తమిళదేశంలో తెలుగు గ్యాలరీ
చెన్నై సెంట్రల్
తెలుగువారి కబుర్లు
ఎన్‌టిర్ ఏఎన్నార్ శివాజీ గణేశన్... వంటి సినీతారలు; వైఎస్‌రాజశేఖరరెడ్డి, కరుణానిధి, సుర్జీత్ సింగ్ బర్నాలా... వంటి రాజకీయ నేతలు; ఎవిఎం... విజయ వాహినీ వంటి సినీ రంగ సంస్థల సుప్రసిద్ధులు... ఇలా ఎందరినో ఎంతో సాదరంగా ఆహ్వానించి, చెన్నపట్టణంలోని ప్రముఖుల గృహాలను అందంగా తీర్చిదిద్దిన చరిత్ర... నూట పది సంవత్సరాలుగా చెన్నపట్టణంతో మమేకమై ఉన్న యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీది.
సుమారు అరవై ఏళ్లుగా తమిళనాడు రాజ్‌భవన్ అలంకరణ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీదే! అక్కడి ఇంటీరియర్, గవర్నరును చూడటానికి వచ్చిన వారికి బహుమతులు వంటివన్నీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ చేతుల మీదుగానే సాగుతాయి.
తమిళనాడు మాజీ గవర్నరు సుర్జీత్‌సింగ్ బర్నాలా మంచి చిత్రకారుడు. ఆయన వేసిన బొమ్మలన్నిటికీ ఈ ఆర్ట్ గ్యాలరీ వారే ఫ్రేము చేయాలి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీకరుణానిధి ఈ ఆర్ట్ గ్యాలరీకి సుమారు 60 సంవత్సరాలుగా నిత్య వీక్షకులు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని తంజావూరు విధానంలో గ్లాస్ పెయింట్ చేసిన ఘనత కూడా యతిరాజ్ గ్యాలరీకి ఉంది...ఎక్కడా లేని విధంగా థాయ్‌లాండ్ సీత, కామధేనువు ఎంబాసింగ్ వర్క్, గోల్డ్ ప్లేటెడ్ వెంకటేశ్వర స్వామి ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేకం. వరలక్ష్మి అమ్మవారు, వెన్న కృష్ణుడు, శివుడు, ఆండాళ్... చిత్రాలన్నీ వంద సంవత్సరాలుగా ఈ ఆర్ట్ గ్యాలరీని మ్యూజియంగా మార్చాయి. ఎన్నో ఆటుపోట్లు మరెన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ కూడా కళా సేవ చేయడం మానలేదు ఈ ఆర్ట్ గ్యాలరీ. తంజావూరు కళాచిత్రాలతో పాటు ఇతర ఇంటీరియర్ వస్తువులను కూడా తయారుచేయడం ప్రారంభించి, నవ్యతను ఆకళింపు చేసుకుంటోంది యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ.
తంజావూరు పెయింటింగులు
ఓల్డ్ మద్రాసు, ఓల్డ్ కలకత్తా, ఓల్డ్ ఢిల్లీ ఫొటోలు, పెయింటింగ్‌లు కావాలంటే యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీని సందర్శించవలసిందే. చెన్నైలోని వారినే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రముఖులనూ ఆకర్షిస్తున్న సంస్థ ఇది. పల్లెల్లో దేవాలయాలకు ఇక్కడి నుండే తంజావూరు పెయింటింగ్‌లను విరివిగా తీసుకువెతుంటారు. ఎక్కడో ఒంగోలు నుంచి చెన్నపట్టణం వచ్చి, తెలుగువారి కీర్తి బావుటాను విదేశాల వరకు రెపరెపలాడించింది లక్ష్మీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ.
తంజావూరును ఆంధ్రనాయక రాజులు పరిపాలించారు. నేటికీ అక్కడ తెలుగు వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. చిత్రలేఖనంలో తంజావూరు శైలి విలక్షణం. ఎంతో శ్రమకోర్చి ఈ బొమ్మలను తయారుచేయడం ఒక ఎత్తయితే, వాటికి అందమైన, విలక్షణమైన ఫ్రేములు అమర్చడం మరో ఎత్తు. బంగారు రేకులతో తయారయ్యే ఈ తంజావూరు చిత్రాలు ఇంటికి అందాన్ని, దైవత్వాన్ని తీసుకువస్తాయి. ఇంతకీ ఈ ఆర్ట్‌గ్యాలరీని ఎవరు నెలకొల్పారంటారా... అక్కడికే వెళ్దాం..
ఒంగోలు నుంచి మద్రాసుకు...
రామానుజకూటం యతిరాజయ్య ఓ వ్యాపారవేత్త. మంచి వ్యాపారం చేసి ధనం సంపాదించాలనే ఉద్దేశంతో ఒంగోలు నుంచి సుమారు 1890 ప్రాంతంలో మద్రాసు ప్రెసిడెన్సీకి కుటుంబంతో తరలి వచ్చారు. కొంతకాలం ఏదో ఒక పనిచేశారు. కాని ఆయనకు చేస్తున్న పని మీద తృప్తి కలగలేదు. ఇంకా ఏదో చేయాలని తపన నానాటికీ పెరుగుతూ వచ్చింది. 1905 నాటికి ఆయన లక్ష్యసాధన కార్యరూపం దాల్చింది. తను అనుకున్న వ్యాపారం ప్రారంభించారు. ప్లైవుడ్, గ్లాస్, ఫొటో ఫ్రేమ్స్... వంటి వస్తువులతో ‘యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’ అని సంస్థను మద్రాసు ప్యారిస్ కార్నర్‌లో దేవరాజ్‌ముదలి వీధిలో ప్రారంభించారు. సుమారు లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభమైన వ్యాపారం, మొదట్లో కొంత నిరాశ నే మిగిల్చింది. ఆయన ఎంత పట్టుదలతో ప్రారంభించారో అంతే పట్టుదలతో వ్యాపారాన్ని వృద్ధిచేశారు. చీమలాగ నిరంతరం కృషి చేశారు. గ్లాస్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ చేయడం కూడా ప్రారంభించారు. చీమలాగే ధనం కూడబెట్టారు. కేవలం చెక్కలు, గ్లాస్ వంటి వాటితో ప్రారంభమైన ఈ గ్యాలరీ తంజావూరు పెయింటింగ్‌ల వంటి ఇంటీరియర్స్‌ను తయారుచేసి అమ్మడం ప్రారంభించారు. బంగారు రేకులతో తయారయ్యే ఈ కళాకృతులను చూసిన సినీవర్గీయులు, అవి తమ ఇళ్లల్లో ఉంటే ఇంటికి అందమే కాకుండా పవిత్రత కూడా వస్తుందని భావించి వాటిని కొనుగోలు చేసి కుడ్యాలకు అలంకరించారు. అలా ఈ వ్యాపారాన్ని సినీరంగ ప్రముఖులంతా ప్రోత్సహించారు. విదేశాలలో ఉన్న మిత్రులకు భారతీయ సంస్కృతి గురించి తెలియచేయడానికి చిహ్నంగా తంజావూరు చిత్రాలను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు.
తొలిసారి... బెల్జియం గ్లాస్...
ఎ.వి.ఎం. విజయవాహినీ వారు... తమ స్టూడియోలకు కావలసిన ఇంటీరియర్ డెకొరేషన్ అంతా యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీలోనే కొన్నారు. ఈ అలంకరణతో వారి స్టూడియోలు అందాల బృందావనాలయ్యాయి. ఎన్‌టిఆర్, ఎంజిఆర్, ఏఎన్నార్, శివాజీగణేశన్... వంటి చలనచిత్ర కథానాయకులు ఈ గ్యాలరీకి నిత్య సందర్శకులు. వారివారి ఇళ్లను యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ వారి అలంకరణతో తీర్చిదిద్దుకున్నారు. బెల్జియం గ్లాస్‌ను మొట్టమొదటగా దిగుమతి చేసుకున్న ఘనత వీరిదే. రామానుజకూటం యతిరాజయ్యకు ముగ్గురు సంతానం. మూడవ తరంలో పదిహేను మంది, నాలుగవ తరంలో సుమారు 30 మంది. ఈ నాలుగవ తరంలోని వారే అమ్మాయి లక్ష్మి, అల్లుడు సుబ్బారావు. వీరు తమ ముత్తాత గారు ప్రారంభించిన ‘యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’ని ‘లక్ష్మీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’గా టి.నగర్‌లో ప్రారంభించి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లారు. మూడు లక్షల టర్నోవర్‌తో ఉన్నప్పుడు వ్యాపార వారసత్వాన్ని స్వీకరించి 50 లక్షల టర్నోవర్‌గా పెంచారు.
- డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
ఇన్‌పుట్స్: సుకేల సుబ్బారావు, లక్ష్మి (నాలుగవ తరం వారు)
వై.ఎస్. ప్రమాణ స్వీకారానికి కూడా...
దివంగత నందమూరి తారకరామారావు భార్య బసవతారకమ్మ గతించినప్పుడు ఆమెను చిరస్మరణీయంగా తన కన్నులెదుట నిలుపుకునేందుకు వీలుగా ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుగా ఉండే చిత్రపటాన్ని వీరి చేత చేయించుకున్నారు.
డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో, ఆయన కుర్చీలో కూర్చుని ఉన్న ఫొటోను అందచేసే అవకాశం యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీనే వరించింది. తమిళులు, ఉత్తరాదివారు, ఎన్నారైలు... అందరూ ఈ ఆర్ట్ గ్యాలరీ కస్టమర్లే. ప్రస్తుతం అందరూ పూజగదిలో తంజావూరు చిత్రాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో, ఈ చిత్రాలు స్థిరంగా నిలబడుతున్నాయి.