సాక్షి, చెన్నై: చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. సింగపూర్‌కు తరలిస్తున్న దాదాపు రూ. 1.9 కోట్ల విలువచేసే నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మీనంబాక్కం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు అమెరికన్ డాలర్స్, యూరో కరెన్సీ తరలుతున్నట్టు లభించిన పకడ్బందీ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేశారు. పర్యాటక వీసాతో అనుమానాస్పదంగా కనిపించిన పెరంబూరుకు చెందిన హమీద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద ఓ బ్యాగులో రూ.17 లక్షల విలువగల అమెరికన్ డాలర్లు, యూరో కరెన్సీ బయటపడింది. దీంతో అతడిని విచారించగా, ఓ వ్యక్తి ఇలాంటి బ్యాగులను తనతోపాటు పలువురికి ఇచ్చినట్టు చెప్పాడు. ఈ సమాచారంతో సింగపూర్‌కు వెళ్లే అన్ని విమానాలను అధికారులు తనిఖీ చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఇస్మాయిల్, తాజుద్దీన్, మహ్మద్‌లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీ చేశారు. అందులో రూ.1.73 కోట్ల విలువగల అమెరికన్ డాలర్లు బయటపడ్డాయి. దీంతో ఆ నలుగురిని అరెస్టు చేసి, బ్యాగ్‌లను ఇచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
చెన్నైలో భారీగా హవాలా నగదు పట్టివేత
Published Fri, Oct 14 2016 3:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement