Chennai International Airport
-
20 మంది విమానాశ్రయ అధికారుల బదిలీ
కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయంలో ఆగమేఘాలపై 20 మంది అధికారులను బదిలీ చేశారు. వివరాలు.. గత నెల 14 ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులోని 113 మంది ప్రయాణికులను గంటల తరబడి తనిఖీల పేరిట నిర్బంధించడమే కాకుండా వారి నుంచి రూ. 14 కోట్ల విలువైన 13 కిలోల బంగారం, 120 ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా 204 సెల్ఫోన్లు, సిగరెట్ కట్టలు. ప్రాసెస్ చేసిన కుంకుమపువ్వును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో అక్రమంగా సరకులు రవాణా అవుతున్నాయన్న సమాచారం మేరకు కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు హడావుడిగా ఆ విమానాన్ని నిలిపి మొత్తం 186 మంది ప్రయాణికులను సోదాలు చేశారు. వారిలో 113 మంది ప్రయాణికులు స్మగ్లర్లుగా అనుమానించారు. తర్వాత వారి వద్ద అర్ధరాత్రి వరకు విచారించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నలుగురు కస్టమ్స్ సూపరింటెండెంట్లు, 16 మంది ఇన్స్పెక్టర్లను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. -
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మరో కొత్త టర్మినల్
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,260 కోట్లతో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవంతి(ఫేజ్–1)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అద్భుత రీతిలో ఈ టర్మినల్‌కు తుదిరూపునిచ్చారు. ‘ సంవత్సరానికి 2.3 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఎయిర్పోర్ట్ నూతన టర్మినల్ ఏర్పాటుతో ఇక మీదట ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది’ అని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు సంప్రదాయాల్లో ఒకటైన కొల్లం(రంగోళీ), విశేష ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాలు, భరతనాట్యం, రాష్ట్రంలోని ప్రకృతి సోయగాలు, వారసత్వంగా వస్తున్న స్థానిక చీరలు ఇలా తమిళనాడుకే ప్రత్యేకమైన విశిష్టతల మేళవింపుగా భిన్న డిజైన్లతో నూతన టర్మినల్‌ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. నూతన టర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతోపాటు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా పాల్గొన్నారు. దీంతోపాటు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో చెన్నై–కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘అద్భుత నగరాలకు అనుసంధానించిన వందేభారత్‌కు కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్‌చేశారు. కొత్త రైలురాకతో రెండు నగరాల మధ్య ప్రయాణకాలం గంటకుపైగా తగ్గనుంది. రాష్ట్ర రాజధాని, పారిశ్రామిక పట్టణం మధ్య ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు ఇదే కావడం విశేషం. సేలం, ఈరోడ్, తిరుపూర్‌లలోనూ ఈ రైలు ఆగుతుంది. బుధవారం మినహా అన్ని వారాల్లో ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి. వివేకానంద హౌజ్‌ను సందర్శించిన మోదీ చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నగరంలోని వివేకానంద హౌజ్‌ను దర్శించారు. 1897లో స్వామి వివేకానంద ఈ భవంతిలోనే తొమ్మిదిరోజులు బస చేశారు. రామకృష్ణ మఠ్ 125వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడారు. ‘ రామకృష్ణమఠ్ అంటే నాకెంతో గౌరవం. నా జీవితంలో ఈ మఠం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది. పాశ్చాత్య దేశాలకు పయనంకాకముందు వివేకానందుడు బసచేసిన ఈ భవంతిని దర్శించడం నాకు దక్కిన ఒక మంచి అవకాశం. ఇక్కడ ధ్యానం చేయడం ప్రత్యేకమైన అనుభవం. ఇది నాకెంతో ప్రేరణను, కొండంత బలాన్ని ఇస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో పురాతనమైన నాటి గొప్ప ఆలోచనలు నేడు ముందు తరాలకు అందుతుండటం చాలా సంతోషదాయకం’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి మోదీ ఘన నివాళులర్పించారు. -
దొంగ తెలివి.. కుక్కర్లో 8 కిలోల బంగారం
తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ సిబ్బంది ఎన్ని తనిఖీలు చేస్తున్నా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో కుక్కర్, మిక్సీలో 8.17 కిలోల బంగారాన్ని తీసుకొచ్చి దొరికిపోయారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో 104 మంది ప్రయాణికులు వచ్చారు. కస్టమ్స్ సిబ్బంది వారిని తనిఖీ చేశారు. చెన్నై, రామనాథపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం రావడంతో ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వారి లగేజీలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాల్లో 8.17 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు. వాటి విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
చెన్నైకి చేరుకున్న జిన్‌పింగ్
చెన్నై : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొద్దిసేపటి క్రితం చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామిలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చూసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ జిన్‌పింగ్ ముందుకు సాగారు. జిన్‌పింగ్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐటీసీ చోళ హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన మహాబలిపురం బయలుదేరుతారు. నేడు, రేపు రెండు రోజులపాటు చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇది మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక సమావేశం. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురం చేరుకున్నారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలు పంచుకునేందు ఈ సమావేశాలు వీలు కల్పిస్తాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది. -
చెన్నైలో భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, చెన్నై: చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. సింగపూర్‌కు తరలిస్తున్న దాదాపు రూ. 1.9 కోట్ల విలువచేసే నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మీనంబాక్కం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు అమెరికన్ డాలర్స్, యూరో కరెన్సీ తరలుతున్నట్టు లభించిన పకడ్బందీ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేశారు. పర్యాటక వీసాతో అనుమానాస్పదంగా కనిపించిన పెరంబూరుకు చెందిన హమీద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఓ బ్యాగులో రూ.17 లక్షల విలువగల అమెరికన్ డాలర్లు, యూరో కరెన్సీ బయటపడింది. దీంతో అతడిని విచారించగా, ఓ వ్యక్తి ఇలాంటి బ్యాగులను తనతోపాటు పలువురికి ఇచ్చినట్టు చెప్పాడు. ఈ సమాచారంతో సింగపూర్‌కు వెళ్లే అన్ని విమానాలను అధికారులు తనిఖీ చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఇస్మాయిల్, తాజుద్దీన్, మహ్మద్‌లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీ చేశారు. అందులో రూ.1.73 కోట్ల విలువగల అమెరికన్ డాలర్లు బయటపడ్డాయి. దీంతో ఆ నలుగురిని అరెస్టు చేసి, బ్యాగ్‌లను ఇచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.