతో పులకాంకితం అయ్యింది. మల్లాదివారు ‘భువనవిజయం’ అని ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి, కొత్త సినీ రచయితలతో చర్చలు నిర్వహించి, సినిమాలకు మంచి స్క్రిప్ట్ రాయాలంటే ఆంగ్లనవలలు చదవాలని సూచించిన శిక్షణాలయం పానగల్ పార్కు. పానగల్ పార్క్ బయట పేవ్మెంట్ బెంచీల మీద సైతం సాహిత్య సమాలోచనలు, సాహిత్యసభలు రసికులైన వారి మధ్యనిత్యం జరుగుతుండేది. మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల, ఆత్రేయ, పాలగుమ్మి, గోవిందరాజుల సుబ్బారావు, ఎంఎస్. చలపతి, వేదాంతం రాఘవయ్య, వెంపటి చినసత్యం... వీరంతా సాయంత్రమయ్యేసరికి కొలువు తీరేవారు. రాత్రి ఏడు గంటలకు పన్యాల రంగనాథరావు గొంతులో కార్పొరేషన్ లౌడ్స్పీకర్లలో ప్రసారమయ్యే వార్తలు విని 7.15 నిమిషాలకు ‘ఇక చాలు ఇళ్లకు వెళ్లిపోదామా’ అని పార్కుని విడిచి ఇళ్లకు బయలుదేరేవారు. చలనచిత్రాలలో ఎన్నో పాటలకు ఈ పార్క్ చెట్లే అందం తీసుకువచ్చాయి. చలనచిత్ర ప్రముఖులంతా పానగల్ పార్క్ చెట్ల కింద నిద్ర చేసినవారే. సాహితీ ప్రముఖులు, నటులే కాకుండా మదరాసులోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కూడా దేశంలో ఏ సమాచారం జరుగుతోందో తెలియచెప్పింది పానగల్ పార్కే. దీనిపక్కనే ‘లండన్ మార్కెట్’ అని ముద్దుగా పిలువబడే మార్కెట్లో కూరగాయలు కొనడానికి వస్తుండేవారు. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు, అక్కడ ఉన్న సుమారు యాభై దుకాణాలలో రకరకాల స్వదేశీ విదేశీ కూరలు అమ్ముతుండేవారు. వచ్చినవారు వాటిని కొంటూనే, వార్తలు కూడా తెలుసుకుని ఇళ్లకు వెళ్లేవారు. పానగల్ పార్కులో ఎన్నో సంగీత సాహిత్య చర్చలు జరిగేవి. ముఖ్యంగా పింగళివారు ఎన్నో విషయాలు అందరితో ముచ్చటించేవారు. మద్రాసులో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నాగయ్య గడిపినది ఈ పార్కులోనే. ఆయన గౌరవార్థం ఆయన శిలావిగ్రహాన్ని పానగల్ పార్కులో ఒక మూల ఉంచారు. పానగల్‌పార్క్‌లో ప్రస్తుతం నాగయ్య గారి విగ్రహం ఓ మూల దుమ్ము కొట్టుకుని పోయి దీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత శుష్కించినా తల్లి తల్లే అవుతుంది. నాటి ఠీవి, నాటి ఆదరణ, నాటి గౌరవం, నాటి దర్జా దర్పం నేడు పానగల్పార్కుకి పూర్తిగా లోపించినా, సుమారు పాతిక సంవత్సరాల అనంతరం చెన్నై నగరాన్ని దర్శించుకున్నవారు ఒకసారి ఆ పార్కులోకి అడుగుపెడితే గతం తాలూకు మధురస్మృతులు ఎద వీణలను ఒకసారి సుతారంగా మీటుతాయి. - ఫోటోలు, కథనం: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై తెలుగు వారి కోసం తెలుగు జమీందారు అయిన పానగల్రాజు వెంకటరాయనింగారుఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో కట్టించినదే ఈ పార్కు. శ్రీరాజా సర్ పానగంటి రామరాయనింగారు, పానగల్ సంస్థానానికి జమీందారు. కాళహస్తిలో జన్మించిన ఈయన పేదల వకీలుగా, అణగారిన వర్గాలను ఉద్ధరించే వ్యక్తిగా నిలిచారు. 1921 నుంచి 1926 వరకు ముఖ్యమంత్రిగా మద్రాసు ప్రావిన్సీకి పనిచేసి, ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యపరంగా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఆయన పేరు మీద ఆయన గౌరవార్థం ఈ పార్కుకి ‘పానగల్ పార్కు’ అని పేరు పెట్టారు. గణేశ్ అయ్యర్ డిజైన్ చేసిన ఈ పార్కు చెన్నై నగరానికే శోభాయమానం. (ఇన్పుట్స్: భువనచంద్ర, సినీ గేయ రచయిత) -
చెన్నై మ్యూజిక్ అకాడమీలో తెలుగు వేణువు
చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు మ్యూజిక్ అకాడమీ... సంగీత కళాకారులకు అత్యున్నత వేదిక... ఇంచుమించుగా భారతరత్నతో సమానమైన ‘సంగీతకళానిధి’ తో గౌరవ సత్కారం అందించే అకాడమీ... బాలమురళి, పినాకపాణి, నేదునూరి వంటి తెలుగు వారు ఆ గౌరవాన్ని దక్కించుకున్నది ఈ వేదికపైనే! ఎంతో ఘనచరిత్ర గల చెన్నై మ్యూజిక్ అకాడమీకి కార్యదర్శిగా ఎంపికైన మొట్టమొదటి తెలుగు తేజం పప్పు వేణుగోపాలరావు. బాల్యంలోనే ‘సరస వినోదిని’ సమస్యలను ఛందోబద్ధంగా పూరించిన మేధావి... సంస్కృతాన్ని గుండెలకు హత్తుకున్నారు... అవధానాలెన్నో చేశారు... మ్యూజిక్ అకాడమీకి పప్పు వేణుగోపాలరావు చేసిన, చేస్తున్న సేవ గురించి... బొబ్బిలిలో జన్మించిన పప్పు వేణుగోపాలరావు విజయనగరంలో తన స్నేహితులందరితోపాటు సంగీత కళాశాలకు వెళ్లి సంగీతం నేర్చుకున్నారు. సంగీత కుటుంబాలతో పరిచయం పెంచుకున్నారు. కర్ణాటక సంగీత రాజధాని అయిన చెన్నై వచ్చేసరికి సంగీతానికి బాగా నిప్పు అంటుకుంది. అపారమైన అభిమానం. ఇలా సంగీత సాహిత్య సమలంకృతులయ్యారు. తమిళనాడులో ఎంబాయర్ విజయరాఘవాచార్య అని పెద్ద హరికథకుడు. చాలా అరుదుగా మాత్రమే లభించే ‘సంగీత కళానిధి’ బిరుదు అందుకున్న మహోన్నతులు. బిరుదు ప్రదాన సమయంలో ఆంధ్రదేశంలో హరికథ గురించి మాట్లాడమని పప్పువారిని అభ్యర్థించారు. ఇంకేముంది... విజయనగర వాస్తవ్యులయిన పప్పువారు అదే విజయనగరం వాస్తవ్యులైన శ్రీమదజ్జాడ ఆదిభొట్ల నారాయణదాసు గారి గురించి అనర్గళంగా ఉపన్యసించారు. భాష మీద పూర్తి నియంత్రణ ఉన్న వేణుగోపాలరావు ఉపన్యాసాన్ని మ్యూజిక్ అకాడమీ ప్రేక్షకులు కన్నార్పకుండా, చెవులు రిక్కించి మరీ విన్నారు. ‘బెస్ట్ డెమాన్‌స్ట్రేషన్’ బహుమతి ఇచ్చారు. అలా మొత్తం ఏడు సంవత్సరాలు బెస్ట్ డెమాన్‌స్ట్రేషన్ అందుకున్నారు పప్పువారు. ప్రతి సంవత్సరం ఆయనకే బహుమతులు వస్తూండటంతో, ఆయనకు అడ్డుకట్ట వేయాలనుకున్నారు అక్కడివారు. శాస్త్రం తెలిసిన వాళ్లను తీసుకునే ఎక్స్పర్ట్స్ కమిటీ లైఫ్ మెంబర్‌గా కూర్చోబెట్టారు. ఉద్యోగ విరమణ అయ్యాక, ‘మ్యూజిక్ అకాడమీకి సెక్రటరీ పదవిని అలంకరించమన్నారు. ఏకగ్రీవమైతేనే అంగీకరిస్తాన’ న్నారు పప్పువారు. ఆమోదించారు కమిటీవారు. 2008లో మొదటిసారి ఒక తెలుగు వ్యక్తి మ్యూజిక్ అకాడమీ కార్యదర్శి అయ్యారు. ‘విద్వత్సభై’ గా పిలవబడే మ్యూజిక్ అకాడమీలో అనేక మార్పులు చేశారు. ‘అడ్వాన్స్ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్’ ను ప్రారంభించి, సంగీతంలో అపారమైన పాండిత్యం, త్రిమూర్తుల కీర్తనలు పాడగలిగిన ఏడెనిమిది మందికి ఇందులో చేరే అర్హత కల్పించారు. ఇది ఇది పూర్తిగా ఉచితం. సంగీత కళానిధుల చేత వీరికి సంగీతపాఠాలు నేర్పించి, వాళ్లను పండితులుగా తీర్చిదిద్దడంలో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ వచ్చి, విప్రోలో ఉద్యోగం వదులుకున్నవారు కూడా ఇందులో చేరడానికి ఆసక్తి కనపరిచేంత అద్భుతంగా రూపొందించారు. మ్యూజిక్ అకాడమీకి మంచి గ్రంథాలయం ఉంది. అయితే ఇంతవరకు ఒక క్యాటలాగు లేకపోవడం ఆశ్చర్యం. ఏ పుస్తకం ఎవరు పట్టికెళ్లిపోతున్నారో తెలియని పరిస్థితి. గ్రంథాలయాన్ని డిజిటలైజ్ చేసి, పాతబడిపోయిన పుస్తకాలను లామినేట్ చేసి, పుస్తకాలను బయటకు ఇవ్వకుండా, అక్కడ మాత్రమే కూర్చుని చదువుకునేలా నిబంధన విధించారు. గ్రంథాలయ భవనాన్ని పునరుద్ధరించారు. వేణుగోపాలరావు స్నేహితుడు ఆర్.టి.చారి దగ్గర 6,000 గంటల కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు ఉన్నాయి. ఆయన వాటిని సరైన సంస్థకు అందచేయాలనుకున్నారు. 30 లక్షలు ఖర్చుపెట్టి ఆర్కైవ్స్ పెట్టారు. అకాడమీలో ఉన్నవాటితో కలిపి మొత్తం 10,000 గంటల కచ్చేరీలు తయారయ్యాయి. వాటికి సాఫ్ట్వేర్ తయారుచేయించి, ఎవరు కోరుకునే కీర్తన వారు వినేలా తయారుచేశారు. చాలా సంవత్సరాలుగా మ్యూజిక్ అకాడమీలో ఆగిపోయిన ప్రచురణలను పునరుద్ధరించి, ఏ ఏడాది జర్నల్ ఆ ఏడాది వచ్చేలా ప్రారంభించారు. కర్ణాటక సంగీతంలో నొటేషన్‌లో వచ్చిన మొట్టమొదటి పుస్తకం సుబ్బరామదీక్షితులు ‘సంగీత సంప్రదాయ ప్రదర్శిని’ 1200 పుటల ఈ గ్రంథాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ఇంగ్లీషులో ప్రచురణ ప్రారంభించారు. ఇప్పటికి ఐదువాల్యూమ్స్ ఆయన సంపాదకత్వంలో పూర్తయ్యాయి. ఇవేకాకుండా ఆయన సంపాదకత్వంలో అపురూపమైన 15 పుస్తకాలు వచ్చాయి. డిసెంబర్ సీజన్లో ఉదయం ఎనిమిది గంటలకు నిర్వహించే లెక్చర్ డిమాన్స్ట్రేషన్లలో, సంగీతంలో ఒకే లాంటి రాగాల గురించి టెక్నికల్ విషయాల గురించి ప్రస్తావిస్తారు. కచేరీలకు ఎంతమంది హాజరవుతారో, వీటికి కూడా అంతమంది వచ్చేలా చేసిన ఘనత పప్పువారిది. ఇక్కడకు వచ్చే జనం పెరిగారు. లెక్చర్ ఇచ్చినవాళ్లు మాత్రమే వినే స్థాయి నుంచి పెద్ద హాల్లోకి మార్చండన్న డిమాండ్ వచ్చే స్థాయికి తీసుకువెళ్లారు. కర్ణాటక సంగీత రాజధాని చెన్నై. ఎంతో ఘనత ఉన్న చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో రిసెర్స్ సెంటర్ ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నారు వేణుగోపాలరావు. మ్యూజిక్ అకాడమీలో ఈ సెంటర్ ప్రారంభిస్తే టుంకూరు (బెంగళూరు దగ్గర ) యూనివర్సిటీ వారు అఫిలియేషన్ ఇస్తామన్నారు. దీనికి డెరైక్టర్ కూడా పప్పు వారే. మ్యూజిక్ అకాడమీ అంటే మైలాపూర్ కాదు. ఇదొక ప్రపంచం. పాశ్చాత్యం, జానపదం, హిందూస్తానీ... అన్నిటి మీద విశ్లేషకుల చేత మాట్లాడించారు. అకాడమీ కాదు అకడమిక్ సెంటర్ అనిపించారు అచ్చ తెలుగు తేజం పప్పు వేణుగోపాలరావు. - డాక్టర్ పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
ఉగ్రవాదుల టార్గెట్ సీమాంధ్ర ?
ముమ్మరంగా ‘చెన్నై సెంట్రల్’ బాంబుపేలుడు కేసు తమిళనాడు ఏడీజీపీ నేతృత్వంలో దర్యాప్తు బెంగళూరు చేరుకున్న ప్రత్యేక బృందం అనుమానితుల భావచిత్రాలు సేకరణ బెంగళూరు, న్యూస్‌లైన్: ‘చెన్నై సెంట్రల్’ బాంబు పేలుడు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సీమాంధ్ర లక్ష్యంగా బాంబులు అమర్చి ఉంటారని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. బెంగళూరు నుంచి చెన్నై, విజయవాడ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు గువాహటి చేరుకోవాల్సి ఉంది. అయితే రైలు గంటకు పైగా ఆలస్యంగా నడుస్తుండటంతో చెన్నై సెంట్రల్ స్టేషన్లో బాంబులు పేలాయని అధికారులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా తమిళనాడు సీబీ సీఐడీ ఏడీజీపీ కరణ్ సింగ్ శుక్రవారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. శనివారం ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. కొందరి అనుమానితుల భావ చిత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురిని విచారణ చేశారు. బుధవారం రాత్రి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లోనే గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబులు అమర్చి ఉంటారని తమిళనాడు పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటక రైల్వే పోలీసు విభాగం డీఐజీ శ్రీకంఠప్ప, బెంగళూరు సిటీ రైల్వే ఎస్పీ సిద్దరావ ుప్ప తమిళనాడు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.