కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయంలో ఆగమేఘాలపై 20 మంది అధికారులను బదిలీ చేశారు. వివరాలు.. గత నెల 14 ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులోని 113 మంది ప్రయాణికులను గంటల తరబడి తనిఖీల పేరిట నిర్బంధించడమే కాకుండా వారి నుంచి రూ. 14 కోట్ల విలువైన 13 కిలోల బంగారం, 120 ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా 204 సెల్‌ఫోన్‌లు, సిగరెట్ కట్టలు.
ప్రాసెస్ చేసిన కుంకుమపువ్వును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో అక్రమంగా సరకులు రవాణా అవుతున్నాయన్న సమాచారం మేరకు కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు హడావుడిగా ఆ విమానాన్ని నిలిపి మొత్తం 186 మంది ప్రయాణికులను సోదాలు చేశారు. వారిలో 113 మంది ప్రయాణికులు స్మగ్లర్లుగా అనుమానించారు.
తర్వాత వారి వద్ద అర్ధరాత్రి వరకు విచారించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నలుగురు కస్టమ్స్ సూపరింటెండెంట్లు, 16 మంది ఇన్‌స్పెక్టర్లను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment