చెన్నై మ్యూజిక్ అకాడమీలో తెలుగు వేణువు | Chennai Music Academy in Telugu venuvu | Sakshi
Sakshi News home page

చెన్నై మ్యూజిక్ అకాడమీలో తెలుగు వేణువు

Published Sun, Feb 8 2015 12:47 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

చెన్నై మ్యూజిక్ అకాడమీలో తెలుగు వేణువు - Sakshi

చెన్నై మ్యూజిక్ అకాడమీలో తెలుగు వేణువు

 చెన్నై సెంట్రల్
 తెలుగువారి కబుర్లు

 
 మ్యూజిక్ అకాడమీ... సంగీత కళాకారులకు అత్యున్నత వేదిక...
 ఇంచుమించుగా భారతరత్నతో సమానమైన ‘సంగీతకళానిధి’ తో గౌరవ సత్కారం అందించే అకాడమీ...
 బాలమురళి, పినాకపాణి, నేదునూరి వంటి తెలుగు వారు ఆ గౌరవాన్ని దక్కించుకున్నది ఈ వేదికపైనే!
 ఎంతో ఘనచరిత్ర గల చెన్నై మ్యూజిక్ అకాడమీకి కార్యదర్శిగా ఎంపికైన మొట్టమొదటి తెలుగు తేజం
 పప్పు వేణుగోపాలరావు.

 
 బాల్యంలోనే ‘సరస వినోదిని’ సమస్యలను ఛందోబద్ధంగా పూరించిన మేధావి...
 సంస్కృతాన్ని గుండెలకు హత్తుకున్నారు... అవధానాలెన్నో చేశారు...
 మ్యూజిక్ అకాడమీకి పప్పు వేణుగోపాలరావు చేసిన, చేస్తున్న సేవ గురించి...

 
 బొబ్బిలిలో జన్మించిన పప్పు వేణుగోపాలరావు విజయనగరంలో తన స్నేహితులందరితోపాటు సంగీత కళాశాలకు వెళ్లి సంగీతం నేర్చుకున్నారు. సంగీత కుటుంబాలతో పరిచయం పెంచుకున్నారు. కర్ణాటక సంగీత రాజధాని అయిన చెన్నై వచ్చేసరికి సంగీతానికి బాగా నిప్పు అంటుకుంది. అపారమైన అభిమానం. ఇలా సంగీత సాహిత్య సమలంకృతులయ్యారు.
 
 తమిళనాడులో ఎంబాయర్ విజయరాఘవాచార్య అని పెద్ద హరికథకుడు. చాలా అరుదుగా మాత్రమే లభించే ‘సంగీత కళానిధి’ బిరుదు అందుకున్న మహోన్నతులు. బిరుదు ప్రదాన సమయంలో ఆంధ్రదేశంలో హరికథ గురించి మాట్లాడమని పప్పువారిని అభ్యర్థించారు. ఇంకేముంది... విజయనగర వాస్తవ్యులయిన పప్పువారు అదే విజయనగరం వాస్తవ్యులైన శ్రీమదజ్జాడ ఆదిభొట్ల నారాయణదాసు గారి గురించి అనర్గళంగా ఉపన్యసించారు. భాష మీద పూర్తి నియంత్రణ ఉన్న వేణుగోపాలరావు ఉపన్యాసాన్ని మ్యూజిక్ అకాడమీ ప్రేక్షకులు కన్నార్పకుండా, చెవులు రిక్కించి మరీ విన్నారు.
 
  ‘బెస్ట్ డెమాన్‌స్ట్రేషన్’ బహుమతి ఇచ్చారు. అలా మొత్తం ఏడు సంవత్సరాలు బెస్ట్ డెమాన్‌స్ట్రేషన్ అందుకున్నారు పప్పువారు. ప్రతి సంవత్సరం ఆయనకే బహుమతులు వస్తూండటంతో, ఆయనకు అడ్డుకట్ట వేయాలనుకున్నారు అక్కడివారు. శాస్త్రం తెలిసిన వాళ్లను తీసుకునే ఎక్స్‌పర్ట్స్ కమిటీ లైఫ్ మెంబర్‌గా కూర్చోబెట్టారు. ఉద్యోగ విరమణ అయ్యాక, ‘మ్యూజిక్ అకాడమీకి సెక్రటరీ పదవిని అలంకరించమన్నారు. ఏకగ్రీవమైతేనే అంగీకరిస్తాన’ న్నారు పప్పువారు. ఆమోదించారు కమిటీవారు.
 
 2008లో మొదటిసారి ఒక తెలుగు వ్యక్తి మ్యూజిక్ అకాడమీ కార్యదర్శి అయ్యారు. ‘విద్వత్సభై’ గా పిలవబడే మ్యూజిక్ అకాడమీలో అనేక మార్పులు చేశారు. ‘అడ్వాన్స్ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్’ ను ప్రారంభించి, సంగీతంలో అపారమైన  పాండిత్యం, త్రిమూర్తుల కీర్తనలు పాడగలిగిన ఏడెనిమిది మందికి ఇందులో చేరే అర్హత కల్పించారు. ఇది ఇది పూర్తిగా ఉచితం. సంగీత కళానిధుల చేత వీరికి సంగీతపాఠాలు నేర్పించి, వాళ్లను పండితులుగా తీర్చిదిద్దడంలో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ వచ్చి, విప్రోలో ఉద్యోగం వదులుకున్నవారు కూడా ఇందులో చేరడానికి ఆసక్తి కనపరిచేంత అద్భుతంగా రూపొందించారు.
 
 మ్యూజిక్ అకాడమీకి మంచి గ్రంథాలయం ఉంది. అయితే ఇంతవరకు ఒక క్యాటలాగు లేకపోవడం ఆశ్చర్యం. ఏ పుస్తకం ఎవరు పట్టికెళ్లిపోతున్నారో తెలియని పరిస్థితి. గ్రంథాలయాన్ని డిజిటలైజ్ చేసి, పాతబడిపోయిన పుస్తకాలను లామినేట్ చేసి, పుస్తకాలను బయటకు ఇవ్వకుండా, అక్కడ మాత్రమే కూర్చుని చదువుకునేలా నిబంధన విధించారు. గ్రంథాలయ భవనాన్ని పునరుద్ధరించారు.
 
 వేణుగోపాలరావు స్నేహితుడు ఆర్.టి.చారి దగ్గర 6,000 గంటల కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు ఉన్నాయి. ఆయన వాటిని సరైన సంస్థకు అందచేయాలనుకున్నారు. 30 లక్షలు ఖర్చుపెట్టి ఆర్కైవ్స్ పెట్టారు. అకాడమీలో ఉన్నవాటితో కలిపి మొత్తం 10,000 గంటల కచ్చేరీలు తయారయ్యాయి. వాటికి సాఫ్ట్‌వేర్ తయారుచేయించి, ఎవరు కోరుకునే కీర్తన వారు వినేలా తయారుచేశారు.
 
 చాలా సంవత్సరాలుగా మ్యూజిక్ అకాడమీలో ఆగిపోయిన ప్రచురణలను పునరుద్ధరించి, ఏ ఏడాది జర్నల్ ఆ ఏడాది వచ్చేలా ప్రారంభించారు. కర్ణాటక సంగీతంలో నొటేషన్‌లో వచ్చిన మొట్టమొదటి పుస్తకం సుబ్బరామదీక్షితులు ‘సంగీత సంప్రదాయ ప్రదర్శిని’ 1200 పుటల ఈ గ్రంథాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ఇంగ్లీషులో ప్రచురణ ప్రారంభించారు. ఇప్పటికి ఐదువాల్యూమ్స్ ఆయన సంపాదకత్వంలో పూర్తయ్యాయి. ఇవేకాకుండా ఆయన సంపాదకత్వంలో అపురూపమైన 15 పుస్తకాలు వచ్చాయి. డిసెంబర్ సీజన్‌లో ఉదయం ఎనిమిది గంటలకు నిర్వహించే లెక్చర్ డిమాన్‌స్ట్రేషన్‌లలో, సంగీతంలో ఒకే లాంటి రాగాల గురించి టెక్నికల్ విషయాల గురించి ప్రస్తావిస్తారు. కచేరీలకు ఎంతమంది హాజరవుతారో, వీటికి కూడా అంతమంది వచ్చేలా చేసిన ఘనత పప్పువారిది.
 
 ఇక్కడకు వచ్చే జనం పెరిగారు. లెక్చర్ ఇచ్చినవాళ్లు మాత్రమే వినే స్థాయి నుంచి పెద్ద హాల్‌లోకి మార్చండన్న డిమాండ్ వచ్చే స్థాయికి తీసుకువెళ్లారు. కర్ణాటక సంగీత రాజధాని చెన్నై. ఎంతో ఘనత ఉన్న చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో రిసెర్స్ సెంటర్ ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నారు వేణుగోపాలరావు. మ్యూజిక్ అకాడమీలో ఈ సెంటర్ ప్రారంభిస్తే టుంకూరు (బెంగళూరు దగ్గర ) యూనివర్సిటీ వారు అఫిలియేషన్ ఇస్తామన్నారు. దీనికి డెరైక్టర్ కూడా పప్పు వారే.
 మ్యూజిక్ అకాడమీ అంటే మైలాపూర్ కాదు. ఇదొక ప్రపంచం. పాశ్చాత్యం, జానపదం, హిందూస్తానీ... అన్నిటి మీద విశ్లేషకుల చేత మాట్లాడించారు. అకాడమీ కాదు అకడమిక్ సెంటర్ అనిపించారు అచ్చ తెలుగు తేజం పప్పు వేణుగోపాలరావు.
  - డాక్టర్ పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement